Share News

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:36 AM

టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది.

Achchennaidu : నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’

  • వంద రోజుల పాలనలోసాధించిన విజయాలపై ప్రజల్లోకి

  • నేడు ప్రకాశం జిల్లాలో పాల్గొననున్న సీఎం

  • మద్దిరాలపాడులో ప్రజలతో ముఖాముఖి

  • వాతావరణం బాగోక సిక్కోలు టూరు రద్దు

అమరావతి/శ్రీకాకుళం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది. ఇది వారం పాటు 26వ తేదీదాకా జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల ప్రభుత్వ సిబ్బంది తమ పరిధిలో ఇంటింటికీ వెళ్లి.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ ఏడు రోజులూ రోజుకో గ్రామం సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారికి ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపిక చేసిన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలన గురించి వివరించాలి. తర్వాత ఆ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి జనం నుంచి వినతులు స్వీకరించాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొదటి రోజు శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. తర్వాత గ్రామసభలో ప్రసంగిస్తారు. ఆయన తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాలని భావించారు. అక్కడ ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడాలనుకున్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం సాయంత్రం వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా వాతావరణం అలానే ఉంటుందని, హెలికాప్టర్లో పర్యటించేందుకు వాతావరణం అనుకూలించదని అధికారులు నివేదించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 05:36 AM