Share News

సెప్టెంబరులోనూ బియ్యం మాత్రమే!

ABN , Publish Date - Aug 20 , 2024 | 05:15 AM

వచ్చే నెల రేషన్‌ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార ఉండదు. సెప్టెంబరు కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు.

సెప్టెంబరులోనూ బియ్యం మాత్రమే!

  • రేషన్‌లో కందిపప్పు, పంచదార ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం

  • అయినా కదలని పౌరసరఫరాల శాఖ

  • జూలైలోనే టెండర్లు పిలిచినా.. ఖరారులో అధికారుల అలసత్వం

  • వచ్చేనెలలోనూ పప్పు, చక్కెర హుళక్కే

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల రేషన్‌ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార ఉండదు. సెప్టెంబరు కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు. ఆగస్టు నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆదేశించింది. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు మాత్రం 2 నెలలుగా ఊరిస్తూ.. ఊహించని రీతిలో పేదలకు షాక్‌ ఇస్తున్నారు.

దాంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల పని తీరులో ఏమాత్రం మార్పు రాలేదని, గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తూ పేదలకు తీరని అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందిస్తామంటూ గొప్పలు చెప్పింది. కానీ ఆ రేషన్‌ సరుకుల్లో ఒక్కొక్కటిగా కోతలు పెడుతూ చివరికి బియ్యం పంపిణీకే పరిమితమైంది.

ఇటీవలే మళ్లీ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై కందిపప్పు, పంచదారను పంపిణీ చేయాలని ఆదేశించింది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 దాటిపోగా... పంచదార కిలో దాదాపు రూ.50కు చేరువైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌ ద్వారా కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కి, పంచదార రూ.17కే అందిస్తుందని పేదలైన కార్డుదారులంతా గంపెడాశలు పెట్టుకున్నారు.


న్యాయ సమీక్ష నుంచి అనుమతి వచ్చినా...

ఆగస్టు నుంచి అక్టోబరు వరకు... 3 నెలలకు సరిపోయేలా మొత్తం 22,500 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్‌ టన్నుల పంచదార సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా గత జూలై నెలలో టెండర్లు ఆహ్వానించింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో రేషన్‌ కార్డుదారులు, ఐసీడీఎస్‌ లబ్ధిదారులకు ప్యాకెట్లలో సరఫరా చేసే కందిపప్పు విలువ సుమారు రూ.394 కోట్లు. అయితే టెండరు విలువ రూ.100 కోట్లు దాటితే చట్ట ప్రకారం న్యాయ సమీక్షకు వెళ్లాల్సి రావడంతో పౌరసరఫరాల శాఖ ఈ టెండరు వివరాలను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపించింది. దీనిపై న్యాయమూర్తి వివరణలు కోరారు.

కార్పొరేషన్‌ సమాధానాలు పంపించేసరికి నెల రోజులు గడిచిపోయాయి. దీంతో ఆగస్టులో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. జ్యుడీషియల్‌ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లకుండా నిలిపివేసింది.

ఇక పంచదార టెండర్లను జోన్ల వారీగా ఆహ్వానించడంతో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ టెండరులో పాల్గొన్న చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్‌ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండరును రద్దు చేసేశారు.

మళ్లీ గత నెలలోనే రెండోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండరులో జోన్ల వారీగా మొత్తం ఆరుగురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మిగిలిన జోన్లకు సంబంధించిన టెండర్లు ఖరారైనప్పటికీ.. మొదటి జోన్‌ (శ్రీకాకుళం, విజయనగరం, ఏఎ్‌సఆర్‌ మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు) టెండర్ల ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు.

ఈ కారణంగా గత రెండు నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా నిలిపివేశారు. దీంతో వచ్చేనెల 7న వినాయక చవితి పండగకు పేదల ఇళ్లలో పప్పులు ఉడికే పరిస్థితి లేదు. కనీసం పాయసం తాగుదామన్నా పంచదార కూడా ఇచ్చే పరిస్థితి లేదు.

Updated Date - Aug 20 , 2024 | 05:15 AM