Share News

HOSPITAL : సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై వివక్ష తగదు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:28 AM

అనంత జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై పాలకులు వివక్ష చూపడం అన్యాయమని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు.

HOSPITAL : సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై వివక్ష తగదు
Union leaders speaking at the meeting

అనంతపురం టౌన, జూలై 27: అనంత జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై పాలకులు వివక్ష చూపడం అన్యాయమని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. శనివారం శారదానగర్‌ వద్దనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుటే ఏపీ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షుడు రిటైర్డ్‌ అధ్యాపకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 2014లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.120కోట్లతో నిర్మించారన్నారు. జిల్లాకు ఎయిమ్స్‌ రావాల్సి ఉండగా చివరకు సూపర్‌ స్పెషాలిటీని ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇప్పటికీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వసతులు, నియామకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు వైద్యసేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ ఇంతపెద్ద ఆస్పత్రి నిర్మించి నిర్వహణ గాలికొదిలివేయడం సరికాదన్నారు. టీడీపీహయాంలో నిర్మించినా గత వైసీపీ ప్రభుత్వం సేవలు ప్రారంభించినా ఇక్కడమాత్రం అనుకున్న లక్ష్యం మేరకు రోగులకు సేవలు అందడం లేదన్నారు. సూపర్‌స్పెషాలిటీ నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వకుండా జిల్లా స్రభుత్వ ఆస్పత్రినుంచే నడపడం చూస్తేనే ఇక్కడ ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుందన్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు శ్రీరాములు, నల్లప్ప మాట్లాడుతూ ఆస్పత్రి ఏర్పాటుచేసి ఇన్ని సంవత్సరాలైనా నేటికీ సదుపాయాలు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న బడ్జెట్‌లోనైనా ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసూన, ఐక్యవేదిక అధ్యక్షుడు రసూల్‌, కార్యదర్శి రాజమోహన, చంద్రశేఖరరెడ్డి, వరదరాజులు, రిటైర్డ్‌ తహసీల్దార్‌ జయరామప్ప, రాజు, సోమర రాహుల్‌, సత్యనారాయణరెడ్డి, వీరేంద్ర, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:28 AM