Share News

Tamoto : పతనం మొదలైందా..?

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:55 PM

నిన్న మొన్నటి దాకా ఓ రేంజ్‌లో రైతులకు లాభాలు కురిపించిన టమోటా ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. మొన్నటి వరకు అనంతపురం, కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌లో 16 కేజీల టామోటా బాక్స్‌ రూ.900లు పలికింది. అది ప్రస్తుతం రూ. 300లకు పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజక వర్గంలోని కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్‌ ...

Tamoto : పతనం మొదలైందా..?
Workers stuffing tomatoes into boxes

నేల చూపులు చూస్తున్న టమోటా ధరలు

మొన్నటి వరకు 16 కిలోల బాక్స్‌ రూ. 900

నేడు రూ. 300కు పడిపోయిన వైనం

నిలకడలేని ధరలతో రైతుల ఆందోళన

కళ్యాణదుర్గం, జూలై 28: నిన్న మొన్నటి దాకా ఓ రేంజ్‌లో రైతులకు లాభాలు కురిపించిన టమోటా ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. మొన్నటి వరకు అనంతపురం, కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌లో 16 కేజీల టామోటా బాక్స్‌ రూ.900లు పలికింది. అది ప్రస్తుతం రూ. 300లకు పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజక వర్గంలోని కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్‌ మండలాల్లో సుమారు 390 ఎకరాలకు పైబడి టమోటా పంటను సాగు చేశారు.


ఎకరాకు రూ.లక్ష ఖర్చు చేసి, ఒక్కో రైతు సరాసరి రెండున్నర ఎకరాలకు పైబడి సాగు చేశారు. టమోటా పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఇలాంటి సమయంలో ధరలు పడిపోతుండటంతో పెట్టుబడి కూడా గిట్టదేమోనని అన్నదాతలు ఆకోశిస్తున్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో దిగుబడి కూడా బాగా పెరగడంతో మార్కెట్‌లకు టమోటా భారీగా వస్తోంది. టమోటా పంటను కొనేందుకు మొన్నటివరకు వ్యాపారస్తులు ఎగబడ్డారు. దీంతో ధరలు నిలకడగా ఉంటాయన్న ఆశతో రైతులు విపరీతంగా టమోటాను సాగు చేశారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే ధర పతనం అవడంతో పంట సాగు చేసిన రైతుకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. జిల్లా నుంచి ఎగుమతి చేసే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో టమోటా ధర భారీగా పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వారం రోజుల్లోనే...

నాకున్న మూడు ఎకరాల్లో టమోటా పంటను సాగు చేశా. వారం రోజుల కిందట 16 కిలోల టమోటా బాక్స్‌ రూ.900లకు అమ్ముడుపోయింది. అదే ధర ఇప్పుడు రూ. 300లకు పడిపోయింది. ఇలా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు.

- రామాంజనేయులు, కరిగానిపల్లి, కుందుర్పి మండలం

పెట్టుబడి కూడా వస్తుందో రాదో..

నాకున్న మూడు ఎకరాలలో టమోటా పంట సాగు చేశా. వారం రోజుల కిందట 16 కిలోల బాక్స్‌ ధర రూ. 900లు ఉండేది. కానీ నేడు అది రూ. 300లకు పడిపోయింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడి కూడా దక్కే అవకాశం లేదు. టమోటా సాగు చేయాలంటే భయమేస్తోంది. - రవి, రైతు, ఒంటారెడ్డిపల్లి

నట్టేట మునుగుతున్నాం

టమోటా ధరలు నిలకడగా ఉండటం లేదు. వారం రోజుల కిందట ఉన్న ధరలు ఇప్పుడు లేవు. టమోటా కాయ బాగుంటేనే బాక్స్‌ రూ. 300లు ధర పలుకుతోంది. అదే మచ్చలు, పుచ్చులు ఉన్న టమోటాను నోసేల్‌ అంటున్నారు. ఇలా అయితే పెట్టుబడి కూడా దక్కక నట్టేట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది.

- బొమ్మన్న, రైతు, ఒంటారెడ్డిపల్లి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 28 , 2024 | 11:55 PM