CM Chandrababu: గుండుమల గ్రామంలో కలియతిరిగిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:54 PM
‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం’లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి చేరుకున్నారు.
మడకశిర: ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం’లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. గుండుమల గ్రామంలో లబ్దిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. గుండుమల గ్రామానికి చెందిన రామన్నకు ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. రామన్న కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు.
గ్రామంలో కలియ తిరిగిన చంద్రబాబు..
పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు గుండుమల గ్రామమంతా కలియతిరిగారు. ‘ఏమమ్మా బాగున్నారా’ అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. మల్బరీ రైతు రంగనాథ్ తోటతో పాటు మల్బరీ పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన రైతు రంగనాథ్.. పట్టు రైతులను ఆదుకోవాలని సీఎంని కోరారు. ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పట్టు రైతులను ఎంత మాత్రం ఆదుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం కంపు కంపు చేశారాంటూ మండిపడ్డారు. పట్టు రైతులను ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు.
మరోవైపు గ్రామంలోని కరియమ్మ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా గుండుమల గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు.
కృష్ణమ్మకు జలహారతి
అంతకుముందు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ‘‘ప్రాణికోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులని దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్ళలో ఆనందం నింపుతున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా నీటి వినియోగదారు సంఘాలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీకి మంచి రోజులొచ్చాయ్: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు గురువారం శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైల మహాక్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్లను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన.. ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని తెలిపారు. జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జల హారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కల అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.