Share News

రిఫ్రిజిరేటర్ల కొను‘గోల్‌మాల్‌’!

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:59 AM

పశుసంవర్థక శాఖలో రెండేళ్ల క్రితం ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజరేటర్ల (ఐఎల్‌ఆర్‌) కొనుగోలులో నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రిఫ్రిజిరేటర్ల కొను‘గోల్‌మాల్‌’!

  • పశుసంవర్ధక శాఖలో రెండేళ్ల క్రితం స్కాం

  • సీఎంవోకు ప్రముఖ కంపెనీ ఫిర్యాదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పశుసంవర్థక శాఖలో రెండేళ్ల క్రితం ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజరేటర్ల (ఐఎల్‌ఆర్‌) కొనుగోలులో నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పశువుల వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు వినియోగించే ఈ రిఫ్రిజరేటర్లకు మార్కెట్‌లో లభించే ధర కన్నా రెట్టింపు చెల్లించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో వైసీపీ అనుకూల సంస్థకు పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారి ఈ కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్లు ఓ ప్రముఖ కంపెనీ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. జాతీయ పశువ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద పశువుల్లో బ్రూసెల్లోసిస్‌, ఎఫ్‌ఎండీ వ్యాధులకు వాడే వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు కోల్డ్‌చైన్‌ సదుపాయాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం వంద శాతం నిధులు భరించింది. ఇందుకోసం మల్టీపుల్‌ స్పెసిఫికేషన్స్‌ జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం విడతల వారీగా దాదాపు 1,700 ఐఎల్‌ఆర్‌లను కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం 2022లో ఏపీకి నిధులు మంజూరు చేసింది.

ఏపీ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టర్‌ ద్వారా టెండర్లు పిలవగా.. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసి జెమ్‌ పోర్టల్‌ ద్వారానే పిలవాలని స్పష్టం చేసింది. దీంతో జెమ్‌ పోర్టల్‌ ద్వారా పశు సంవర్థక శాఖ టెండర్లు పిలిచింది. 15 కంపెనీలు టెండర్‌లో పాల్గొనగా, 13 కంపెనీలు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా రెండు సంస్థలలో పశుసంవర్థక శాఖ రివర్స్‌ టెండరు కింద ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఐఎల్‌ఆర్‌కు రూ.2.04 లక్షలు చెల్లించేందుకు జగన్‌ సర్కార్‌ అనుమతించినట్లు అధికారులు చెప్తున్నారు.


వ్యాక్సిన్‌ పాడవకుండా ఉండాలంటే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినా 72 గంటలు ఫ్రిజ్‌లో చల్లదనం తగ్గకుండా ఐఎల్‌ఆర్‌లో సామర్థ్యం ఉండాలని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ మేరకు ఐదేళ్ల వారంటీతో పని చేసే ఐఎల్‌ఆర్‌లను కొనుగోలు చేశామని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 278 లీటర్ల ఐఎల్‌ఆర్‌... రిఫ్రిజరేటర్ల తయారీలో ప్రముఖ కంపెనీ గోద్రెజ్‌ వద్ద ఇదే మోడల్‌ తక్కువ ధరకు లభిస్తున్నా పశుసంవర్థక శాఖ రూ.లక్షా 20వేలు అదనంగా వెచ్చించిందని సీఎంవోకు ఫిర్యాదు చేసిన కంపెనీ పేర్కొంది.

కాగా, ఐఎల్‌ఆర్‌ల కొనుగోలు వ్యవహారంపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం వివరణ కోరింది. కేంద్రం ఆదేశాల ప్రకారమే జెమ్‌లో టెండర్‌ కోట్‌ చేసిన కంపెనీని రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో ఎంపిక చేసినట్లు చెప్పారు. హారిజెండల్‌ మోడల్‌ ఐఎల్‌ఆర్‌లను కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేసినందున వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రీబిడ్డింగ్‌ మీటింగ్‌లో తమ వద్ద వర్టికల్‌ మోడల్‌ తప్ప హారిజెండల్‌ మోడల్‌ ఐఎల్‌ఆర్‌లు లేవని గోద్రెజ్‌ కంపెనీ రాతపూర్వకంగా తెలియజేసిందని ఆయన వివరించారు.

Updated Date - Oct 01 , 2024 | 05:59 AM