Share News

Former : అడవిలా ఆయకట్టు

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:51 AM

చెరువులో నీరుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆయకట్టు సాగవుతుంది. పశు పక్షాదులకు తాగునీరు అందుతుంది. చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు కళకళలాడుతాయి. చెరువులో నీరుంటే.. ఇంట్లో సంపద ఉన్నట్లే..! జిల్లాలో విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన చెరువులు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అవన్నీ ప్రాభవం కోల్పోతున్నాయి. నీరొచ్చే మార్గాలతోపాటు చెరువుల ఆక్రమణలు పెరిగిపోయాయి. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం తోడైంది. ఫలితంగా చెరువులు ముళ్ల పొదలతో ...

Former : అడవిలా ఆయకట్టు
Ayakattu lands full of thorn bushes

50 ఏళ్లుగా చేరని నీరు

ఫీడర్‌ చానల్‌లో ముళ్ల పొదలు

శిథిలమైన మిడ్‌ పెన్నార్‌

5వ దక్షిణ కాలువ

ప్రాభవం కోల్పోయిన తిమ్మరాయల చెరువు

నీరుంటే.. ఇక్కడి రైతే రాజు అంటున్న స్థానికులు

శింగనమల, జూలై 30: చెరువులో నీరుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆయకట్టు సాగవుతుంది. పశు పక్షాదులకు తాగునీరు అందుతుంది. చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు కళకళలాడుతాయి. చెరువులో నీరుంటే.. ఇంట్లో సంపద ఉన్నట్లే..! జిల్లాలో విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన చెరువులు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అవన్నీ ప్రాభవం కోల్పోతున్నాయి. నీరొచ్చే మార్గాలతోపాటు చెరువుల ఆక్రమణలు పెరిగిపోయాయి. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం తోడైంది. ఫలితంగా చెరువులు ముళ్ల పొదలతో చిట్టడవులను తలపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి.. శింగనమల మండలంలోని సలకంచెరువు గ్రామ సమీపంలో ఉన్న తిమ్మరాయల చెరువు. ఐదొందల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువుకు ఏకంగా 50 ఏళ్ల నుంచి నీరు చేరడం లేదు. ఈ చెరువులో నీరుంటే నాయనవారిపల్లి, చిన్న మట్లగొంది, పెద్ద మట్లగొంది, సోదనపల్లి, ఈస్టు నరసాపురం, సలకంచెరువు, చీలేపల్లి, రాచేపల్లి, ఇరువెందల, ఆనందరావుపేట, నిదనవాడ, బందార్లపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చుక్కనీరు


లేదు. ఈ చెరువుకు వర్షపు నీటితోపాటు శింగనమల చెరువు నుంచి, మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ నుంచి నీరు చేరేలా ఏర్పాట్లుచేశారు. కానీ అమలు కావడం లేదు. ఫలితంగా చెరువు ఎండిపోయి.. బోరు బావులు ఎండిపోతున్నాయి.

రూ.40 లక్షలు వృథా

తిమ్మరాయల చెరువుకు శింగనమల చెరువు నుంచి 6 కి.మీ. ఫీడర్‌ చానల్‌ ద్వారా నీరు చేరాల్సి ఉంది. శింగనమల చెరువ నిండిన వెంటనే ఫీడర్‌ చానల్‌కు నీరు వదిలేవారు. కాలువ పూడిపోవడంతో 1997లో ఆధునికీరణ పనులు చేపట్టారు. అప్పట్లోనే రూ.40 లక్షలు వెచ్చించి పనులు చేశారు. కానీ నీరు రాలేదు. దీంతో కాలువలో ముళ్ల పొదలు పెరిగి.. పూడిపోయింది. మూడేళ్ల క్రితం శింగనమల చెరువు నిండి.. నాలుగు నెలల పాటు మరువ పారింది. ఫీడర్‌ చానల్‌ పూడిపోవడంతో నీరు వృథాగా వంకల వెంబడి పారింది. కానీ తిమ్మరాయల చెరువుకు చుక్కనీరు చేరలేదు. మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకుట్టు తరువాత.. తిమ్మరాయల చెరువుకు నీరు చేరాల్సి ఉంది. కానీ ఈ కాలువకు చివరిసారిగి 55 ఏళ్ల క్రితం నీరొచ్చిందని స్థానికులు అంటున్నారు. ఈ కాలువకు తరిమెల వరకు మాత్రమే నీరు వస్తోంది. చివరి ఆయకుట్టు బీడుగా మారింది. ఇక చెరువుకు నీటి సంగతి చెప్పాల్సిన పనేలేదు. తరిమెల నుంచి 10 కి.మీ. మేర కాలువ ధ్వంసమైంది. ఆధునికీకరణ పనులు చేపట్టి.. చివరి ఆయకట్టుకు, చెరువుకు నీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎవరొచ్చినా అన్నం పెట్టేటోళ్లం..

