Share News

Amaravati : ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:41 AM

‘రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలి.

Amaravati : ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు

  • ఆహారం సరఫరాకు టెండర్లు

  • 22న ఖరారు చేస్తాంరూ.5కే ఆహారం

  • డ్రైన్ల పూడికతీతకు 50 కోట్లు

  • పది రోజుల్లో పనులు పూర్తి

  • సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

  • చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం

  • మునిసిపల్‌ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలి. వచ్చే పది రోజుల్లో శత శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలి’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఖజానాను ఖాళీ చేసింది.

సాధారణ నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసింది. చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత సీజన్‌లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఆదేశించాం. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో నీరు కలుషితమై వందమందికి డయేరియా సోకింది. వెంటనే అందుకు గల కారణాన్ని గుర్తించడంతో నియంత్రించగలిగాం. మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోలను అధ్యయనం చేస్తున్నాం. సీఆర్‌డీఏను విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం విభిన్న పద్ధతులను అవలంభించింది. వాటన్నింటిపైనా అధ్యయనం చేస్తున్నాం. మరో నెల రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అంటూ మంత్రి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


ఏఐఐబీ ప్రాజెక్టు మరో రెండేళ్లు పొడిగింపునకు చర్యలు

‘గతంలో మా ప్రభుత్వం హయాంలో మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో 24 గంటలు మంచినీటి సరఫరా, మురుగు నీటిపారుదల వ్యవస్థ మెరుగుదల కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.5,350 కోట్లు రుణం తీసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం దానిలో కేవలం రూ.240 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన నిధుల వినియోగానికి రాష్ట్రం తన వాటాను కేటాయించకపోవడంతో ఏఐఐబీ నిధులు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఆ ప్రాజెక్టు గడువు జూన్‌ నెలాఖరుకు ముగిసింది. మా విజ్ఞప్తిపై ఇప్పటికే నెల రోజులపాటు ప్రాజెక్టు గడువును పొడిగించింది. అయితే మరో రెండేళ్లపాటు గడువును పొడిగించాలని బ్యాంకును ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే కనీసం 50 శాతం మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య ఉండేది కాదు. లక్షలోపు జనాభా ఉన్న నగర పంచాయతీల్లో మౌలిక వసతుల మెరుగుకు అమృత్‌ 1, 2 ప్రాజెక్టులను మా ప్రభుత్వ హయాంలో చేపట్టాం. వైసీపీ ప్రభుత్వం దానినీ నీరుగార్చింది. ఆ పథకాలను పునరుద్ధరించి, తిరిగి అమలు చేసేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నాం’ అని మంత్రి నారాయణ వివరించారు.

Updated Date - Jul 19 , 2024 | 04:41 AM