Share News

Sand : రోజులు మారాయ్‌ !

ABN , Publish Date - Aug 04 , 2024 | 11:25 PM

అక్రమ ట్రాన్సపోర్టర్లపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచిన నేపథ్యంలో ఇక నుంచి ఇసుక సమస్యకు చెక్‌ పడునుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఆదాయవనరుగా భావించిన కొందరు ట్రాన్సపోర్టర్లు ఇప్పటికీ ఇసుకను అధిక ధరకు విక్రయిస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చారు. వైసీపీ ఐదేళ్ల ..

Sand : రోజులు మారాయ్‌ !
Laborers filling tractor with sand

జిల్లాలో ఇసుక సమస్యకు చెక్‌

అక్రమ ట్రాన్సపోర్టర్లపై నిఘా

కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

త్వరలో అందుబాటులోకి ఐదు రీచలు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 4: అక్రమ ట్రాన్సపోర్టర్లపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచిన నేపథ్యంలో ఇక నుంచి ఇసుక సమస్యకు చెక్‌ పడునుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఆదాయవనరుగా భావించిన కొందరు ట్రాన్సపోర్టర్లు ఇప్పటికీ ఇసుకను అధిక ధరకు విక్రయిస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా ఇసుకను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తోంది. పైగా రాజకీయనాయకులు ఇసుక జోలికి వెళ్లొద్దని సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జిల్లాలో జూలై 8న ఉచిత ఇసుక పాలసీలో భాగంగా రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఇసుక డంపింగ్‌ యార్డు ప్రారంభించారు. జుంజురాంపల్లి ఇసుక స్టాక్‌పాయింట్‌లో 58వేల టన్నులు అందుబాటులోకి తీసుకు వచ్చారు. 21వేల టన్నుల ఇసుకను విక్రయించారు. ఇక మిగిలిన 37వేల టన్నుల ఇసుకను విక్రయించనున్నారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో గుర్తించిన ఐదు ఇసుక రీచలను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.


ట్రాన్సపోర్టర్లపై ప్రత్యేక నిఘా

ఇసుకను అక్రమంగా తరలిస్తూ...అధిక ధరకు విక్రయిస్తున్న ట్రాన్సపోర్టర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచింది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్జనకు అలవాటుపడ్డ ట్రాన్సపోర్టర్లు ప్రస్తుతం అదే కొనసాగిస్తున్న ట్లు తెలుస్తోంది. అలాంటి వారి ఆటకట్టించేలా త్వరలో ఆనలైన విధానాన్ని తీసుకువచ్చి, వాహనాలకు జీపీఎస్‌ అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఐదు రీచలు...అందుబాటులో 2 లక్షల టన్నులు

జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రభుత్వం గుర్తించిన ఐదు రీచలను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదు రీచల్లో సుమారు రెండు లక్షల టన్నుల ఇసుకను విక్రయించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రీచలలో కంబదూరు మండలం కర్తనపల్లి, గార్లదిన్నె మండలం ఇల్లూరు, బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి, యల్లనూరు మండలం చిలమకూరు, కణేకల్లుమండలం రచ్చుమర్రి ఉన్నాయి. ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నుల వరకు ఉచితంగా ఇసుకను అందించనున్నారు. ఇసుక కావాల్సివారు నేరుగా స్టాక్‌ పాయింట్‌ దగ్గరకు ఆధార్‌కార్డు, మొబైల్‌ నంబరు, ఎక్కడికి తరలించాలనే వివరాలతో పాటు వాహనంతో వెళితే ఇసుక తీసుకెళ్లొచ్చు.

టన్ను రూ.195

జిల్లా ఇసుక కమిటీ ఆధ్వర్యంలో ఇసుక ధరలు నిర్ధారించారు. చైర్మనగా జిల్లా కలెక్టర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా భూగర్భ గనుల శాఖ డీడీ, సభ్యులుగా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ, సెబ్‌ అడిషినల్‌ ఎస్పీ, గ్రౌండ్‌వాటర్‌ డీడీ, ఇరిగేషన, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈలు, డీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఇసుక కమిటీ ఇప్పటికే తవ్వకం, లోడింగ్‌, సీనరీజ్‌తో కలిసి ఒక టన్ను ఇసుకను రూ.195గా నిర్ధారించింది. కమిటీ నిర్ధారించిన ధరకు మాత్రమే ఇసుకను విక్రయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో భవన నిర్మాణ రంగం పుంచుకుని చేతినిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధికధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

జిల్లాలో ప్రభుత్వ నిబంధ నలకు లోబడే ఇసుక విక్రయం, రవాణా జరగాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అధిక ధరకు విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా ఇసుక కమిటీ పరిశీలిస్తోంది. రవాణాశాఖ, పోలీసులు, రెవెన్యూశాఖల సంయుక్తంగా ఇసుక విక్రయాలపై నిఘా పెంచాం. జిల్లాలో మరిన్ని ఇసుక రీచలు, డంపింగ్‌యార్డులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 04 , 2024 | 11:25 PM