SITHARAM YECHURI: పోరాట యోధుడు సీతారాం ఏచూరి
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:19 AM
సమాజంలోని స్వార్థ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, శ్రమదోపిడీ, కార్పొరేట్ సంస్థల దోపిడీని రూపుమాపేందుకు నిర్విరామ పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు.
ఆయన ఆశయాలు సాధిద్దాం
సంతాప సభలో రాజకీయ, ప్రజా సంఘాల నేతలు
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 20: సమాజంలోని స్వార్థ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, శ్రమదోపిడీ, కార్పొరేట్ సంస్థల దోపిడీని రూపుమాపేందుకు నిర్విరామ పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లలితకళాపరిషతలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపసభ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అధ్యక్షతన నిర్వహించిన సభకు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతోపాటు మౌ నం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి బహుబాషా పరిజ్ఞానం కలిగిన గొప్ప నాయకుడన్నారు. ఢిల్లీలో దక్షిణ భారతదేశం పార్లమెంటేరియన్ల పట్ల చులకనభావం, చిన్నచూపు నెలకొన్న పరిస్థితుల్లో తెలుగువాడైన ఏచూరి ప్రతిభతో ఆ సంస్కృతిని అంతమొందించి ఆదర్శవంతుడిగా నిలిచారని అన్నారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాలతో దేశానికి జరిగే ఉపయోగాలకన్నా నష్టాలు అధికంగా ఉన్న విషయాన్ని తెలియజేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఎందరో జీవితాలకు స్ఫూర్తిగా నిలిచారని, అందులో తానుకూడా ఉన్నానని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఆదర్శమైన రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు ఏచూరి అన్నారు. సిద్ధాంత పరంగా విభేదించినా ప్రజలకు అవసరమైన, ఉపయోగకరమైన అంశాలను ఏచూరి స్వాగతించేవారని, ఉపాధి హామీ పథకం అమలులో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి ఎంతో సహకరించారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశం ఎన్నో గొప్ప సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజాగొంతుక ఏచూరిని కోల్పోవడం బాధాకరమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ ఏచూరి తుదిశ్వాస వరకూ సమాజం కోసమే జీవించారన్నారు. ఆయన పార్థివ దేహాన్ని సైతం వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలనే దృఢనిశ్చయంతో సమర్పించిన గొప్ప వామపక్ష యోధుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ పేదలు, కర్షకులు, ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి సీతారాం అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ నిర్ధిష్టమైన సిద్దాంత అనుసంధానకర్తగా ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడుతూ ఏచూరి చూపిన మార్గంలో తామంతా నడుస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం, వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు, ప్రముఖులు ఇంతియాజ్, రాఘవేంద్ర, ఏసురత్నం, చంద్రశేఖర్, వెంకటసుబ్బయ్య, పద్మజ, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ ప్రసూన, పెద్దన్న, డాక్టర్ భానుకిరణ్, నల్లప్ప, నాగేంద్రకుమార్, ఎస్‌ఎం బాషా, షేకన్న, కేవీ రమణ, గోవిందరాజులు, కంబదూరి నబిరసూల్, తరిమెల అమర్నాథరెడ్డి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.