TENDERS: టెండర్లలో గందరగోళం
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:05 AM
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు తదితర వసతి గృహాలకు సరుకుల సరఫరా టెండర్ల ప్రక్రియ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో గందరగోళంగా సాగింది. గత వైసీపీ పాలనలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు టెండర్‌దారులు.. సమగ్రశిక్ష అతనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) సంపూర్ణను నిలదీశారు.
సమగ్రశిక్ష ఏపీసీని నిలదీసిన టెండర్‌దారులు
కలెక్టరేట్‌లో హైడ్రామా ఫ నేటికి వాయిదా
పుట్టపర్తి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు తదితర వసతి గృహాలకు సరుకుల సరఫరా టెండర్ల ప్రక్రియ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో గందరగోళంగా సాగింది. గత వైసీపీ పాలనలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు టెండర్‌దారులు.. సమగ్రశిక్ష అతనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) సంపూర్ణను నిలదీశారు. దీనిపై రాత్రి పొద్దుపోయేదాకా కలెక్టరేట్‌లో హైడ్రామా నడిచింది. జిల్లాలోని వసతి గృహాలకు సరుకులు, చికెన, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, పాల సరఫరాకు ఈనెల 21న టెండర్లు పిలిచారు. సోమవారం మధ్నాహ్నందాకా బుక్కపట్నంలోని సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో టెండర్లు స్వీకరించారు. సాయంత్రం సీల్డ్ టెండర్లను కలెక్టరేట్‌లో తెరిచారు. టెండర్లలో 16 మందిదాకా పాల్గొన్నారు. అనుభవం తదితర సాకులు చూపుతూ గతంలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారని పలువురు టెండర్‌దారులు ఆరోపించారు. టెండర్లలో తాము తక్కువకు కోట్ చేసినా సాకులు చూపుతూ పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. పాత వారికి ఎలా కట్టబెడతారంటూ టెండర్లలో పాల్గొనేందుకు వచ్చిన హిందూపురానికి చెందిన టీడీపీ నాయకులతోపాటు పలువురు టెండర్‌దారులు.. సమగ్రశిక్ష ఏపీసీ సంపూర్ణను నిలదీశారు. అనర్హులకు కట్టబెట్టాలని చూస్తే కలెక్టరేట్‌లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం మొదలైన టెండర్ల రభస రాత్రి పొద్దుపోయే కొనసాగుతూనే ఉంది. జూయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ కలుగజేసుకుని టెండర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతగత వారికి ఇస్తామని చెప్పడంతో టెండర్లుదాఖలు శాంతించారు. గందరగోళం నడుమ టెండర్ల ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేశారు.