Share News

చంపేసి.. సెటిల్మెంట్‌!

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:03 AM

అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్‌ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...

చంపేసి.. సెటిల్మెంట్‌!
Father and family members protesting with the boy's body at Arti Gupta Hospital in Guntakallu town (File)

ఇదీ.. ప్రైవేటు వైద్యం తీరు

నగరంలో లెక్కలేనన్ని మరణాలు

ఆస్పత్రుల వద్ద బాధితుల ఆందోళనలు

ఉత్తుత్తి కేసులు.. విచారణ కమిటీలు

అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్‌ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర


ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దుప్పటి పంచాయితీలు, సెటిల్‌మెంట్లతో చాలా సంఘటనలను బయటకు రానివ్వడం లేదు. సమగ్ర వివరాలు సేకరించి.. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా స్థాయి అధికారులు సైతం ప్రలోభాలకు లొంగుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. - అనంతపురం టౌన

మెరుగైన వైద్యం ఉత్తిదే..

ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల భవనాలను చూస్తే.. పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, మెరుగైన వైద్యం అందుతుందని అనే భ్రమ కలుగుతుంది. డబ్బు ఖర్చయినా ఫరవాలేదు.. రోగం నయమైతే చాలు అని చాలామంది వాటిలో చేరుతారు. కానీ అక్కడ డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. రికార్డుల ప్రకారం జిల్లాలో 168 ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. మరో వంద వరకు ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో ఏకంగా 90 శాతం ఆస్పత్రులలో నిబంధనలు అమలు కావడం లేదంటే అతిశయోక్తి కాదు. రికార్డులలో మాత్రమే డాక్టర్లు ఉంటారు. ఆస్పత్రులలో కనిపించరు. వారి పేర్లు బోర్డులలో మాత్రం కనిపిస్తుంటాయి. కానీ చికిత్స అనుభవం లేని ఇతర డాక్టర్లు చేస్తుంటారు. అమరావతి ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహాలక్ష్మికి రెగ్యులర్‌ గైనిక్‌ డాక్టర్‌ కాకుండా కన్సల్టెన్సీ డాక్టర్‌ కాన్పుచేశారు. సరైన వైద్యం అందక ఆమె మరణించినట్లు వైద్యాధికారుల విచారణలో తేలింది. ప్రైవేటు వైద్యం ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ.

ఉత్తుత్తి కమిటీలు

ప్రైవేటు ఆస్పత్రులలో మరణాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. శవాలపై కరెన్సీ నోట్లను ఏరుకుంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఆప్తుల ప్రాణాలు పోయాయని బాధితులు గోడోమంటే.. ఇదే అదనుగా కొందరు అధికారులు వాలిపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు తదితర శాఖల అధికారులు విచారణ పేరిట రంగంలోకి దిగుతున్నారు. ఆస్పత్రుల వద్ద గొడవ చేయొద్దనే, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. విచారించి, కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హామీ ఇస్తారు. గొడవ సద్దుమణిగేలా చూడటం తప్ప.. ప్రాణాలు తీసినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. లావణ్య ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణకు నలుగురు సీనియర్‌ వైద్యాధికారులతో కమిటీ వేశారు. వారం గడిచిపోయింది. కమిటీ ఏమైనా తేల్చిందా..? విచారించిందా..? అంటే.. తెలియదు. ఇలాంటి ఉత్తుత్తి కమిటీలను గతంలోనూ చాలానే వేశారు. ఏ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏ ఒక్క అధికారీ బహిరంగపరచలేదు. దీని మర్మమేమిటో తెలియంది కాదు. బాధితులకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఆశచూపి లొంగదీసుకుంటున్నారు. ‘పోయిన ప్రాణం ఎటూ తిరిగి రాదు. ఈ డబ్బు తీసుకోండి..’ అని అక్రమాలను నోట్ల కట్టలతో కప్పి పెడుతున్నారు. ఇది బహిరంగ రహస్యం.

- అనంతపురం నగరంలోని లావణ్య ఆస్పత్రిలో గర్భసంచి ఆపరేషనకు వెళితే మూత్రనాళాన్ని తొలగించారు. ఆ మహిళ పరిస్థితి

విషమించగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి.. ఆస్పత్రిని సీజ్‌ చేశారు.

- పాతూరుకు చెందిన సుల్తానా(27) ప్రసవం కోసం అనంతపురం నగరంలోని శ్రీబాలాజీ నర్శింగ్‌ హోమ్‌లో చేరి.. ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

- అనంతపురం నగరం వెంకట్రావ్‌నగర్‌కు చెందిన ప్రశాంతి(32) ప్రసవం కోసం రామ్‌ నగర్‌లోని శివజ్యోతి ఆస్పత్రిలో చేరాఉ. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం అవుతున్నా డాక్టర్లు పట్టించుకోలేదు. పరిస్థితి విషమించాక ఇంకో ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడికి వెళ్లేలోగా ఆమె మరణించారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

- ఐదో రోడ్డుకు చెందిన రేష్మాబాను(29) ప్రసవం కోసం స్నేహలత ఆస్పత్రిలో చేరారు. ఆమె ప్రసవించాక తొలుత శిశువు చనిపోయింది. బిడ్డ శరీరంపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పి ఐసీయూలో చికిత్స కొనసాగించారు. కానీ ఆమె కూడా తెల్లారేలోగా మృతిచెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

- సీకే పల్లి మండలం పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన మద్దిలేటి అనారోగ్యంతో స్నేహలత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. డాక్టర్లు, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

- గార్లదిన్నె మండలం ఎగువపల్లికి చెందిన మహాలక్ష్మి(27) నిండు గర్భిణి. ప్రసవం కోసం నగరంలోని అమరావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు నొప్పులు రావడానికి సూదులు వేశారు. ప్రసవం తరువాత శిశువు మరణించింది. తల్లి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పి.. అక్కడే చికిత్స అందించారు. కానీ తెల్లారేలోగా తల్లికూడా చనిపోయింది. మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోలన చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో రెగ్యులర్‌ గైనిక్‌ డాక్టర్‌ కాకుండా, కన్సల్టెన్సీ డాక్టర్‌తో కాన్పు చేయించారని గుర్తించి.. గైనిక్‌ విభాగాన్ని సీజ్‌ చేశారు.

- అనంతపురం రూరల్‌ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని అంకిత అనారోగ్యం పాలైంది. ఆమెకు రెగ్యులర్‌గా చూపించే కమలానగర్‌లోని శ్రీనివాస న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ తీవ్ర రక్తస్రావంతో అంకతి చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు.

- కదిరి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన యుగంధర్‌ (29) అనారోగ్యంతో అరవింద్‌ నగర్‌లోని వంశీ ఆస్పత్రిల్రో అడ్మిట్‌ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

- గుంతకల్లు పట్టణంలో ఓ చిన్నారి మరణం వివాదాస్పదమైంది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి సరైన వైద్యం అందించకుండా, పరిస్థితి విషమించాక.. ఆక్సిజన నిండుకున్న అంబులెన్సలో కర్నూలుకు తరలించబోయారు. దారి మధ్యలో ఆక్సిజన ఖాళీ కావడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోంది. బాధిత కుటుంబం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Oct 07 , 2024 | 12:03 AM