Share News

Collectorate : కలెక్టరేట్‌లో కసరత్తు

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:58 PM

ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు అందరూ జిల్లాకు తిరిగొచ్చారు. జిల్లా నుంచి మొత్తం 39 మంది రాయలసీమలోని ఇతర జిల్లాలకు వెళ్లగా.. అందరూ అక్కడి నుంచి రిలీవ్‌ అయ్యారు. వారిలో ఇద్దరు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. మరో ఇద్దరు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారని తెలిసింది. మిగిలిన 35 మందిలో 31 మందిని జిల్లాలోని మండలాలకు కేటాయిస్తారు. నలుగురిని కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాలకు కేటాయిస్తారు. పొరుగు జిల్లాల నుంచి తిరిగొచ్చిన తహసీల్దార్లు ...

Collectorate : కలెక్టరేట్‌లో కసరత్తు
Collectorate Office

తహసీల్దార్లకు స్థానాల కేటాయింపు

నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం

కొత్త నిబంధనలతో పాత స్థానాలకు దూరం

అనంతపురం టౌన, జూలై 30: ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు అందరూ జిల్లాకు తిరిగొచ్చారు. జిల్లా నుంచి మొత్తం 39 మంది రాయలసీమలోని ఇతర జిల్లాలకు వెళ్లగా.. అందరూ అక్కడి నుంచి రిలీవ్‌ అయ్యారు. వారిలో ఇద్దరు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. మరో ఇద్దరు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారని తెలిసింది. మిగిలిన 35 మందిలో 31 మందిని జిల్లాలోని మండలాలకు కేటాయిస్తారు. నలుగురిని కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాలకు కేటాయిస్తారు. పొరుగు జిల్లాల నుంచి తిరిగొచ్చిన తహసీల్దార్లు కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేసుకున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మండల స్థాయిలో పాలక పార్టీలకు కీలక అధికారి తహసీల్దారు. మండల పరిధిలో రెవెన్యూ అంశాలన్నీ తహసీల్దారు చేతుల్లోనే ఉంటాయి. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు


తమకు అనకూలమైన అధికారిని నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తహసీల్దార్లు కూడా తమకు అనువైన మండలాలకు వెళ్లేందుకు సిఫార్సులు చేయించుకుంటున్నారు.

ఇకపై అలా కుదరదు..

సొంత జిల్లాకు వచ్చిన తహసీల్దార్లకు కొత్త నిబంధనలు షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చాలామంది తహసీల్దార్లు కోరుకున్న ప్రాంతాలకు వచ్చేందుకు పైరవీలు జోరుగా సాగింది. ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా.. స్థానిక నాయకులతో ఉన్న సత్సంబంధాలతో కోరుకున్న మండలాలకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో కొందరు సిఫార్సు లేఖలను సంపాదించి ఉన్నతాధికారులకు అందజేశారని సమాచారం. కానీ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన నియోజకవర్గంలో పోస్టింగ్‌ ఇవ్వడం కుదరదని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికితోడు సొంత రెవెన్యూ డివిజినలో కూడా పోస్టింగ్‌ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిబంధనల కారణంగా గత ప్రభుత్వంలో పనిచేసిన నియోజకవర్గాలకు, తమ సొంత రెవెన్యూ డివిజనలకు తహసీల్దార్లు పోస్టింగ్‌ తెచ్చుకునే వీలు లేకుండా పోయింది.

ఈ రోజు పోస్టింగ్స్‌..?

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తహసీల్దార్లను ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీల నాయకులు కోరుకుంటున్నట్లు తెలిసింది. ఎవరెవరిని ఎక్కడ నియమించడానికి వీలు లేదో తెలిపే జాబితాను కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు, తిరస్కరణల జాబితా కలెక్టరేట్‌కు చేరిందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో రిపోర్ట్‌ చేసుకున్న తహసీల్దార్లకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. మండలాల కేటాయింపు మంగళవారం రాత్రికి పూర్తవుతుందని, బుధవారం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంకా రిపోర్ట్‌ చేసుకోనివారు ఉంటే.. వారు వచ్చిన తర్వాత పోస్టింగ్‌ ఇస్తారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 30 , 2024 | 11:58 PM