Amaravati : తొలిసారి సచివాలయానికి పవన్
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:30 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు.
సీఎం చాంబర్లో చంద్రబాబుతో భేటీ
నేటి ఉదయం బాధ్యతల స్వీకారం
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు. తన చాంబర్ ఉన్న రెండో బ్లాకు ప్రభుత్వ ఉద్యోగులతో నిండిపోవడంతో దానిని పరిశీలించకుండానే.. ఆయన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌తో కలిసి నేరుగా సీఎం చంద్రబాబు చాంబరుకు వెళ్లారు. రాష్ట్ర సచివాలయానికి.. అందునా తన చాంబరుకు తొలిసారి వచ్చిన తన డిప్యూటీ పవన్ కల్యాణ్‌ను.. చంద్రబాబు తన సీటులో నుంచి లేచి ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. పవన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత వారిద్దరూ సుమారు గంటపాటు విడిగా అదే చాంబర్లో చర్చించుకున్నారు. చంద్రబాబు కార్యాలయ గది బాగుందని పవన్ ప్రశంసించారు. ఆ గదిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం చూపించి.. దానికి మీరు హుందాతనం తెచ్చారని చంద్రబాబుతో అన్నారు. తర్వాత వారిద్దరూ ప్రభుత్వం.. పాలన, రాజకీయపరమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులను చాంబర్లోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్.. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ వచ్చారు. పవన్ చేపట్టనున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలు, జగన్ పాలనలో పంచాయతీల పాలన కుంటుపడడం.. గ్రామాల్లో విపరీతంగా పేరుకుపోతున్న చెత్త గుట్టల సమస్యను పరిష్కరించే మార్గాలు.. గ్రామాల్లో సమస్యలు వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. సుమారు రెండు గంటలపాటు చంద్రబాబు చాంబర్లో పవన్ గడిపారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అమరావతిలో అడుగుపెట్టిన పవన్‌కు.. రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జనసేన కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన్ను తాడేపల్లి నుంచి మందడం వరకూ పూల వర్షంలో ముంచెత్తారు.
సచివాలయంలో సంద డే సందడి
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ సచివాలయంలోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మందడం నుంచి ఆయన సచివాలయంలోకి ప్రవేశించగానే ఉద్యోగులంతా ఆయన్ను చూసేందుకు నాలుగు బ్లాకుల నుంచీ బయటకు వచ్చారు. ఘనంగా స్వాగతం పలికారు. జై పవన్, జై జనసేన అంటూ వారు నినాదాలు చేశారు. ఆయన వాస్తవానికి రెండో బ్లాకులో తనకు కేటాయించిన చాంబరును పరిశీలించడానికి వచ్చారు. కానీ ఆయన రెండో బ్లాకు వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా ఉద్యోగులతో నిండిపోయింది. దీంతో తన చాంబరును పరిశీలించకుండానే మొదటి బ్లాకుకు వె ళ్లి సీఎంను కలిశారు. కాగా.. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం 11 గంటల తర్వాత బాధ్యతలు తీసుకుంటారని మంత్రి కందుల దుర్గేశ్ విలేకరులకు తెలిపారు.