Share News

AYUSH SHOPES SEIZED: ఆయుష్‌ పేరుతో అక్రమాలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:42 PM

కొందరు ఆయుష్‌ డాక్టర్లు అక్రమదందాకు తెరలేపారు. ఆయుష్‌ మందులు మంచిగా పని చేస్తాయని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవనే ప్రచారం ఎక్కువగా ఉంది. దీంతో వివిధ రోగాలతో బాధపడేవారు ఈ మందుల వైపు మొగ్గు చూపుతున్నారు.

AYUSH SHOPES SEIZED: ఆయుష్‌ పేరుతో అక్రమాలు
Dhanwantari Ayush Medical Shop in Sainagar

అనుమతిలేకుండానే ఆస్పత్రులు, షాపులు నిర్వహణ

విజిలెన్స తనిఖీల్లో బట్టబయలైన అక్రమాలు

ఇటీవల అనంతలో నాలుగు ఆస్పత్రులు,

మందుల షాపుల సీజ్‌

కొందరు ఆయుష్‌ డాక్టర్లు అక్రమదందాకు తెరలేపారు. ఆయుష్‌ మందులు మంచిగా పని చేస్తాయని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవనే ప్రచారం ఎక్కువగా ఉంది. దీంతో వివిధ రోగాలతో బాధపడేవారు ఈ మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొందరు ఆయుష్‌ వైద్యులు సొంతంగా ఆస్పత్రులు, మందులషాపులు ఏర్పాటు చేసుకొని ‘వ్యాపారానికి’ తెర తీశారు. అనుమతులు లేని ఆయుష్‌ మందులు అమ్ముతూ ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ అక్రమ ఆయుష్‌ ఆస్పత్రులు, మందులషాపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఈ ఆయుష్‌ షాపులను పరిశీలించి వాస్తవ నివేదికలు ఇవ్వాలని విజిలెన్సశాఖను ఆదేశించారు.

- అనంతపురంటౌన (ఆంధ్రజ్యోతి)

నాలుగు ఆస్పత్రులు, మందుల షాపులు సీజ్‌

రాష్ట్రవ్యాప్తంగా గతనెల 25న అన్నిజిల్లాలో ఆయు్‌షఆస్పత్రులు, మందులషాపులపై దాడులు జరిగాయి. ఈక్రమంలోనే అనంత జిల్లాలో విజిలెన్స డీఎస్పీ నాగభూషణం, సీఐ శ్రీనివాసులు, ఏఓ వాసుప్రకాష్‌, జిల్లా డ్రగ్స్‌ ఇనస్పెక్టరు రమే్‌షరెడ్డి బృందం తనిఖీలు నిర్వహించింది. జిల్లాకేంద్రంలోని ఆరు ఆయుష్‌ ఆస్పత్రులతోపాటు అక్కడే నిర్వహిస్తున్న ఆయుష్‌ మందుల షాపులను తనిఖీ చేశారు. ఇందులో నాలుగు ఆస్పత్రులు, మందుల షాపులు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు బయటపడింది. జిల్లా కేంద్రంలోని కమలానగర్‌లో ఉన్న మెహతాఆయుర్వేద హాస్పిటల్‌, రామచంద్రనగర్‌లోని సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్‌, అరవిందనగర్‌లోని కేరళ అమూల్య ఆయుష్‌ హాస్పిటల్‌, సాయినగర్‌లోని ధన్వంతరి ఆయుష్‌ హాస్పిటల్‌తోపాటు అక్కడే నిర్వహిస్తున్న ఆయుష్‌ మందుల షాపులను విజిలెన్సశాఖ అధికారులు సీజ్‌ చేశారు.


ప్రభుత్వ ఆయుష్‌ డాక్టర్ల నిర్వహణ

విజిలెన్స అధికారులు సీజ్‌ చేసిన నాలుగు ఆస్పత్రుల్లో మూడు ప్రభుత్వ ఆయుష్‌ డాక్టర్లే నిర్వహిస్తుండటం గమనార్హం. వీరు ప్రభుత్వ ఆయుష్‌ ఆస్పత్రులలో ఇతర డాక్టర్ల మాదిరి గానే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే వీరి పర్యవేక్షణ వైద్యశాఖకు సంబంధం లేదంటున్నారు. డ్రగ్స్‌శాఖకు సంబంధం లేదంటున్నారు. రాయలసీమ స్థాయిలో కర్నూలులో వీరికి సంబంధించి ఇద్దరు పర్యవేక్షణ అధికారులు ఉంటారని చెబుతున్నారు. దీంతో వీరి గురించి ఎవరూ పట్టించుకోరు కాబట్టి సక్రమంగా డ్యూటీలకు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ధైర్యంగా జిల్లాకేంద్రంలో ఆయుష్‌ ఆస్పత్రులను పెట్టుకొని, సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఆయుష్‌ ఆస్పత్రులు, మందుల దుకాణాలు ప్రారంభించాలంటే తొలుత రాష్ట్రస్థాయిలో ఉన్న ఆయుష్‌ కమిషనర్‌ విభాగంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయి పరిశీలనకు పర్యవేక్షణ అధికారులను పంపుతారు. అన్నీ సక్రమంగా ఉంటే రాష్ట్ర ఆయు్‌షశాఖ కమిషనర్‌ నుంచి హాస్పిటల్‌, మందులషాపు నిర్వహణకు అనుమతులు మంజూరు అవుతాయి. ఇవన్నీ ఏమిలేకుండానే జిల్లాలో ఆయుష్‌ ఆస్పత్రులు, మందుల షాపులు నిర్వహిస్తున్నారు. అనంతపురంలోనే కాదు కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాలలో కూడా అనుమతులు లేకుండా ఆయుష్‌ ఆస్పత్రులు, మందుల షాపులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇటీవల కొందరు సొంతంగా మందులు తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఆమందులను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసి ఈఆయుష్‌ ఆస్పత్రుల డాక్టర్లు, మందులషాపు యజమానులు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకే దాడులు

రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకే జిల్లాలో ఆయుష్‌ ఆస్పత్రులు, మందులషాపుల్లో తనిఖీలు నిర్వహించాం. జిల్లాకేంద్రంలో ఆరు ఆస్పత్రులు, మందుల షాపులు తనిఖీలు చేశాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. దీంతో ఆయా ఆస్పత్రులు, మందుల షాపులను సీజ్‌ చేశాం. ప్రభుత్వానికి నివేదికలు పంపాం

- నాగభూషణం, డీఎస్పీ, విజిలెన్స

అనుమతులు మా పరిధిలో ఉండవు

ఆయుష్‌ మందులషాపులకు అనుమతులు ఇవ్వడం మా పరిధిలో ఉండదు. ఆయుష్‌ ఆస్పత్రులు, మందుల షాపుల నిర్వహణకు రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఆస్పత్రులు, మందులషాపులు ఏర్పాటు చేసుకొని నిర్వహించాలి. విజిలెన్స అధికారులతో పాటు నేనూ కూడా తనిఖీలకు వెళ్లిన సమయంలో అనుమతులు లేకుండానే ఆయుష్‌ మందుల షాపులు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. దీంతో సీజ్‌ చేశాం.

- రమే్‌షరెడ్డి, డ్రగ్స్‌శాఖ అడిషనల్‌ డైరెక్టరు

Updated Date - Dec 02 , 2024 | 11:42 PM