Share News

COLLECTOR: అర్జీదారులను గౌరవించాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:00 AM

వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారుల వద్దకొచ్చే అర్జీదారులను గౌరవించి, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు.

COLLECTOR: అర్జీదారులను గౌరవించాలి
Collector receiving applications

పుట్టపర్తి టౌన, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారుల వద్దకొచ్చే అర్జీదారులను గౌరవించి, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 228 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వ్యయప్రసాలకు ఓర్చి అధికారుల వద్దకు వస్తుంటారన్నారు. వారిపట్ల అధికారులు సానుభూతితో వ్యవహరించాలన్నారు. ప్రతి అర్జీదారుడికి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

డీపీఓలో 19 ఫిర్యాదులు

పుట్టపర్తి రూరల్‌: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 19 ఫిర్యాదులు అందాయి. వాటిని ఎస్పీ రత్న స్వీకరించి, బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అదికారులతో ఫోనలో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో ఉన్న వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

వందశాతం పింఛన్లు పంపిణీ చేయాలి

పుట్టపర్తి టౌన, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల పంపిణీని మంగళవారం వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ చేతన.. యంత్రాంగాన్ని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 2,64,629 మంది లబ్ధిదారులకు రూ.114.46 కోట్లు పింఛన సొమ్ము అందజేయనున్నట్లు తెలిపారు. 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాది కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు అందజేస్తున్నామన్నారు. వందశాతం పింఛన్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం పింఛన తీసుకోకుంటే 2వ తేదీన పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డీఆర్వో విజయసారఽధి, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య ఉన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:00 AM