Balika Vidya బాలికావిద్య... అంతా మిథ్య..!
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:34 PM
బాలికావిద్యకు ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం బాలికావిద్య.. అంతా మిథ్యే అవుతోంది.
20 రోజులుగా సమ్మెలో టీచర్లు
బోధనకు దూరమైన విద్యార్థినులు
ఆటపాటలతో కాలక్షేపం
గిరిజన గురుకుల పాఠశాలలో దైన్యం
తనకల్లు, డిసెంబరు4(ఆంధ్రజ్యోతి): బాలికావిద్యకు ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం బాలికావిద్య.. అంతా మిథ్యే అవుతోంది. మండలంలోని చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీపీ) వద్ద గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఉంది. ఇందులో ఐదు తరగతుల్లో ఏకంగా 460 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. 20 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఇనచార్జి ప్రిన్సిపాల్ తప్ప.. అందరూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. 12వ పీఆర్సీ ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో 19 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పాఠశాలలో బోధన లేకుండాపోయింది. విద్యార్థినుల్లో పదో తరగతి వారు కూడా ఉన్నారు. వారికి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో బోధించేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. కీలక సమయం వృథా అవుతోందనీ, ఇలా అయితే తమ పిల్లలు ఎలా ఉత్తీర్ణులవుతారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇనచార్జి ప్రిన్సిపాల్ ఒక్కరే 460 మంది విద్యార్థినులను అదుపు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలలో విద్యాబోధన కొనసాగేలా చూడాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.
డిజిటల్ తరగతులతో నెట్టుకొస్తున్నా:
సుష్మితాజ్యోత్స్న, ఇనచార్జి ప్రిన్సిపాల్
పాఠశాలలో పనిచేస్తున్న 19 మంది అవుట్ సోర్పింగ్ టీచర్లు 20 రోజులుగా సమ్మెచేస్తున్నారు. 460 మంది బాలికలను అదుపుచేయలేకపోతున్నా. డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నా.