Share News

YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీకి..

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:07 AM

వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నానని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేశారు.

YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీకి..

అమరావతి: వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నానని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేశారు. దీంతో ఇతర పార్టీలో చేరబోనని సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణ గురించి సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని స్పష్టంచేశారు.

వారంలోనే రాజీనామా

అంబటి రాయుడు (Ambati Rayudu) గత వారం డిసెంబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అసెంబ్లీ లేదా లోక్ సభకు పోటీ చేస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలో రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపింది. వైసీపీలో చేరకముందు జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు నచ్చడంతోనే వైసీపీలో చేరానని ఆ సమయంలో ప్రకటించారు.

రాజీనామా ఎందుకంటే..?

గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అంబటి రాయుడు (Ambati Rayudu) అనుకున్నారని తెలిసింది. టికెట్‌ ఇచ్చే విషయమై పార్టీ నుంచి హామీ రాలేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా ఆలస్యం చేయడం ఎందుకని పార్టీని వీడే నిర్ణయం తీసుకొని ఉంటారని విశ్లేషిస్తున్నారు.

గుంటూరు లోక్ సభ నుంచి పోటీ..?

అంబటి రాయుడు (Ambati Rayudu) స్వస్థలం గుంటూరు జిల్లా. ఏపీలో బలమైన సామాజిక వర్గం కాపు కులానికి చెందినవారు. క్రికెట్‌లో రాణించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. వైసీపీలో చేరి, ఆ వెంటనే రాజీనామా చేశారు. సామాజిక వర్గాన్ని బట్టి చూస్తే జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) మరోసారి లోక్ సభకు పోటీ చేయనని అంటున్నారు. సో.. టీడీపీలో చేరితే రాయుడుకు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:30 PM