REVENU CAMPAIN: అర్జీల వెల్లువ
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:22 AM
భూవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులకు జిల్లాలో అర్జీలు వెల్లువెత్తాయి. శుక్రవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అర్జీదారులు క్యూకట్టారు.
క్యూకట్టిన అర్జీదారులు
పుట్టపర్తి టౌన, డిసెంబరు6 (ఆంధ్ర జ్యోతి): భూవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులకు జిల్లాలో అర్జీలు వెల్లువెత్తాయి. శుక్రవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అర్జీదారులు క్యూకట్టారు. సోమందేపల్లి మండలంలోని నాగినాయనిచెరువు గ్రామంలో నిర్వహించిన సదస్సులో మంత్రి సవిత, కలెక్టర్ టీఎస్ చేతన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొని, అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిఽధులతో కలిసి అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పుట్టపర్తి మండలంలోని కోట్లపల్లి సదస్సులో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మడకశిర మండలంలోని ఛత్రం గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, చెన్నేకొత్తపల్లి మండలంలోని కనుముక్కల గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని, అర్జీలు స్వీకరించారు. రికార్డుల్లో తప్పులు, భూకొలతల్లో తేడాలు, వారసత్వ పేర్ల నమోదు, సర్వే నంబర్ల మార్పు తదితర భూ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఈసదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆర్‌టీజీఎస్ పోర్టల్‌లో నమోదుచేసి, 40రోజుల్లోగా పరిష్కరిస్తారు. ఈమేరకు ప్రతి అర్జీదారుడికి అధికారులు సమాచారం అందిస్తారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
మంత్రి సవిత పిలుపు
సోమందేపల్లి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. మండలంలోని నాగినాయనిచెరువు గ్రామంలో గల స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, కొలతల్లో తేడాలు, సర్వే నంబర్లలో మార్పులు, వారసత్వపు పేర్ల నమోదు రికార్డులో మార్పు, రీసర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయడం తదితర సమస్యలను 45 రోజుల్లోపే పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామసభకు హాజరు కావడంలేదని రైతులు.. మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం నల్లగొండ్రాయనపల్లి వద్ద రోడ్డుపై వరిధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతులతో మంత్రి మాట్లాడారు. తుఫాను ప్రభావంతో వరిపంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ చేతన, ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి అశ్వత్థనాయక్, ఇనచార్జి తహసీల్దార్ రెడ్డిశేఖర్ పాల్గొన్నారు.
భూసమస్యలు పరిష్కరించుకోండి
- కలెక్టర్ టీఎస్ చేతన
రెవెన్యూ సదస్సుల్లో దీర్ఘకాలిక భూసమస్యలను ప్రజలు, రైతులు పరిష్కరించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన శుక్రవారం ప్రకటనలో కోరారు. జనవరి 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహస్తామన్నారు. సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేసి, పరిష్కరించుకోవాలన్నారు. సంబంధిత రెవెన్యూ అఽధికారులు సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆనలైనలో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోనకు సమాచారం అందించాలన్నారు. సమస్యలు పునరావృతం రాకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.