మా ఊరిలో మాది భూస్వాముల కుటుంబం. చెరువు కింద ప్రతి సంవత్సరం మూడు పంటలు పండేవి. మా ఇల్లు ధాన్యంతో కళకళలాడేది. మా ఇంటి వద్దకు ఎవరొచ్చినా కడుపు నిండా అన్నం పెట్టి పంపేవాళ్లం. కానీ 50 సంవత్సరాలుగా చెరువులోనికి నీరు రాలేదు. బోర్లలో నీరు తగ్గిపోయింది. అప్పులు చేసి బోర్లు వేయించినా నీరు పడటంలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. చాలా మంది రైతులు భూములు అమ్మి అప్పులు చెల్లించారు. అప్పట్లో పదిమందికి అన్నం పెట్టిన రైతులు ఇప్పుడు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. బతుకు భారంగా మారింది.

- రాఘవరెడ్డి, సలకంచెరువు

బతికుండగా చూస్తానో లేదో..

నాకు 75 ఏళ్లు. నా చిన్నతనంలో మా చెరువు కింద మూడు పంటలు పండేవి. వర్షాలు లేక 50 ఏళ్ల నుంచి చెరువులోకి నీరు రాలేదు. మా చెరువుకు రెండు మార్గాల నుంచి వచ్చే నీరు కూడా రావడం లేదు. నేను బతికుండగా చెరువులోకి నీరు వస్తుందో రాదో తెలియదు. మా చెరువులో నీరుంటే 10 గ్రామాల్లో రైతులు రాజుల్లా బతుకుతారు.

- చండ్రాయుడు, సలకంచెరువు

నీరేదీ..?

శింగనమల చెరువు నుంచి మా చెరువుకు నీరు చేరేందుకు 6 కి.మీ. ఫీడర్‌ చానల్‌ ఉంది. నాకు గుర్తుండి.. 60 ఏళ్లుగా కాలువలో నీరు పారలేదు. ఈ కాలువలో నీరు పారితే నాలుగు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రస్తుతం 500 నుంచి 600 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు పడటం లేదు. మా భూములు బీడు పడ్డాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు మాకు నీరు ఇచ్చి ఆదుకోవాలి.

- వీరయ్య, పెద్ద మట్లగొంది

బోర్ల కోసం అప్పులు..

చెరువులో నీరుంటే బోరుబావుల్లో పుష్కలంగా నీరుంటుంది. వర్షలు రాకపోడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. తోట పంటలు సాగు చేయడానికి 500 నుంచి 600 అడుగుల లోతు వరకూ బోర్లు వేయిస్తున్నాం. ఒకటి ఒకటిన్నర ఇంచు నీరు వచ్చి.. ఏడాదిలోపే ఎండిపోతున్నాయి. పంటలను బతికించుకునేందుకు అప్పుచేసి మళ్లీ బోర్లు వేయిస్తున్నాం. మా నీటి వాటను ప్రజాపతినిధులు తీసుకుని రావాలి. అప్పడే రైతుల జీవితాలు బాగుపడతాయి.

- తిరుపాలు, సలకంచెరువు

లోకేశ దృష్టికి సమస్య..

తిమ్మరాయల చెరువు సమస్యను మంత్రి నారా లోకేశకు దృష్టికి తీసుకెళ్లాం. సలకంచెరువుకు ఆయన పాదయాత్రగా వచ్చినప్పడు చెరువుకు నీరిప్పించాలని కోరాం. శింగనమల ఫీడర్‌ చానల్‌, మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువకు ఆధునికీకరణతో చెరువుకు నీరు చేరుతుందని వివరించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, గ్రామస్థుల సమక్షంలో అప్పట్లో లోకేశ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఆయనకు ఇంకోసారి గుర్తు చేస్తాం.

- ముత్యాల లక్ష్మిదేవమ్మ,

మాజీ ఎంపీపీ

ప్రభుత్వం చొరవ చూపాలి..

జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలకు వాటా నీటిని ప్రభు త్వం అందించాలి. రైతులకు న్యాయం చేయాలి. శింగనమల నియోజకవర్గంలోని సాగునీటి కాలువల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే రైతుల అభివృద్ధికి కృషి చేయాలి.

- చిన్నప్ప యాదవ్‌, ఏపీ

రైతు సంఘం జిల్లా అఽధ్యక్షుడు

నిధులు తేవాలి..

మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ, ఫీడర్‌ చానల్‌ శిథిలావస్థకు చేరాయి. చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని.. ఆధునికీకరణ పనులకు నిధులను తెప్పించాలి. పనులు పూర్తి చేయించి.. ప్రతి ఎకరానికీ సాగునీరు అందించాలి.

- మధు యాదవ్‌, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 12:51 AM