Share News

MURDER MISTRY: ప్రాణంతీసిన వివాహేతర బంధం

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:28 AM

నల్లమాడకు చెందిన కాంట్రాక్టర్‌ బశెట్టి రాజశేఖర్‌ (49) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసు విచారణలో తేలింది.

MURDER MISTRY: ప్రాణంతీసిన వివాహేతర బంధం
DSP Vijaykumar is revealing the details

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నల్లమాడకు చెందిన కాంట్రాక్టర్‌ బశెట్టి రాజశేఖర్‌ (49) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసు విచారణలో తేలింది. ఈ కేసులో పెనుకొండ సమీపంలోని వెంకటగిరిపాలెం గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, అతడి భార్య రాధిక, వారి బంధువులు ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ సాయినాథరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సోమందేపల్లికి చెందిన వెంకటేష్‌, నరే్‌షను అరెస్టు చేసినట్లు పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. కొత్తచెరువు మండలంలోని మైలేపల్లి విజయ్‌కుమార్‌ ఫాంహౌ్‌సలో రాజశేఖర్‌ ఉంటుండేవాడు. గతంలో పెనుకొండ సమీపంలోని వెంకటగిరిపాలెంలో విద్యుత కాంట్రాక్టర్‌గా పనులు చేస్తుండేవాడు. ఆ సమయంలో అదే గ్రామంలో రాధిక హోటల్‌ నిర్వహిస్తుండేది. రాజశేఖర్‌.. కూలీల టిఫిన్లు, బోజనాలు కోసమని హోటల్‌కు వెళ్తుండేవాడు. అలా రాధికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర బంధానికి తెరతీసింది. విషయం రాధిక భర్త రవీంద్రిరెడ్డికి తెలిసింది. దీంతో అతడితోపాటు అతడి బావమరిది సాయినాథరెడ్డి (ఏపీఎస్పీ కానిస్టేబుల్‌).. పద్ధతి మార్చుకోవాలని రాజశేఖర్‌ను మందలించారు. అయినా అతడు మారలేదు. దీంతో రవీంద్రారెడ్డి, సాయినాథరెడ్డి, బంధువు అనిల్‌కుమార్‌రెడ్డి (సోమందేపల్లి), అతడి స్నేహితులు సోమందేపల్లికి చెందిన వెంకటేష్‌, నరే్‌షతో కలసి రాజశేఖర్‌ను కిడ్నా్‌పచేసి, హత్య చేయాలని పథకం వేశారు. ఆ మేరకు ఈనెల 11న సాయినాథరెడ్డికి చెందిన కారులో మైలేపల్లి విజయ్‌కుమార్‌ ఫాంహౌ్‌సకు చేరుకున్నారు. అక్కడే ఉన్న రాజశేఖర్‌పై ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. అతడిని కారులో వేసుకుని అమిదాలకుంట, సీకేపల్లి మీదుగా వెంకటగిరిపాలెం చేరుకున్నారు. అక్కడ రాధికతో చెప్పుతో కొట్టించారు. రాజశేఖర్‌ను అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి, మైలేపల్లి ఫాంహౌ్‌సలో పడేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ చనిపోయాడు. అతడి భార్య స్వర్ణకుమారి ఫిర్యాదు మేరకు కొత్తచెరువు అప్‌గ్రేడ్‌ సీఐ ఇందిర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం మరకుంటపల్లి వద్ద ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Updated Date - Dec 17 , 2024 | 12:28 AM