Share News

ARREST: గంజాయి ముఠా అరెస్టు

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:01 AM

గంజాయి రవాణా చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 4.720 కిలోల గంజాయి, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ARREST: గంజాయి ముఠా అరెస్టు
SP Jagdish revealing the details

అనంతపురం క్రైం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 4.720 కిలోల గంజాయి, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్‌ వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్‌ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

మహారాష్ట్ర నుంచి అనంతకు...

గంజాయిపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుండటంతో సరఫరా దారులు రూటు మార్చారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌, కురువాడి తదితర ప్రాంతాలనుంచి రైలుద్వారా తీసుకువచ్చి అనంతపురంలో విక్రయిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు, వ్యసనపరులైన విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. ఆరుగ్రాముల పొట్లాలుగా మార్చి ఒక్కో పొట్లం రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో కిలో గంజాయి రూ.15వేలకు కొనుగోలుచేసి అనంతపురంలో కిలో రూ.83వేలకు విక్రయిస్తున్నారు.

పట్టుబడ్డ ముఠా వివరాలు

పోలీసులకు పట్టుబడిన వారిలో అనంతపురానికి చెందిన తాడిపత్రి సయ్యద్‌ మహమ్మద్‌ నవాజ్‌(23), గౌస్‌ మొహిద్దీదన అలియాస్‌ తొత్తి(21), ఎర్రోళ్ల జస్వంత అలియాస్‌ బిట్టు(21), కడవకల్లు మురళీధర్‌ అలియాస్‌ చింటు(26), షేక్‌ మహమ్మద్‌ గౌస్‌ అలియాస్‌ పిట్టు(26), తేజస్వరూప్‌(19), వెంకటేష్‌(24) ఉన్నారు. ధర్మవరానికి చెందిన మామిళ్ల రాజేష్‌కుమార్‌(26), కట్టుబడి మురళీ(30), తోపాటు ఒక మైనర్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలో తాడిపత్రి సయ్యద్‌ మహమ్మద్‌ నవాజ్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలుచేసి అనంతపురం తరలించడం, వ్యసనపరులకు సరఫరా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ముఠాలోని వెంకటేష్‌పై వనటౌన పోలీస్‌స్టేషనలో ఇప్పటికే గంజాయికేసు ఉంది.


గంజాయి, 10 సెల్‌ ఫోన్లు స్వాధీనం...

గంజాయి విక్రయ ముఠా సమాచారం అందుకున్న బుక్కరాయసముద్రం సీఐ కరుణాకర్‌, ఇనచార్జ్‌ సీఐ హేమంతకుమార్‌, టాక్స్‌ఫోర్స్‌ ఎస్సై రాజశేఖర్‌ రెడ్డిలు రంగంలో దిగారు. ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి 4.720 కిలోల గంజాయి, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మౌత ఫ్రెషనర్స్‌, ఖాళీ ఓసీలు, ఐ డ్రాప్స్‌ను సీజ్‌చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలను ఎక్కడైనా విక్రయించినా, వినియోగించినా సమాచారం చేరవేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1972 లేదా స్థానిక పోలీసులకు 100/112 నెంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.

వార్తలోనే సమాధానముంది కదా..!

జిల్లాలో పేకాట సాగుతున్న వైనంపై శుక్రవారం ‘తోటలో పేకాట’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. గంజాయి ముఠా అరెస్ట్‌ను వివరిస్తున్న ఎస్పీని మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ వార్తలోనే సమాధానముంది కదా అని పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:01 AM