Share News

DISTRICT STORY : ఇది మాట తప్పడం కాదా..?

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:05 AM

ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగనరెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు హామీలను ఇచ్చి ఇప్పటికీ తీర్చకపోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. వాటిలో ముఖ్యంగా భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని, తుంగభద్ర ఎగువకాలువను ఆధునికీకరిస్తామని, బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని హామీలు గుప్పించారు.

DISTRICT STORY : ఇది మాట తప్పడం కాదా..?
A dilapidated Hceli

బీటీపీకి కృష్ణా జలాల మళ్లింపు ఏదీ..?

హెచ్చెల్సీ ఆధునికీకరణ అటకెక్కించలేదా..?

నేమకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఎక్కడ..?

114 చెరువులకు నీరు ఎప్పుడిస్తారు..?

సీఎం జగనను నిలదీస్తున్న రైతాంగం

రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సాగునీటిపై జగనరెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. ఆయన ప్రతిపక్ష నేతగానే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు కూడా అవే హామీలు ఇచ్చారు. నిధులుమంజూరు చేస్తానని, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని నమ్మించారు. దీంతో సాగునీటితో తమ బతుకులు మారతాయని రైతులు ఆశించారు. కానీ ఐదేళ్ల పాలన గడిచిపోయింది. హామీలు అలాగే ఉండిపోయాయి.


రాయదుర్గం/కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 21: ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగనరెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు హామీలను ఇచ్చి ఇప్పటికీ తీర్చకపోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. వాటిలో ముఖ్యంగా భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని, తుంగభద్ర ఎగువకాలువను ఆధునికీకరిస్తామని, బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని హామీలు గుప్పించారు. రాయదుర్గం, గుమ్మఘట్టలో ఐదేళ్ల కాలంలో రెండుసార్లు సీఎం పర్యటన జరిగింది. అప్పుడు కూడా వేదికలపై వీటి గురించి గట్టిగా నమ్మ బలికారు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. దీంతో సీఎం జగన హామీలు నీటిమీద రాతల్లా మిగిలిపోయాయి.

అంతా రివర్స్‌

భైరవానతిప్ప రిజర్వాయర్‌కు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తరలిచేందుకు రూ.150 కోట్ల వ్యయంతో పనులు చేస్తామని జగన హామీ ఇచ్చారు. ఇక్కడి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానని అన్నారు. అంతకు మునుపే తెలుగుదేశం ప్రభుత్వం రూ.989 కోట్లు నిధులు


మంజూరు చేసి కృష్ణాజలాల మళ్లింపు పనులను ప్రారంభించింది. కానీ నిధులను మింగేందుకు ఎక్కువ అంచనాలు వేసుకున్నారని ఆరోపిస్తూ.. జగన రివర్స్‌ టెండరింగ్‌కు ప్రయత్నించారు. కానీ అందులో డొల్ల లేదని నిగ్గు తేలింది. పైగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనను గెలిపిస్తే రూ.150 కోట్లతో జీడిపల్లి నుంచి బీటీపీకి నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి జగన పర్యటన సందర్భంగా రూ.989 కోట్లతో మూడునెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీని ఇప్పించి మూడేళ్లు గడిచింది. ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా జగన ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదు.

ఇదీ అంతే..

బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి, జగన చేతు లెత్తేశారు. హెచ్చెల్సీ ద్వారా అందుతున్న జలాలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు కష్టకాలంలో ఉంతకల్లు రిజర్వాయర్‌ ద్వారా నీటి వినియోగం చేసుకోవచ్చనే ఆలోచనతో రైతుల శ్రేయస్సు కోరి టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లతో డీపీఆర్‌ కూడా సిద్ధం చేసింది. దీని ప్రకారం రిజర్వాయర్‌ నిర్మిస్తామని సీఎం జగన రెండుసార్లు స్పష్టమైన హామీ ఇచ్చారు.


కానీ ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. ఐదేళ్ల కాలంలో పనులు ప్రారంభమవుతాయని ఆశపడిన రైతులకు భంగపాటు ఎదురైంది. 70 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతాయని ఆశించారు. కానీ డీపీఆర్‌ మాత్రం బుట్టదాఖలు చేశారు.

అటకెక్కిన ఆధునికీకరణ

తుంగభద్ర ఎగువకాలువను 84 కి.మీ. మేర ఆధునికీకరిస్తామని జగన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆధునికీకరణ పనులను పదేళ్ల క్రితమే ఆరు ప్యాకేజీలుగా రూ.450 కోట్లతో ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో 60 శాతం పనులను పూర్తి చేశారు. మిగిలిన పనులను వైసీపీ అధికారంలోకి రాగానే వేగంగా పూర్తి చేస్తామని నమ్మబలికారు. కాలువ శిథిలావస్థకు చేరుకుంది. ఏటా నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా.. ఆధునికీకరణ దిశగా జగన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఎగువ కాలువపై ఉన్న బ్రిడ్జిలు ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడలేదు. ఇప్పటి వరకు వ్యయ ప్రయాసలతో కాలువలో నీటిసరఫరా సాగుతోంది. ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం షెట్లర్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కణేకల్లు, బొమ్మనహాళ్‌ రైతాంగం మండిపడుతోంది.

114 చెరువులకు నీరు ఉత్తిదే..

కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం జీడిపల్లి జలాశయం నుంచి కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌, భైరవానతిప్ప ప్రాజెక్టుకు నీరు తరలించేందుకు రూ.968 కోట్లు నిధులు మంజూరు చేసింది. దాదాపు 20 శాతం పనులు పూర్తి చేసింది.


అప్పటి ప్రతిపక్ష నేత జగనరెడ్డి కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేసి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను విస్మరించింది. 114 చెరువులకు నీరిచ్చిన తరువాతనే 2024లో ఓట్లు అడగడానికి వస్తామని జగనరెడ్డి, అప్పటి వైసీపీ అభ్యర్థి ఉష శ్రీచరణ్‌ ప్రగల్బాలు పలికారు. గెలిచి.. మంత్రి అయిన ఉష శ్రీచరణ్‌ హామీని విస్మరించారు. ఐదేళ్లు గడిచాక నియోజకవర్గం వీడి.. పెనుకొండకు వలస వెళ్లారు. సీఎం జగన దీనికి ఏమని సమాధానం చెబుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలోనే కాకుండా 2021లో రాయదుర్గం పర్యటనకు వచ్చినప్పుడు కూడా భైరవాన తిప్ప ప్రాజెక్టు గురించి సీఎం జగన ఇవే హామీలు ఇచ్చి మోసగించారు.


రైతు దగా ప్రభుత్వం..

సాగునీరు అందిస్తామని వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పి దగా చేసింది. భూగర్భ జలాలు అడుగంటి పోయి, వేసిన పంటలు చేతికి రాకుండా ఎండిపోతున్నాయి. 114 చెరువులకు నీరు ఇచ్చిన తరువాతే ఓటు అడగడానికి వస్తామని వైసీపీ నాయకులు అప్పట్లో హామీ ఇచ్చారు. మాట తప్పిన మంత్రి ఉషశ్రీ చరణ్‌.. బదిలీపై పెనుకొండకు వెళ్లిపోయారు. - దొణతిమ్మప్ప, రైతు, ఎర్రంపల్లి

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:51 AM