JC ASMITH REDDY : మా నీరు మాకివ్వండి..!
ABN , Publish Date - Jul 25 , 2024 | 11:51 PM
తుంగభద్ర జలాల నుంచి తమ వాటా నీటిని వెంటనే అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో గురువారం ఆయన జిల్లా రైతుల కష్టాలను ప్రస్తావించారు. ‘జిల్లాలో దిగువ ప్రాంతాలైన గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాలకు నీరు అందడం లేదు. మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలు సరిగా లేకపోవడంతో మా కోటా అరకొర నీరు కూడా రావడం లేదు. బిందు సేద్యానికి సరిపడా నీరిచ్చినా మా రైతులు మంచి పంటలు పండిస్తారు. ఆ సంపాదనతో .....
మా రైతులకు పెళ్లి కావడం లేదు..
అసెంబ్లీలో ఎమ్మెల్యే అశ్మిత ఆవేదన
తాడిపత్రి/యాడికి, జూలై 25: తుంగభద్ర జలాల నుంచి తమ వాటా నీటిని వెంటనే అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో గురువారం ఆయన జిల్లా రైతుల కష్టాలను ప్రస్తావించారు. ‘జిల్లాలో దిగువ ప్రాంతాలైన గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాలకు నీరు అందడం లేదు. మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలు సరిగా లేకపోవడంతో మా కోటా అరకొర నీరు కూడా రావడం లేదు. బిందు సేద్యానికి సరిపడా నీరిచ్చినా మా రైతులు మంచి పంటలు పండిస్తారు. ఆ సంపాదనతో రాష్ట్రానికి అప్పు ఇవ్వగలరు..’ అని అన్నారు. సాగునీటి కొరత కారణంగా పంటలు సరిగా పండటం లేదని, వ్యవసాయం చేసే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రెండు రోజుల క్రితం నా వద్దకు ఒక యువకుడు వచ్చాడు. ఎలా ఉన్నావు..? ఎంతమంది పిల్లలు? అని అడిగాను. అతని
సమాధానం నన్ను కలచివేసింది. పిల్లల మాట పక్కనపెట్టు.. నాకు పిల్లనిచ్చేటోడు ఎవరు..? అని ప్రశ్నించాడు. ఏమిటని ఆరా తీస్తే.. వ్యవసాయం చేస్తున్నానని, అందుకే పిల్లను ఎవరూ ఇవ్వడం లేదని చెప్పాడు. నాకు నోటమాట రాలేదు’ అని సభ దృష్టికి తీసుకువెళ్లారు. వ్యవసాయం చేస్తున్నారని పిల్లను ఇవ్వకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన ప్రభుత్వంలో అయినా రైతులకు నీరిద్దాం. సాగుకు సాయపడండి’ అని జలవనరుల శాఖ మంత్రికి అశ్మిత విన్నవించారు. ఉమ్మడి జిల్లాలో సేద్యం చేసే యువకులకు వివాహం కావడం లేదన్న అంశంపై ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ‘మోగదే కల్యాణ వీణ’ శీర్షికన ప్రచురితమైన ఈ కథనం పాఠకులను ఆలోచింపజేసింది. ఇదే సమస్యను తాడిపత్రి ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తమౌతోంది.
హెచ్చెల్సీ పనులను చేపట్టండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కాలవ
రాయదుర్గం టౌన, జూలై 25: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను తక్షణం చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. హెచ్చెల్సీ నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేశారని, కాలువ ప్రమాదకరంగా మారిందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఆధునికీకరణ పనులను ఎప్పటిలోగా ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వాలని మంత్రిని కోరారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు 2007లో అప్పటి ప్రభుత్వం రూ.463.50 కోట్లతో పాలనా అనుమతులు జారీ చేసిందని మంత్రి సమాధానం ఇచ్చారు. పనులను ఈపీసీ పద్ధతిలో, ఆరు ప్యాకేజీలుగా విభజించి 2009లో చేపట్టారని, 2017 చివరి నాటికి రూ.309.78 కోట్లతో 67.58 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. 2020లో ఆరు ప్యాకేజీలను ప్రభుత్వం ముందుగానే ఆపేసిందని తెలిపారు. నీటిపారుదల పనుల జాబితాలో ఆరు ఈపీసీ ప్యాకేజీ పనుల ఒప్పందాలను ముందస్తుగా ముగించడానికి అనుమతులు ఇచ్చామని మంత్రి వివరణ ఇచ్చారు. ప్రీ క్లోజర్ కోసం సిఫార్సు చేసిన పనులను వచ్చే ఐదేళ్ల కాలంలో తిరిగి మంజూరు చేయడానికి ప్రతిపాదించకూడదని నిబంధన విధించిందని అన్నారు. కాలువ పరిస్థితి మరింత దిగజారడంతో పాటు పాత నిర్మాణాలు, రెగ్యులేటర్లు, వంతెనలు కూలిపోయాయని, ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఐదు సంవత్సరాల నిబంధన సడలింపు ఇవ్వాలని, ఆధునికీకరణ పనులను చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ జలవనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన చీఫ్ నివేదిక సమర్పించారని తెలిపారు. హెచ్చెఎల్‌ఎంసీపై అత్యవసరమైన కీలకమైన పది కట్టడాల పనులు చేపట్టడానికి పాలన అనుమతులు ఇవ్వాలని జలవనరులశాఖ ఇంజినీర్ ఇన చీఫ్‌ను అనంతపురం జిల్లా కలెక్టర్ కోరినట్లు తెలిపారు. దీని కోసం రూ.33.05 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. ప్రతిపాదనలు వివిధ స్థాయిలలో ఉన్నాయని మంత్రి వివరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....