CPM: భూ దురాక్రమణ నిషేధ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరపాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:52 PM
భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు.
అనంతపురం కల్చరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గణేనాయక్ భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024లో కొన్ని అంశాలు పేదలపైన, పేదల పక్షాన నిలబడే ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని విమర్శించారు. అభ్యంతరకరమైన వాటిని తొలగించి అక్రమంగా, దౌర్జన్యంగా ఆక్రమించుకున్న దురాక్రమణదారులకు శిక్ష విధించేలా, పేదలకు న్యాయం చేకూర్చేలా ఈ చట్టాన్ని సవరించడానికి సమావేశం నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో భూ దురాక్రమణల సమస్య ఉందని, అనేక మంది భూ యజమానులు తీవ్ర కష్టాలెదుర్కొంటున్నారని, పట్టణీకరణ, వ్యాపారీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూ దురాక్రమణను అరికట్టేందుకు 1982 చట్టాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో భూ దురాక్రమణ నిషేధ చట్టం 2024ను శాసనసభలో ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెబుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తరహాలో ఈ చట్టం చేయాలని ప్రయత్నించి ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించడం సరికాదన్నారు. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్టలోపు సొంత భూములు కలిగిన పేద, మధ్యతరగి రైతులు, సొంత ఇల్లు లేని పట్టణ, గ్రామీణ పేదలు ప్రభుత్వ భూమి కలిగి ఉంటే వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య, నగర కార్యదర్శులు రామిరెడ్డి, ఆర్‌వీ నాయుడు పాల్గొన్నారు.