Share News

COLLECTOR CHETHAN: రోడ్డు ప్రమాదాలను నివారించాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:52 PM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీతో సమీక్ష నిర్వహించారు.

COLLECTOR CHETHAN: రోడ్డు ప్రమాదాలను నివారించాలి
Collector speaking at the meeting

పుట్టపర్తి టౌన, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడానికి పోలీసులు, ఆర్‌అండ్‌బీ, వైద్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాల బస్సులకు వెనుకభాగాన సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు చేపట్టాలని డీఈఓ కిష్టప్పను ఆదేశించారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్‌ ధరించేలా చూడాలన్నారు. వీటిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీసు శాఖను ఆదేశించారు. కదిరి-మదనపల్లి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు రబ్బరు వేగ నియంత్రికలు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రవాణాశాఖను ఆదేశించారు. రహదారుల కూడళ్లు, ధాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత కోసం మూడునెలలకోసారి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖాధికారి కరణాసాగర్‌రెడ్డి, కదిరి వెహికల్‌ ఇనస్పెక్టర్‌ శ్రీనివాసరావు, జాతీయ రహదారుల అధికారి భరత, జిల్లా వైద్యాధికారి మంజువాణి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య, ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన పాల్గొన్నారు.

ఎస్సీ కులగణనపై సోషల్‌ ఆడిట్‌: కలెక్టర్‌

పుట్టపర్తి టౌన, డిసెంబరు27(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఎస్సీ కులగణనపై జనవరి 10వ తేదీ వరకు సోషల్‌ అడిట్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎస్సీ జనాభా, పేరు, ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ, వయసు, ఉపకులం, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్హత, వృత్తి, తదితర వివరాలపై సోషల్‌ ఆడిట్‌ ఉంటుందన్నారు. తద్వారా సేకరించిన సమాచారాన్ని ఈనెల 31వ తేదీలోపు వార్డు, సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. జనవరి 10న కులగణన పూర్తి వివరాలు పొందుపరుస్తామన్నారు డేటాపై అభ్యంతరాలను సంబంధిత వీఆర్వోలకు అందజేయాలన్నారు. వాటిని వీఆర్వోలు పరిశీలించి, ఉన్నతాఽధికారులకు నివేదిస్తారని కలెక్టర్‌ వివరించారు.

Updated Date - Dec 27 , 2024 | 11:53 PM