Share News

YCP: రూ.9 కోట్లు రోడ్లపాలు

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:41 AM

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఐదేళ్లపాటు ఏమీ చేసింది లేదు. ఎన్నికల ప్రచారానికి వెళితే.. ఏదో ఒకటి చెప్పాలి. మాయ చేసి గెలవాలి. ఇలా ఆలోచించారు అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌. అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల తిరుగుబాటుతో అప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన ఆమె.. తనకు టిక్కెట్‌ కళ్యాణదుర్గంలోనే వస్తుందని అనుకున్నారు. ఎలాగోలా గెలిచేద్దామని అనుకున్నారు. అందుకే.. ప్రచారాస్త్రంగా పనికి వస్తుందని పట్టణంలో రహదారి పనులను ఆగమేఘాల మీద చేపట్టారు. ...

YCP: రూ.9 కోట్లు రోడ్లపాలు
There is no drainage canal at Kollapuramma circle.. Sewage is on the road

అస్తవ్యస్తంగా రహదారి పనులు

డ్రైనేజీ కాలువలు లేకుండా నిర్మాణం

మురుగునీటి మయమైన కళ్యాణదుర్గం

అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌ ఘనకార్యం

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఐదేళ్లపాటు ఏమీ చేసింది లేదు. ఎన్నికల ప్రచారానికి వెళితే.. ఏదో ఒకటి చెప్పాలి. మాయ చేసి గెలవాలి. ఇలా ఆలోచించారు అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌. అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల తిరుగుబాటుతో అప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన ఆమె.. తనకు టిక్కెట్‌ కళ్యాణదుర్గంలోనే వస్తుందని అనుకున్నారు. ఎలాగోలా గెలిచేద్దామని అనుకున్నారు. అందుకే.. ప్రచారాస్త్రంగా పనికి వస్తుందని పట్టణంలో రహదారి పనులను ఆగమేఘాల మీద చేపట్టారు. పోనీ నాణ్యత పాటించారా అంటే.. అందులోనూ కమీషన్లను వదల్లేదు. ఆర్‌ అండ్‌ బీ అధికారులు, అప్పటి మంత్రి.. అందరికీ వాటాలు వెళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. వెరసి.. పనులు అధ్వానంగా అయ్యాయి. అదీ.. మురుగునీటి కాలువలు లేకుండా.. దారి పనులు చేసి వదిలేశారు. ఇప్పుడు వర్షం కురిస్తే నీరు రోడ్డుపై నిలబడుతోంది.

కళ్యాణదుర్గం, ఆగస్టు 6: కళ్యాణదుర్గం టి-కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు రోడ్డు వేసేందుకు వైసీపీ హయాంలో ఆర్‌అండ్‌బీ రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 1.2 కి.మీ. తారు రోడ్డు, మధ్యలో డివైడర్లు, రెండు వైపులా డ్రైనేజీ కాలువలన నిర్మించాల్సి ఉంది. గత ఏడాది ఏప్రిల్‌ 6న అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌ ఈ పనులను ప్రారంభించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, ఎలాగైనా పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి


ఆదేశించడంతో ఆర్‌ అండ్‌ బీ అధికారులు మమ అనిపించారు. ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఫలితంగా టి-సర్కిల్‌, వాల్మీకి సర్కిల్‌, గాంధీ సర్కిల్‌, హిందూపురం రోడ్డులో రహదారి విస్తరణ పనులు అధ్వానంగా మారాయి. గాంధీ సర్కిల్‌, కొల్లాపురమ్మ దేవాలయ సమీపంలో డ్రైనేజీ ఏర్పాటు చేయకుండానే రోడ్డు విస్తరణ పనులు చేయడంతో మురుగునీరు రోడ్డు పైకి వస్తోంది. ఈ ప్రాంతమంతా ఎగుడుదిగుడుగా రోడ్డు వేయడంతో మురుగునీరు రోడ్డు మధ్యలోనే నిలిచిపోతోంది. వర్షం వస్తే పట్టణ వాసుల బాధ వర్ణణాతీతం.

మధ్యలోనే ఆపేశారు..

గాంధీ సర్కిల్‌లో రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు, వాహదారులు గాయపడుతున్నారు. హిందూపురం వెళ్లే రహదారిలో బ్రిడ్జి నిర్మిస్తేనే పూర్తి స్థాయిలో భద్రత ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు, అధిక సామర్థ్యం కలిగిన వాహనాలు ఈ రహదారి గుండా వెళ్లాలి. ఇంతటి కీలకమైన ప్రాంతంలో తూతూ మంత్రంగా పనులు చేశారు. మురుగునీరు పోవడానికి పైపులు వేశారు. రోడ్డు పనులను అర్ధంతరంగా నిలిపేశారు. దీంతో వాహనదారులు ఆగి ఆగి.. నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. డివైడర్లు ఎలా పడితే అలా వేశారు. సగం నిర్మించి వదిలేశారు. హిందూపురం రోడ్డు పొడవునా డివైడర్లు అన్నీ సగమే నిర్మించి వదిలేశారు. ఇది ప్రమాదాలకు కారణం అవుతోంది.

నిధులు వృథా

అప్పటి మంత్రి స్వార్థానికి రూ.9 కోట్ల నిధులు రోడ్డుపాలయ్యాయి. త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని అధికారులపై ఆమె ఒత్తిడి చేయడంతో అధికారులు నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోలేదు. కాంట్రాక్టర్‌ ఏది చేస్తే అది అన్నట్లు నడిచిపోయింది. పైగా.. వాటా కమీషన అందడంతో సంతృప్తి చెందారు. రోడ్డు విస్తరణను అక్కడక్కడ మీటర్ల కొద్దీ వదిలేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పట్టణంలో రహదారులను నిర్మించడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలను నిర్మించా లంటే వేసిన రోడ్డంతా ధ్వంసం చేయాల్సిందే.

మిగిలిన పనులను చేయిస్తాం..

రోడ్డు విస్తరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ కారణంగా కొంత వరకు మాత్రమే పనులు పూర్తి చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయిస్తాం. డ్రైనేజీ కాలువలు ఎందుకు వేయలేదో తెలియదు. మా ఉన్నతాధికారులను అడగండి.

- గోవిందరాజులు, ఆర్‌అండ్‌బీ ఏఈ, కళ్యాణదుర్గం

ఇష్టారాజ్యంగా చేశారు..

రోడ్డు విస్తరణలో అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో ఉండటం లేదు. గాంధీచౌక్‌ నుంచి కంబదూరు రోడ్డు వరకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. రోడ్డు మీదనే విద్యుత స్తంభాలు ఉన్నాయి. రాత్రిళ్లు వాహనదారులు ప్రమదాలకు గురవుతున్నారు.

- అచ్యుత ప్రసాద్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 07 , 2024 | 12:41 AM