160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
ABN , Publish Date - Apr 30 , 2024 | 04:31 AM
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 160 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. 23 లోక్‌సభ స్థానాల్లోనూ గెలుస్తామని తెలిపారు.
23 ఎంపీ స్థానాలు కూడా.. లోకేశ్ ధీమా
రాష్ట్రాన్ని ఒడ్డెక్కించాలంటే
బాబుకే సాధ్యం
మేం రాగానే అమరావతి నిర్మాణ పనులు
రూ.2 వేల కోట్లతో ప్రారంభిస్తాం
ఆంధ్రులు గర్వపడేలా పూర్తిచేస్తాం
కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు,
పరిశ్రమలను మళ్లీ రప్పిస్తాం
గత ఐదేళ్లలో పనులు కొనసాగించి ఉంటే
ఏటా 5 వేల కోట్ల ఆదాయం వచ్చేది
జగన్ ఈ రాబడికి గండికొట్టాడు
ఎన్నికల తర్వాత ఏపీ వదిలిపోతాడు
కర్నూలు లోక్‌సభ పరిధిలో
ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి
ఐదేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం
నా అవసరం పార్టీకే ఎక్కువ
అయినా అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టే
నడుచుకుంటా: టీడీపీ యువ నేత
‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 160 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. 23 లోక్‌సభ స్థానాల్లోనూ గెలుస్తామని తెలిపారు.
రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబే ప్రజలకు గుర్తుకొస్తారని చెప్పారు. 1995లో, 2014లో, ఇప్పుడు అవే క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నాయని.. ఇటువంటి దయనీయమైన స్థితిలో రాష్ట్రాన్ని ఒడ్డెక్కించాలంటే ఆయనకే సాధ్యమని స్పష్టం చేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని.. కానీ 2019లో గద్దెనెక్కిన జగన్ రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకుపోయాడని విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆయన రాష్ట్రాన్ని వదిలిపోవడం ఖాయమన్నారు.
రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరంభించి త్వరితగతిన పూర్తిచేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రూ.1,500 కోట్ల నుంచి రూ 2,000 కోట్లతో పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభిస్తామన్నారు.
తన అవసరం పార్టీకే ఎక్కువని తాను అభిప్రాయపడుతున్నానని.. అధిష్ఠానం తన పాత్రను ఎలా నిర్ణయిస్తే భవిష్యత్తులో అదేరీతిగా నడుచుకుంటానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కర్నూలు పార్లమెంటు పరిధిలోని వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ..
ప్రశ్న: ఈ ఎన్నికల్లో మీ కూటమికి ఎన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు వస్తాయని అనుకుంటున్నారు?
లోకేశ్: కచ్చితంగా 160 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంటు స్థానాలు వస్తాయి.
అంత సానుకూలమైన వాతావరణం మీకు కనిపిస్తోందా?
కచ్చితంగా! రాష్ట్రమంతటా జగన్ విధ్వంసక పాలనపై చాలా కోపం, ఆవేదన ఉన్నాయి. పిల్లల భవిష్యత్‌ను నాశనం చేశాడన్న బాధ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. సీఎం అంటే భావితరాల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడై ఉండాలి. కానీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా ఏ ఒక్కరోజూ బాధ్యతగా నడుచుకోలేదు. రాబోయే తరాలను చాలా నిర్లక్ష్యం చేశాడు. అందుకే రాష్ట్రమంతటా జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
రాజధాని అమరావతిపై మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?
ఆగిపోయిన అమరావతి పనులను ప్రారంభించి పూర్తిచేస్తాం. గతంలో ఇక్కడకు రావాలనుకున్న కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పరిశ్రమలను మళ్లీ రప్పిస్తాం. అమరావతి ఇమేజ్ పెంచుతాం.
జగన్ గత ఐదేళ్లలో రాజధాని పనులను యథావిధిగా కొనసాగించి ఉంటే ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేది. పిచ్చి పిచ్చి పనులతో ఆ ఆదాయానికి గండికొట్టాడు. మేమైతే 5 కోట్ల ఆంధ్రులు గర్వపడేలా అమరావతి నిర్మాణం పూర్తిచేసి తెలుగుజాతి సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాం. అమరావతి బ్రాండ్‌ను పునరుద్ధరిస్తాం. ఆ సత్తా మాకుంది.
ప్రభుత్వ ఖజానా సున్నా కదా! పైగా లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారు. మీరు కూడా ఈ ఎన్నికల్లో చాలా హమీలిస్తున్నారు. ఏమిటీ మీ ధైర్యం?
చంద్రబాబే మాధైర్యం.. ప్రజల ధైర్యం కూడా! బాబు తొలిసారి సీఎం అయినప్పుడు 1995లోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్టంగానే ఉన్నాయి. అటువంటి సమయంలో పగ్గాలు చేపట్టి 2004 నాటికి మిగులు బడ్జెట్‌లోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు చాలెంజ్‌గా తీసుకుని రాష్ట్రాన్ని గాడినపెట్టారు. కష్టకాలం వచ్చినపుడల్లా రాష్ట్ర ప్రజలకు ఆయనే గుర్తుకొస్తారు. ఇప్పుడు జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం కూడా చంద్రబాబుకే సాధ్యమని వారు గుర్తించారు.
ఎకనమిక్ యాక్టివిటీని సక్రమంగా చేయగలిగితే చిత్తూరు, విశాఖ వంటి కొన్ని జిల్లాల నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున ఆదాయం వస్తుంది.
పోలవరం గురించి ఏం చెబుతారు?
ముందు ఏం లోపాలున్నాయో నిపుణుల కమిటీ అధ్యయనంలో తేలుస్తాం. ఇప్పుడంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. గతంలో మాదిరి ఏళ్ల తరబడి నిర్మాణాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో చాలా ఆలస్యమవుతూ వచ్చింది.
కేంద్రం మాకు సహకరిస్తుందన్న నమ్మకం పూర్తిగా ఉంది. వచ్చే ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తిచేసి ప్రారంభోత్సవం కూడా చేస్తాం.
రాజధాని అమరావతిలో వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు కదా! దానిని వెంటనే చేపడతారా?
రూ.4 వేల కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని గతంలో అనుకున్నాం. మాస్టర్‌ప్లాన్‌లోనూ చేర్చాం. ఆ బ్యారేజీ అమరావతికి అవసరమే అయినా ఇప్పుడే అంత ఆవశ్యకం కాదు.
దీనికన్నా ముందు కర్నూలు పార్లమెంటు పరిధిలో శంకుస్థాపనలు జరుపుకొని ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. అక్కడ ఆ ప్రాజెక్టుల అవసరం ఎక్కువగా ఉంది.
ఆ ప్రాంత మహిళలు తాగునీటికోసం 3-4 కిలోమీటర్లు నడచివెళ్లడం యువగళం పాదయాత్రలో స్వయంగా గమనించా. అది నాకు చాలా బాధ అనిపించింది.
అక్కడ ప్రతి ఎకరాకూ సాగునీరు, ప్రతి గడపకూ తాగునీరందించాలి. వైకుంఠపురం పనులు మూడేళ్ల తర్వాత ప్రారంభించినా సరిపోతుందని నా భావన.
జగన్ ప్రభుత్వం కాపులు, ముస్లింలకు గత పథకాలన్నీ రద్దుచేసి కూడా తాము ఆ వర్గాలకు చాలా చేశామని ప్రచారం చేసుకుంటోంది. పైగా మీ కూటమిపై దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవాలు వివరించడంలో మీ నాయకులు విఫలమవుతున్నారా?
2019 ఎన్నికల్లో మాకు దూరమైన వర్గాలన్నీ ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యాయి. ఆ వర్గాలకు ఉన్న పథకాలను రద్దుచేసి వారి సంక్షేమంలో జగన్ కోతపెట్టాడు. దాడులు చేయించడంతో పాటు ఎన్నో విధాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆయా ఘటనలను జనాలకు మా నాయకులు వివరిస్తూనే ఉన్నారు.
అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వంలో మీ పాత్ర?
నా అవసరం పార్టీకి ఎక్కువగా ఉందని నమ్ముతున్నాను. అయితే అధిష్ఠానం నా పాత్రను ఎలా నిర్ణయిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటా! -మంగళగిరి