Incharge మళ్లీ పొడిగింపు..
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:35 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పర్సన ఇనచార్జ్‌ల పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 21వ తేదీతో పర్సన ఇనచార్జిల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం సాగింది.
సహకార సంఘాలకు ఇక ఎన్నికలు లేనట్లే..?
పర్సన ఇనచార్జిల పాలన మరో ఆరునెలలు..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ధర్మవరం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పర్సన ఇనచార్జ్‌ల పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 21వ తేదీతో పర్సన ఇనచార్జిల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం సాగింది. లేదంటే త్రిసభ్య కమిటీలను నామినేట్ చేస్తారన్న వాదనలు వినిపించాయి. వీటన్నింటికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెడుతూ పర్సన ఇనచార్జిల పాలన కొనసాగింపునకే మొగ్గుచూపింది. ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది జూన 26వ తేదీ వరకు పొడిగించింది. ఆ మేరకు ఆయా జిల్లాల సహకార సంఘాల డిప్యూటీ రిజిసా్ట్రర్లు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 54 సహకార సంఘాలున్నాయి. వాటికి చివరగా 2013లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత పొడిగించుకుంటూ వచ్చారు.
సవరించాకే ఎన్నికలు
రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాలు పనిచేయాలి. రైతులు ఓటు ద్వారా సంఘాల సభ్యులను ఎన్నుకోవాలి. రైతు ప్రయోజనాలే పరమావధిగా సొసైటీలు పనిచేయాలి. వీటన్నింటికీ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. రైతులు, సొసైటీల మధ్య దూరం పెంచింది. ఎన్నికలు నిర్వహించకుండా దొడ్డిదారిన కమిటీలను నియమించింది. పార్టీ వ్యక్తులను నామినేషన పద్ధతిలో సొసైటీలకు ఎంపిక చేసింది. దీంతో సొసైటీలు పూర్తిగా రాజకీయ కేంద్రాలుగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారులకే సొసైటీల పాలనను అప్పగించింది. తద్వారా రాజకీయ జోక్యానికి చెక్ పెట్టింది. ఎన్నికలకు పాలకులు సాహసం చేయకపోవడానికి సొసైటీల ఓటర్ల జాబితాల్లో అవకతవకలే కారణమన్న వాదన వినిపిస్తోంది. గత వైసీపీ హయాంలో ఏకపక్షంగా సభ్యుల పేర్లు నమోదు చేశారన్న విమర్శలున్నాయి. వీటన్నింటినీ సరిదిద్దిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కుంటుపడుతున్న పాలన
సహకార సంఘాలకు పాలక వర్గాలు లేకపసోవడంతో పాలన కుంటుపడుతోందనే విమర్శలున్నాయి. సకాలంలో పంట రుణాలు అందే పరిస్థితులు లేక రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో అధికారులకు సమయం కేటాయించట్లేదు. సహకార సంఘాలకు పర్సన ఇనచార్జ్‌లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారింది. రెండు, మూడు సంఘాలకు ఒకరే పర్సన ఇనచార్జిగా వ్యవహరిస్తుండడంతో పాలన సక్రమంగా సాగడం లేదనే విమర్శలున్నాయి.
కూటమి నాయకుల్లో నిరుత్సాహం
సహకార సంఘాల పర్సన ఇనచార్జ్‌ల పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించడంతో ఇప్పట్లో సహకార సంఘాల ఎన్నికలు లేనట్లేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యమైతే గత ప్రభుత్వం తరహాలోనే త్రిసభ్య కమిటీలను నియమిస్తారనీ, తమకు నామినేటేడ్ పదవులు వస్తాయని పలువురు కూటమి నాయకులు ఆశించారు. దీనికి సంబంధించి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. సహకార సంఘాల పర్సన ఇనచార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో కొంత నిరుత్సాహం నింపింది.
ఆదేశాలు వచ్చినమాట వాస్తవమే:
కృష్ణానాయక్, జిల్లా సహకార అధికారి
సహకార సంఘాల పర్సన ఇనచార్జిల పదవీకాలం మరో ఆరునెలలు పొడిగించిన మాట వాస్తవమే. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది జూన 26వ తేదీ వరకు పొడిగించింది.