Share News

RAIN DAMAGE CROPS: పంట వర్షార్పణం

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:16 AM

పంటలు కోత దశలో ఉన్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 1456.5 ఎకరాల్లో రూ.3.01 కోట్ల విలువైన వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, చామంతి పంటలు దెబ్బతిన్నాయి.

RAIN DAMAGE CROPS: పంట వర్షార్పణం
Damaged maize crop in Putlur mandal

నేలకొరిగిన వరి, జొన్న, మొక్కజొన్న

1456.5 ఎకరాల్లో రూ.3.01 కోట్ల నష్టం

అనంతపురం అర్బన/గార్లదిన్నె, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పంటలు కోత దశలో ఉన్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 1456.5 ఎకరాల్లో రూ.3.01 కోట్ల విలువైన వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, చామంతి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖపరంగా పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, అనంతపురం, రాయదుర్గం మండలాల్లో 1450 ఎకరాల్లో రూ.2.95 కోట్ల విలువైన వరి, జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానశాఖ పరిధిలో పుట్లూరు మండలంలో 1.5 ఎకరాల్లో అరటి, ఐదు ఎకరాల్లో చామంతి దెబ్బతింది. తద్వారా రూ.6 లక్షల దాకా నష్టం జరిగిందని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గార్లదిన్నె మండలంలో వర్షానికి వరిపంట నేలమట్టమైంది. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, కొప్పలకొండ, ఇల్లూరు, కేశావపురం తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. గాలివానకు పంటలు నేలవాలిపోయాయి.


మోస్తరు వర్షం

జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. పుట్లూరులో అత్యధికంగా 27.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. యల్లనూరు 24.8, అనంతపురం 23.2, శింగనమల 21.4, రాయదుర్గం, ఉరవకొండ 18.6, బుక్కరాయసముద్రం 18.2, డి. హిరేహాళ్‌ 17.8, నార్పల 16.8, తాడిపత్రి 16.2, గుమ్మఘట్ట 14.6, గుంతకల్లు 14.4, శెట్టూరు 14.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిలిగిన మండలాల్లో 12.4 మి.మీ.లోపు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం వర్షం పడింది. అనంతపురం నగరంలో భారీ వర్షం, బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పుట్లూరు, తాడిపత్రి, నార్పల, గుంతకల్లు, బొమ్మనహాళ్‌ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.


ఏటా నష్టమే..

పంటలు సాగుచేసిన ప్రతి ఏడాదీ నష్టాలే చవిచూస్తున్నాం. ఇంకో పది రోజులుంటే వరిపంట కోత కోసే వాళ్లం. ఎకరాలకు రూ.30 వేలు ఖర్చు చేసి నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశాను. వర్షానికి పంట పూర్తిగా నేలవాలిపోయింది. తీవ్రంగా నష్ట పోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

- గోసుల సుబ్బయ్య, మర్తాడు

నేలపాలైంది..

రెండురోజుల క్రితం కురిసిన వర్షానికి వరిపంట పూర్తిగా నేలమట్టమైంది. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని ఎకరానికి రూ.30వేలు ఖర్చు పెట్టి వరి సాగుచేశాను. పంటచేతి కొస్తే ఎకరానికి రూ.70 వేల వరకు ఆదాయం వచ్చేది. మరో పది రోజుల్లో కోత కోయాల్సింది. గాలివానకు నేలవాలిపోవడంతో తీవ్రంగా నష్ట పోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి.

- ఆవుల శ్రీనివాసులు, కౌలురైతు, మర్తాడు

పరిహారం అందుతుంది..

వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాము. ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులకు పరిహారం అందుతుంది. ప్రతి రైతూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోవాలి.

- సోమశేఖర్‌, గార్లదిన్నె ఏఓ

Updated Date - Nov 16 , 2024 | 12:16 AM