Adani Groups: ఏపీకి అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. చంద్రబాబుకు చెక్ అందజేత
ABN , Publish Date - Sep 19 , 2024 | 07:59 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు.
అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 40 మందికిపైగా చనిపోయారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. విజయవాడలో బుడమేరు పొంగి.. పదుల సంఖ్యలో కాలనీలు జలమయమయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.
అయితే.. ఆపత్కాలంలో మేమున్నామంటూ ముందుకొస్తున్నారు దాతలు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన వారితోపాటు.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఏపీకి భారీగా విరాళాలు అందించారు. తాజాగా అదానీ గ్రూప్ కూడా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
ఏకంగా రూ.25 కోట్ల విరాళాన్ని అందజేసింది. వరద బాధితుల సహాయార్థం రూ.25 కోట్లు అందిస్తున్నట్టు అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ ప్రకటించారు. సీఎం చంద్రబాబును కలిసిన అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్ల చెక్కును గురువారం అందజేశారు. అదానీ ఫౌండేషన్ చైర్మన్ ప్రీతి అదానీకి, అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీకి బాబు.. కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బీభత్సంతో కుదేలైన ప్రజల జీవితాలను మళ్లీ నిలబెట్టడానికి అదానీ గ్రూప్ సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.