Share News

BC OFFICER: వచ్చిందే అడ్డదారి..!

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:57 PM

బీసీ సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు ఆ శాఖలోని పలువురు ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేసింది. ఆ అధికారి ఉద్యోగంలో చేరేందుకు వచ్చిందే అడ్డదారి... అయిన్పటికీ జిల్లా, రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఓ డివిజనను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు.

BC OFFICER: వచ్చిందే అడ్డదారి..!

గతంలో ఆ అధికారిపై పలువురు కోర్టుకు వెళ్లిన వైనం

ప్రస్తుతం అనంత జిల్లాలో ఓ డివిజనలో విధుల నిర్వహణ

జిల్లాస్థాయి పదోన్నతి కోసం తీవ్ర ప్రయత్నాలు

ఇదీ బీసీ సంక్షేమశాఖలో ఓ పర్యవేక్షణాధికారి తీరు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు 5: బీసీ సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు ఆ శాఖలోని పలువురు ఉద్యోగులను ఇబ్బందుల పాలు చేసింది. ఆ అధికారి ఉద్యోగంలో చేరేందుకు వచ్చిందే అడ్డదారి... అయిన్పటికీ జిల్లా, రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఓ డివిజనను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ అధికారి జిల్లాస్థాయి పదవిపై కన్నేశారు. ఇంకేముంది ఉద్యోగం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకూ పలు రకాల సీనియార్టీ జాబితాలను తయారు చేసుకొని అందరికంటే తానే సీనియర్‌... తనకే ముందుగా పదోన్నతి కల్పించాలని ఆ శాఖలోని అధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. సీనియార్టీ జాబితాలో ఆ అధికారి కన్నా ముందున్న తన తోటి ఉద్యోగులు ప్రశ్నిస్తే... ఆ ఉద్యోగులపై తానే సీనియర్‌నంటూ కోర్టు మెట్లెక్కి ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాధిత ఉద్యోగులు సైతం ఆ అధికారి తీరుపై ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు మొర పెట్టుకున్నట్లు సమాచారం. ఆ మేరకు గతేడాది అక్టోబరు నెలలో శాఖలోని రాష్ట్రస్థాయి అధికారులు తుది సీనియార్టీ జాబితాను విడుదల చేశారు. అందులో ఆ అధికారి తన తోటి ఉద్యోగులకంటే వెనుకబడి ఉన్నట్లు సమాచారం. ఇక్కడే ఆ అధికారి తనకెక్కడ పదోన్నతి రాదోనన్న దురుద్దేశ్యంతో సీనియార్టీ లిస్టులో తనకన్నా ముందున్న వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.


వచ్చిందే అడ్డదారి...

అధికారంతో పాకులాడుతున్న ఆ అధికారి ఉద్యోగం చేరడమే అడ్డదారని ఆ శాఖలోని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 1992 సంవత్సరంలో ఆ అధికారితో మరో 09 మంది దాకా జిల్లాలో వార్డెన్ల ఉద్యోగాలు పొందారు. అయితే అప్పుడున్న నిబంధనల మేరకు ఏ జిల్లా వారు ఆ జిల్లాలోని పరీక్షలు రాసి ఉద్యోగాలు కల్పించాల్సి ఉందనే వాదన ఆ శాఖ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆ సమయంలో రాయలసీమ జిల్లాలోని ఓ జిల్లాకు చెందిన ఈ అధికారి అనంతపురం జిల్లాలో ఓ ఫేక్‌ అడ్ర్‌సతో పరీక్షలు రాసినట్లు సమాచారం. అయితే అప్పట్లో బీసీ సంక్షేమశాఖ అధికారులు సైతం గుడ్డిగా ఉద్యోగంలో చేరే సమయంలో ఆ అధికారి అనంత జిల్లా అడ్రస్‌ మీదునే ఉద్యోగం ఇచ్చేశారు. ఇక్కడే ఆ సమయంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు, ఉద్యోగంలో చేరిన జిల్లాకు చెందిన వార్డెన్లు కోర్టు మెట్టెక్కారు. అన్నింటిని పరిశీలించిన కోర్టు ఏ జిల్లాలో వారికి ఆ జిల్లాలో ఉద్యోగాలు కల్పించకుండా పక్క జిల్లా వారికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని మొట్టికాయ వేసింది. ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... కోర్టు ఇచ్చిన స్టేలో ఉద్యోగ నియామకంలో పక్క జిల్లాల వారిని తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే బీసీ సంక్షేమశాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారులు... ఉద్యోగాల నుంచి తొలగిస్తే మొత్తానికే మోసం వస్తుందనుకున్నారోఏమోగానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు దిక్కరిస్తూ సపరేటుగా ఓ జీవోను విడుదల చేస్తూ ఏ జిల్లా వారు ఆ జిల్లాకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ అధికారి తన సొంత జిల్లాకు వెళ్లిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తూ గ్రేడ్‌-1 ప్రమోషన తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఓ డివిజన పర్యవేక్షించే అధికారి స్థాయికి ఎదిగారు. పదోన్నతిలో భాగంగా మళ్లీ అనంత జిల్లాకు వచ్చేశారు. ప్రస్తుతం ఆ అధికారి ఆ శాఖను శాసించే పోస్టులో కూర్చోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.


తోటి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం...

అడ్డదారిలో ఉద్యోగం పొందిన ఆ అధికారి తన పదోన్నతికి అడ్డొస్తున్నారనే క్రమంలో సీనియార్టీ లిస్టులో తనకంటే ముందున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఎవరైతే ఆ అధికారి కంటే ముందు సీనియార్టీ, ఉద్యోగ నియామకం తదితర వివరాలను జిల్లా అధికారులకు నివేదిస్తారో ఆ సమయంలో ఆ అధికారి వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా లేనిపోని ఆటంకాలు సృష్టించి కోర్టును ఆశ్రయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా... ఆ శాఖలోని అధికారులు తమకేమీ తెలియదన్నట్లు కళ్లుమూసుకొని వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Sep 05 , 2024 | 11:57 PM