YCP : ఎవ్వరైనా సరే..!
ABN , Publish Date - May 27 , 2024 | 12:08 AM
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి తీరు ఆ పార్టీ నాయకులకే మింగుడు పడటం లేదన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకు తర తమ బేధాలు ఉండవంట. ఎవరైనా సరే.. ఎందులోనైనా సరే వాటా ఇవ్వాల్సిందేనట. అది లేఅవుట్లైనా.., వెంచర్లలైనా సరే..తనకు..తన కుటుంబ సభ్యులకు ముడుపులు చెల్లించాల్సిందేనట. లేదంటే అధికారం అండతో నిబంధనలు ...
వైసీపీ నేతలైనా సమర్పించుకోవాల్సిందే
అక్రమ లేఅవుట్‌కు రూ.కోటికిపైగా డిమాండ్
పెద్ద మొత్తం కావడంతో కుదరని బేరం
అనుమతులు లేవని ఫ్లెక్సీల ఏర్పాటు
ఇదీ.. రాప్తాడు నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి తీరు
అనంతపురం రూరల్, మే 26: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి తీరు ఆ పార్టీ నాయకులకే మింగుడు పడటం లేదన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకు తర తమ బేధాలు ఉండవంట. ఎవరైనా సరే.. ఎందులోనైనా సరే వాటా ఇవ్వాల్సిందేనట. అది లేఅవుట్లైనా.., వెంచర్లలైనా సరే..తనకు..తన కుటుంబ సభ్యులకు ముడుపులు చెల్లించాల్సిందేనట. లేదంటే అధికారం అండతో నిబంధనలు ఇతరత్రా అంటూ బెదిరిస్తారట. ఇప్పుడూ కూడా అనంతపురం రూరల్ మండలంలోని ఓ లేఅవుట్ విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. లే అవుట్ వేసిన వారి నుంచి పెద్ద మొత్తంలోనే పైసలు డిమాండ్ చేసినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకొంటున్నారు. అయితే లే అవుట్ వేసిన వాళ్లు వైసీపీ వారే కావడంతో అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి అలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. బేరం
కుదరకపోవడంతో ఆ ప్రజాప్రతినిధి తన అధికార బలాన్ని ప్రయోగించినట్లు మాట్లాడుకొంటున్నారు. ఈ క్రమంలో లే అవుట్‌కు స్థానిక పంచాయతీ వారితో అనుమతులు లేవంటూ ఫ్లెక్సీ పెట్టించేశారని అనుకొంటున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించిన ఫొటోలు రియల్‌ఎస్టేట్ వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ లేఅవుట్‌కు పంచాయతీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అక్కడ లేదు. లేఅవుట్‌దారులే దానిని తొలిగించినట్లు సమాచారం.
అనుమతులు లేవంటూ ఫ్లెక్సీ ఏర్పాటు..
అనంతపురంరూరల్ మండలం, కక్కలపల్లి గ్రామ పొలం..కక్కలపల్లి కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని 6.80ఎకరాల భూమిలో వైసీపీ కీలక నేతలు రెండు, మూడు నెలల కిందట లే అవుట్ వేశారు. సెంటు రూ.6.5లక్షల మొదలుకుని విక్రయాలు చేపట్టారు. ఇప్పటికే సగానికిపైగా ప్లాట్లు కూడా విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోని ఆ ప్రజాప్రతినిధి లేఅవుట్‌దారులు నుంచి రూ.కోటికిపైగా డిమాండ్ చేశారన్న వాదనలు ఆయా వర్గాల్లో వినిపిస్తున్నాయి. లేఅవుట్ వేసిన వారు మాత్రం ఆ సొమ్ము ఇచ్చేందుకు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇంతలోనే ఈనెల 17న అలేవుట్ గేట్‌కు అనుమతులు లేవంటూ పంచాయతీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఇది అనధికార లే
అవుట్ అని, అహుడా అనుమతులు లేవని, ఈ అనధికార లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు, అమ్మకాల చేయరాదని రాశారు. అలాగే ఎవరైనా క్రయవిక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇంతేకాక ఆ ప్రజాప్రతినిధికి వీర భక్తుడిగా ఉన్న ఓ పంచాయతీ అధికారి ఆ ఫ్లెక్సీ సంబంధించిన ఫొటోలు, లేఅవుట్ ఫొటోలు తీసి రిజిస్ట్రేషన చేయకూడదని రిజిస్ట్రేషన అధికారులు, అహుడా అధికారులకు పంపాడు.
ప్రజాప్రతినిధి తీరుపై రుస.. రుస..
ఇదిలా ఉండగా ఫ్లెక్సీ ఏర్పాటుపై ప్రజాప్రతినిఽధి, పంచాయతీ వారిపై లేఅవుట్ వేసినవారు సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. లేఅవుట్ పనులు ప్రారంభించి రెండు నెలలకుపైగానే కావస్తోంది. పంచాయతీ అధికారులకు అక్రమ లేఅవుట్ అని తెలుసుకోవడానికి ఇన్నాళ్లు పట్టిందా అంటు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధి చెప్పడంతోనే పంచాయతీ వారు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎవరైనా లేఅవుట్ వేస్తే ప్రజా అవసరాల నిమిత్తం పదిశాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాల్సి ఉంది. అహుడా అనుమతులు తీసుకోవాలి. స్థానిక లేఅవుట్‌లో ఇది జరగకపోవడం గమనార్హం. దీన్నే అస్త్రంగా చేసుకుని ఆ ప్రజాప్రతినిధి పంచాయతీ వారితో ఇలా చేయించారనే గుసగుసలు
వినిపిస్తున్నాయి. మొన్న ముగిసిన సాధారణ ఎన్నికల సమయంలో పార్టీ కోసం లేఅవుట్‌దారులు రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు బయట చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు మళ్లీ ప్రజాప్రతినిధి తమ నుంచి డబ్బులు ఆశించడం ఎంత వరకు సబబూ అని సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...