GRANITE: పట్టించుకోరా..?
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:12 AM
ఈ ప్రాంతం వ్యాపారాలకు పెట్టింది పేరు. పలానవి ఎక్కడ దొరుకుతాయంటే.. ఈ ప్రాంతం పేరు ఇట్టే చేప్పేస్తారు. జిల్లా కేంద్రం మొదలు కొని, చుట్టుపక్క ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఈ ప్రాంతం పేరు తెలియని వారుండరు. ఆ స్థాయికి చేరింది ఈ ప్రాంతం. నిత్యం కొనుగోలుదారులతో అక్కడి షాపులు సందడిగా ఉంటాయి.
దర్జాగా వ్యాపారం.. పంచాయతీకి పన్ను ఎగవేత
రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న వైనం..
ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి
పంచాయతీ అధికారుల మీనమేషాలు
అనంతపురంరూరల్,అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): ఈ ప్రాంతం వ్యాపారాలకు పెట్టింది పేరు. పలానవి ఎక్కడ దొరుకుతాయంటే.. ఈ ప్రాంతం పేరు ఇట్టే చేప్పేస్తారు. జిల్లా కేంద్రం మొదలు కొని, చుట్టుపక్క ప్రాంతాల్లో ఎవరిని అడిగినా ఈ ప్రాంతం పేరు తెలియని వారుండరు. ఆ స్థాయికి చేరింది ఈ ప్రాంతం. నిత్యం కొనుగోలుదారులతో అక్కడి షాపులు సందడిగా ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం దండిగానే సమకూరుతోంది. ఈ ప్రాంతంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా రోజురోజుకు షాపుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు వివిధ మోడళ్లు అందుబాటులోకి తీసుకురావడం. తద్వారా వాటిని విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయినా ఏం పంచాయతీకి పన్ను చెల్లించేందుకు మాత్రం వ్యాపారులకు చేతులు రాని దుస్థితి. ఏళ్ల తరబడి షాపుల నిర్వహణ జరుగుతున్నా పంచాయతీకి ఒక్కపైసా చెల్లించరు. పంచాయతీ అధికారులు సైతం పన్ను వసూళ్లలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ప్రాంతం మరేదో కాదండయో.. నగరానికి అత్యంత సమీపంలోని బళ్లారి రోడ్డు ప్రాంతం. ఆ వ్యాపారం కూడా మరేదో కాదు.. గ్రానైట్ వ్యాపారం.
వందల సంఖ్యలో గ్రానైట్ వ్యాపార సముదాయాలు..
ఈ ప్రాంతం రూరల్ మండల పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీలోకి వస్తుంది. పంచాయతీ పరిధి ప్రారంభం నుంచి అనంతపురం-బళ్లారి రోడ్డుకు ఇరువైపులా గ్రానైట్ వ్యాపార సముదాయాలు వెలిశాయి. రోడ్డు పొడవునా ఇవే కనిపిస్తాయి. ఎంతలేదన్నా వంద తగ్గకుండా ఉంటాయి. రోజు రోజుకు ఈ షాపుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ స్థాయిలో ఇక్కడ వ్యాపార సముదాయాలుంటున్నాయి. ఒక్కొక్కటి పది సెంట్లకు పైగా విస్తీర్ణంలోనే ఏర్పాటయ్యాయి. వీటిలో చాలా వరకు ఏళ్ల తరబడి ఏర్పాటు చేసుకున్నవే. తమ లాభాలను పెంచుకునేందుకు వివిధ రకాల మార్బుల్స్, గ్రానైట్ తెప్పించి విక్రయాలు చేస్తున్నారు. ఆ షాపుల నుంచి ఇంత వరకు పంచాయతీకి మాత్రం ఆదాయం దక్కింది శూన్యం. దర్జాగా వ్యాపారం చేసుకుంటూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. వంద దుకాణాలుంటే నాలుగైదు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అదికూడా గతంలో పంచాయతీ అధికారిగా పనిచేసిన ఓ అధికారి పన్ను చెల్లింపులకు నోటీసులు జారీ చేసి నాలుగైదు షాపులతో రూ.5వేలు వరకు పన్ను కట్టించినట్లు తెలుస్తోంది.
పన్ను వసూలుచేస్తే లక్షల్లో ఆదాయం..
పంచాయతీల్లో సాధారణంగా అయితే ఇళ్లకు ఇంటి విస్తీర్ణాన్ని బట్టి పన్ను విధిస్తారు. ప్రస్తుతం షాపులన్నీ కమర్షియల్ ల్యాండ్‌లో ఉన్నాయి. దీనికితోడు ఒక్కొక్కటి పది సెంట్లపైగా విస్తీర్ణంలో ఉంటున్నాయి. ఈలెక్కన ఒక్కొక్కదానికి సరాసరిన రూ.10వేలు పన్ను రూపంలో కట్టించినా పంచాయతీకి లాభం చేకూరుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వాటితో మరింత ఎక్కువ పన్ను చెల్లింపులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంత లేదన్నా ఏడాదికి రూ.10లక్షలు ఆదాయం వస్తుంది. పంచాయతీ అవసరాల దృష్ట్యా సంబంధిత అధికారులు షాపులు నుంచి పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలి.
పన్ను వసూళ్లకు చర్యలు
గ్రానైట్ వ్యాపారులు పన్ను చెల్లించడం లేదన్నది వాస్తవమే. తప్పనిసరిగా పంచాయతీకి పన్ను చెల్లించాలి. గతంలో పనిచేసిన అధికారులు పన్ను చెల్లింపులకు వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు మరోసారి విచారించి నోటీసులు జారీ చేస్తాం. పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటాం.
- ప్రవీణ్‌బాబు, కార్యదర్శి, ఎ.నారాయణపురం