DSP MEETING: సర్వజన ఆస్పత్రిలో భద్రతపై డీఎస్పీ, సీఐ చర్చ
ABN , Publish Date - Aug 23 , 2024 | 12:18 AM
జిల్లా సర్వజన ఆస్పత్రిలో భద్రతపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే కోల్‌కతాలో ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌ను దారుణంగా హత్యచేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.
అనంతపురం టౌన, ఆగస్టు 22: జిల్లా సర్వజన ఆస్పత్రిలో భద్రతపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే కోల్‌కతాలో ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌ను దారుణంగా హత్యచేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. జిల్లాలోనూ జూనియర్ డాక్టర్లు, పీజీలు విధులు బహిష్కరించి నిరసనలు సాగిస్తున్నారు. సుప్రీంకోర్టుతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రులలో మహిళా డాక్టర్ల భద్రతపై ప్రత్యేక చర్యలకు ఆదేశాలిచ్చాయి. ఈనేపత్యంలో గురువారం ఆస్పత్రిలో భద్రతాచర్యలు ఎలా చేపట్టాలో సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావుతో డీఎస్పీ ప్రతాప్, టుటౌన సీఐ శ్రీకాంత యాదవ్ కలిసి చర్చించారు. ఆస్పత్రిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎంతమంది మహిళా డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు, డ్యూటీలలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది, ఆస్పత్రిలో సీసీకెమరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, సెక్యూరిటీగార్డ్స్ ఎంతమంది ఉన్నారు. వారు డ్యూటీ ఏవిధంగా చేస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలో కూడా ఆలోచించారు. శుక్రవారం మళ్లీ ఆస్పత్రికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్, అవుట్ పోస్ట్ పోలీసులతో సమావేశమై పలు సూచనలు చేయనున్నారని సూపరింటెండెంట్ తెలిపారు.