భారీ పెట్టుబడికి రిలయన్స్ సై!
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:20 AM
రాష్ట్రంలో మూడేళ్లలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల్లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
రూ.65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు
8 జిల్లాల్లో ఒక్కోటీ 130 కోట్లతో ఏర్పాటు
బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం
సీబీజీ ప్లాంట్లతో ప్రభుత్వానికి రూ.57,650 కోట్ల ఆదాయం
రెండున్నర లక్షల మందికి ఉపాధి
ప్రభుత్వం, పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీయాలి
అప్పుడే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాకారం
క్లీన్ ఎనర్జీ విధానంతో సత్ఫలితాలు: సీఎం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడేళ్లలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల్లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంగళవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంధన శాఖ అధికారులు, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందా(ఎంవోయూ)లు కుదుర్చుకున్నారు. 8 జిల్లాల్లో ఒక్కొక్కటీ రూ.130 కోట్ల విలువతో 500 సీబీజీ ప్లాంట్లను రిలయన్స్ నెలకొల్పుతుంది. వీటిని మూడేళ్లలో స్థాపించి రెండున్నర లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ పేర్కొనడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. రిలయన్స్‌తో ఒప్పందం చరిత్రాత్మకమన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు క్లీన్ ఎనర్జీ-2024 పాలసీ తీసుకొచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు స్పీడ్ అఫ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని.. పారిశ్రామిక సంస్థలు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విధానం అమలు చేయాలని సూచించారు. ఈ విధంగా ప్రభుత్వం, పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీస్తే.. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ‘ప్రభుత్వం పెట్టుబడుల రంగంలో తీసుకొచ్చిన నూతన విధానాలు సత్ఫలితాలిస్తున్నాయి. భారీ ప్రాజెక్టులకు ఎస్కార్ట్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నాం. ఇప్పుడు రిలయన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించాం. రూ.65 వేల కోట్లతో సీబీజీ ప్లాంట్లు స్థాపిస్తే రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయం లభిస్తుంది. రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్రప్రభుత్వం తరఫున ఘన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు ఇస్తాం. వాటి ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయండి’ అని రిలయన్స్‌కు సీఎం సూచించారు. క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవారు భారతీయులేనని చెప్పారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ విధానాన్ని తాము అమలు చేస్తున్నామని వెల్లడించారు.
2 వేల ప్లాంట్లలో నాలుగో వంతు మనకే: లోకేశ్
రిలయన్స్‌తో ఒప్పందంపై ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తంచేశారు. తాము నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందన్నారు. కొద్దిరోజుల కిందట ముంబైలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్న అనంత్ అంబానీతో జరిపిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం చేసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 2 వేల సీబీజీ ప్లాంట్లను పెట్టాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుందని.. వాటిలో నాలుగో వంతు.. అంటే 500 ప్లాంట్లను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను స్థాపించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో ఎలాంటి సహకారమైనా అందించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, రిలయన్స్ సంస్థల ఎగ్జికూటివ్ డైౖరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బషీర్ అహ్మద్ షిరాజీ, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పోర్టు ఆధారిత వసతులు కొరియా కెగ్జిమ్ సదస్సులో కార్యదర్శి సురేశ్‌కుమార్ వెల్లడి
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని.. 2047 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదుగుతుందని రాష్ట్ర మౌలిక సదుపాయాలు శాఖ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ అన్నారు. మంగళవారం సియోల్‌లో ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా (కెగ్జిమ్) నిర్వహించిన 29వ ఆర్థిక అభివృద్ధి సహకార నిధి సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. 2030నాటికి ప్రపంచ స్థాయి నౌకాశ్రయ రాష్ట్రంగా ఏపీ ఉంటుందని వెల్లడించారు.