Share News

CPM GAFOOR: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:39 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ పేర్కొన్నారు. జిల్లాకు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19వ వరకు జిల్లావ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు.

CPM GAFOOR: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి
CPM central committee member MA Ghafoor is speaking

రాయలసీమకు రూ.10వేల కోట్లు కేటాయించాలి

కలెక్టరేట్‌ వద్ద ముగిసిన సీపీఎం బస్సు యాత్ర

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ పేర్కొన్నారు. జిల్లాకు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19వ వరకు జిల్లావ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగమేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎంఏ గఫూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అధ్వానంగా మారిందని విమర్శించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా వెడల్పు చేస్తామని చెప్పిన హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ జిల్లాకు చెందిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ చొరవ చూపి సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. మానవహక్కుల వేదిక నాయకుడు ఎస్‌ఎం బాషా మాట్లాడుతూ 14 సంవత్సరాలు గడుస్తున్నా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునికీకరణను ప్రభుత్వాలు పూర్తిచేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2008లో చేపట్టిన హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రాంభూపాల్‌ మాట్లాడుతూ సాగునీటికోసం చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగదని, ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చేవరకూ సాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం నగర ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నల్లప్ప, సావిత్రి, నాగేంద్రకుమార్‌, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, నాగమణి, రామాంజనేయులు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:39 PM