Share News

చెరువు మట్టితో దందా

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:38 AM

మైనర్‌ ఇరిగేషన అధికారుల్లో కొందరిని బుట్టలో వేసుకుని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులలో మట్టిని గుట్టుచప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. కూడేరు మండలం ఇప్పేరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తుండగా, అంతరగంగ గ్రామస్థులు టిప్పర్‌ను అడ్డుకున్నారు. చెరువుల్లో మట్టి సారవంతమైనది.

చెరువు మట్టితో దందా

ఇప్పేరు చెరువులో మాఫియా

అధికార పార్టీవారికి అధికారుల సహకారం

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 2: మైనర్‌ ఇరిగేషన అధికారుల్లో కొందరిని బుట్టలో వేసుకుని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులలో మట్టిని గుట్టుచప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. కూడేరు మండలం ఇప్పేరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తుండగా, అంతరగంగ గ్రామస్థులు టిప్పర్‌ను అడ్డుకున్నారు. చెరువుల్లో మట్టి సారవంతమైనది. పొలాలకు రైతులు తరలించుకోవాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటిది యంత్రాలను చెరువుల్లో పెట్టి.. భారీ వాహనాలతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటుఆన్నరు. మైనర్‌ ఇరిగేషన, భూగర్భగనులు, రెవెన్యూ, పోలీసు శాఖలో కొందరి సహకారంతోనే ఈ దందా నడుస్తోందని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆధిపత్యపోరు

మట్టి దందాలో అధికార పార్టీవారి మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వర్గం అక్రమ రవాణా చేస్తే మరో వర్గం అధికారులకు ఫిర్యాదు చేస్తోంది. గ్రామస్థులు నిలదీయడంతో మైనర్‌ ఇరిగేషన అధికారులు కేసులు పెడతామని అంటున్నారు. డివిజన పరిధిలో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారి.. వైసీపీ నాయకులతో కలిసి మట్టి అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలతో చేతులు కలిపి ఆయన జేబులు నింపుకుంటున్నారని ఆ శాఖ ఇంజనీర్లే చర్చించుకుంటున్నారు. ఇప్పేరు చెరువు పక్కనే హంద్రీనీవా నీటి కాలవ ఉంది. మట్టి తవ్వకాల కోసం చెరువులోకి నీరు వదలనివ్వకుండా ప్రభావితం చేస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మట్టి దందా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దెబ్బతిన్న దారులు

మట్టి తరలింపు కోసం భారీ వాహనాలను వినియోగించడంతో గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మట్టి తరలిస్తున్న ఓ టిప్పర్‌ను అడ్డుకున్నారు. చెరువుల్లో మట్టిని తరలించేందుకు మైనర్‌ ఇరిగేషన, మైనింగ్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మైనర్‌ ఇరిగేషనలో ఓ కీలక ఇంజనీరు, మరో ఇంజనీర్‌ కలిసి ముడుపులు పుచ్చుకుని, అనుమతి లేకుండానే మట్టిని తరలించేలా ఏర్పాటు చేయించారని సమాచారం. మట్టి మాఫియా ఆగడాలపై అంతరగంగ గ్రామ ప్రజలు నిలదీయడంతో కేసులు పెడతామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారు.

కేసు పెట్టాలని సూచించాం..

ఇప్పేరు చెరువులో మట్టి తరలింపునకు అనుమతి లేదు. మూడు రోజులుగా కొంతమంది మట్టిని తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అంతరగంగ గ్రామస్థులు మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. గ్రామస్థులతో కలిసి పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేయాలని మా సిబ్బంది, ఇంజనీర్లకు సూచించాం. కేసు పెట్టి వాహనాలను సీజు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. మట్టి తరలింపులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేదిలేదు.

- ప్రతాప్‌, మైనర్‌ ఇరిగేషన ఈఈ

Updated Date - Feb 03 , 2024 | 12:38 AM