JIOTAG: జీయో ట్యాగింగ్ ప్రగతిపై డీపీఓ అసంతృప్తి
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:49 PM
ఇంటింటి జియోట్యాగింగ్ ప్రగతిపై డీపీఓ నాగరాజ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలో తనిఖీ చేశారు.
అనంతపురం న్యూటౌన, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఇంటింటి జియోట్యాగింగ్ ప్రగతిపై డీపీఓ నాగరాజ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలో తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది చేపట్టిన ఎనసీసీఐ, ఇంటింటి జియో ట్యాగింగ్ నమోదును ఆయన తనిఖీ చేశారు. సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయంలో వారి బయోమెట్రిక్ నమోదు చేసుకొని ఫీల్డ్‌కు వెళ్లి జియోట్యాగింగ్‌లో ప్రగతి కనిపించేలా చూడాలన్నారు. మీలో మార్పు రాకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రుద్రంపేట పంచాయతీ శ్రీనగర్ కాలనీలో స్థానికులు పలు సమస్యలను డీపీఓ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, వీధిదిపాల సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు.
విద్యార్థులను ఇబ్బందిపెట్టొద్దు: జనన ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని డీపీఓ నాగరాజనాయుడు కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యార్థుల వివరాల నమోదులో జనన ధ్రువీకరణ పత్రం అవసరమని ఇందుకోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం జారీ చేయాలని ఆదేశించారు. దీనిపై కార్యదర్శులకు సర్కుల్ కూడా జారీ చేశామన్నారు.
గిరిజన పంచాయతీల్లో గ్రామసభలు: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫై చేసిన గిరిజన పంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు డీపీఓ నాగరాజనాయుడు తెలిపారు. గిరిజన ఉద్యమకారుడు బిరిషముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గుంతకల్లు మండలంలోని గుండాల తండా, వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి తండా, శింగనమల మండలంలోని చిన్నవరం తండా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు.