MINISTER SAVITHA: రైతు ద్రోహి.. జగన
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:20 AM
తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన వైఎస్ జగన గత ఐదేళ్లలో అన్నదాతకు అన్నివిధాలా ద్రోహం చేశాడని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు.
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి సవిత
సబ్సిడీపై డ్రిప్పు, స్ర్పింక్లర్ల పంపిణీ
కొత్తచెరువు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన వైఎస్ జగన గత ఐదేళ్లలో అన్నదాతకు అన్నివిధాలా ద్రోహం చేశాడని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. సబ్సిడీపై మంజూరైన డ్రిప్పు, స్ర్పింక్లర్ పరికరాలను స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో కలిసి మంత్రి పచ్చజెండా ఊపి, సబ్సిడీ పరికరాలను తరలించే వాహనాలను ప్రారంభించారు. అనంతరం రైతులకు మంజూరైన డ్రిప్పు, స్ర్పింక్లర్ పరికరాల మంజూరుపత్రాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారన్నారు. డ్రిప్పు, స్ర్పింక్లర్ పరికరాలను రైతులకు మొదటిసారిగా సబ్సీడీపై అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఎలాంటి సబ్సీడీ పరికరాలు అందించలేదని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాళ్లు వేయాలని జగన ప్రయత్నించాడన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రైతులకు సబ్సిడీపై డ్రిప్పు, స్ర్పింక్లర్లు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో లక్షల హెక్టార్లకు డ్రిప్పు పరికాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 3,885 హెక్టార్ల విస్తీర్ణంలో 3504 మంది రైతులకు డ్రిప్పు, స్ర్పింక్లర్ పరికరాలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ సుదర్శన, కంపెనీ ప్రతినిధులు, ఏఓ నటరాజ్, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.