Railway Station : ఇట్లయితే ఎట్ల సారూ!
ABN , Publish Date - Aug 09 , 2024 | 12:11 AM
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన కనీస సౌకర్యాలు కూడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంచెం ముందుగా వచ్చారంటే అంతే సంగతులు. రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్‌లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ రెండు ట్రాక్స్‌పైనే ఎక్కువగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒకేసారి రెండు మూడు రైళ్లు వస్తే ప్రయాణికులతో ఆ రెండు ప్లాట్‌ఫామ్స్ కిటకిటలాడిపోతాయి. అత్యవసర సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి వెళ్లడానికి ...
ప్లాట్ ఫామ్స్‌లో టాయిలెట్స్ లేవు
లిఫ్ట్ లేదు.. మెట్లు ఎక్కలేక అవస్థలు
రైళ్లు వస్తున్నా.. ట్రాక్ దాటేస్తున్నారు
అనంత స్టేషనలో అలవిగాని సమస్యలు
అనంతపురం న్యూటౌన, ఆగస్టు 8: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన కనీస సౌకర్యాలు కూడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంచెం ముందుగా వచ్చారంటే అంతే సంగతులు. రెండు, మూడు ప్లాట్‌ఫామ్స్‌లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ రెండు ట్రాక్స్‌పైనే ఎక్కువగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒకేసారి రెండు మూడు రైళ్లు వస్తే ప్రయాణికులతో ఆ రెండు ప్లాట్‌ఫామ్స్ కిటకిటలాడిపోతాయి. అత్యవసర సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి వెళ్లడానికి లిఫ్ట్ కూడా లేదు. మెట్లు ఎక్కలేక ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు. ‘ఇవేమిటి ఇలా ఉన్నాయి. ప్రయాణికులు ఎలా రాకపోకలు సాగిస్తారు..?’ అని తనిఖీ సమయంలో మెట్ల గురించి సిబ్బందిని డీఆర్‌ఎం ప్రశ్నించారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు ఆ మెట్లను ఎలా ఎక్కుతారో అధికారులకే తెలియాలి.
అన్నీ ఇబ్బందులే..
స్టేషన ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన 1వ రోడ్డు వైపు ఉన్న 1వ ప్లాట్‌ఫామ్ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. శ్రీనివాసనగర్ వైపు ఉన్న పాత స్టేషన భవనం స్థానంలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ 1వ ప్లాట్‌ఫామ్‌గా ఉన్నదాన్ని 4వ ప్లాట్‌ఫామ్‌గా మార్చారు. నిర్మాణాల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను నిరుపయోగంగా ఉంచారు. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి రాకపోకలు సాగించాల్సిన రైళ్లన్నింటిని 3వ ప్లాట్‌ఫామ్‌కు మల్లించారు. అక్కడ కనీస వసతులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లడానికే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న లిఫ్ట్ వినియోగంలోకి రాక, మెట్లు ఎక్కలేక అవస్థలు తప్పడం లేదు. ప్రమాదమని తెలిసినా ప్రత్యామ్నాయం లేక కొందరు ట్రాక్ దాటుతుంటారు.
ఉన్నా లేనట్టే..
స్టేషనలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా హెల్త్ ఇనస్పెక్టర్ ఉన్నారు. కానీ ప్రయోజనం శూన్యం అన్న విమర్శలు ఉన్నాయి. కార్యాలయానికి వచ్చామా? వెళ్లామా? అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ప్లాట్‌ఫామ్స్ శుభ్రత గురించి పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు. ఏమున్నా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే సూపర్‌వైజర్లు చూసుకోవాల్సిందే అంటున్నారు. తనిఖీలకు వచ్చిన డీఆర్‌ఎం.. మురుగునీటిలో నడవాల్సి వచ్చిందంటే.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొరవడిన సమన్వయం
సాధారణంగా ఏవిభాగంలో అయినా ఓ ఉన్నతాధికారి ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు పాలన వ్యవహారాలు అమలు చేస్తారు. అనంతపురం రైల్వే స్టేషన సిబ్బంది అందుకు విరుద్ధంగా తయారయారన్న ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సమన్వయంలేని కారణంగా ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ పోతున్నారు. మిగిలిన సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. స్టేషన మేనేజర్ అశోక్‌కుమార్ సిబ్బందిలో ఎవరినీ ప్రశ్నించే పరిస్థితుల్లోలేరన్న విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా సమయానికి వచ్చామా? తిరిగి వెళ్లామా అన్న విధంగా నడుచుకుంటున్నారు. డీఆర్‌ఎం తనిఖీల సమయంలోనే ఈ పరిస్థితి కళ్లకు కట్టింది. అధికారులను అడిగితే మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
త్వరగా పరిష్కరిస్తాం..
రైల్వే స్టేషనలో లిఫ్ట్‌ను మరోచోటుకు మార్చాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇంజనీరింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. విలైనంత త్వరగా పూర్తి చేస్తాం. రైళ్లన్నీ ఒకేసారి వచ్చినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నది వాస్తవమే. పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించాము. అన్ని సమస్యలను పరిష్కరిస్తాం.
-అశోక్‌కుమార్, స్టేషన మేనేజర్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....