ATP LIQUOR LUCKY DRAW ; కిక్కు.. కొందరికే లక్కు..!
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:52 PM
జేఎనటీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో సోమవారం కేటాయించారు. జిల్లాలోని 136 మద్యం దుకాణాలకు 3265 దర ఖాస్తులు వచ్చాయి. కొందరు ఎక్కువ దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు.
136 మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి
19 దుకాణాలను దక్కించుకున్న మహిళలు
అనంతపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జేఎనటీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో సోమవారం కేటాయించారు. జిల్లాలోని 136 మద్యం దుకాణాలకు 3265 దర ఖాస్తులు వచ్చాయి. కొందరు ఎక్కువ దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో లాటరీ ప్రక్రియకు 2500 మంది దాకా వచ్చారు. దరఖాస్తుదారులతో వర్సిటీ ప్రాంగణంలో సందడి కనిపించింది. లాటరీ వేదికకు ఉదయం 7 గంటలకే చేరుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. కొందరు దరఖాస్తుదారులు ముందుగానే చేరుకోగా.. మరికొందరు ఆలస్యంగా వచ్చి పరుగులు పెట్టారు. మహిళలు సైతం గణనీయంగా వచ్చారు. యాభై మందికిపైగా మహిళలు లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ శివనారాయణ్ శర్మ, ఎస్పీ జగదీష్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, సూపరింటెండెంట్ రామమోహనరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా అనంతపురం అర్బనలోని మొదటి దుకాణం డ్రా తీశారు. మధ్యాహ్నం 2గంటలకు మొత్తం దుకాణాల లాటరీలు తీశారు. లక్కీ డ్రా ప్రారంభం కా గానే దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ కనిపించింది. అనంతపురం అర్బనలో మొదటి దుకాణానికి 44 దరఖాస్తులు వచ్చాయి. 30వ టోకన నంబర్ దరఖాస్తుదారు చల్లా లక్ష్మీనారాయణకు ఆ దుకాణం దక్కింది. రెండో దుకాణం ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అనుచరుడు గంగారామ్‌కు దక్కింది.
మహిళలకు 19 దుకాణాలు
జిల్లాలోని 136 దుకాణాల్లో 19 మహిళలకు దక్కాయి. ఇందులో నాలుగు నంద్యాల జిల్లా నంది గ్రూప్ సంస్థలకు చెందిన సుజల దక్కించుకున్నారు. అనంతపురం రూరల్ మండలంలో రెండు, గుంతకల్లు, కళ్యాణదుర్గం రూరల్‌లో ఒక్కొక్క దుకాణాలను దక్కించుకున్నారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రంలో వైసీపీకి చెందిన పూజారి నారాయణమ్మ లాటరీలో దుకాణం దక్కించుకున్నారు. మిగిలిన 14 దుకాణాలను టీడీపీకి చెందిన మహిళలు దక్కించుకున్నారు.
అనుచరులకు నిరాశ
అనంతపురం అర్బనలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనుచరులు 30 దుకాణాలకు ఏకంగా 300లకుపైగా దరఖాస్తులు సమర్పించారు. లక్కీ డ్రాలో 11 దుకాణాలు మాత్రమే దక్కాయి. మిగిలిన 19 దుకాణాలు మద్యం వ్యాపారులు, తటస్థులకు దక్కాయి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.1.70 కోట్లు సొంత డబ్బుతో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయించారు. మొత్తం 10 దుకాణాలు ఉండగా.. రెండు మాత్రమే అమిలినేని అనుచరులకు దక్కాయి. దీంతో ఎమ్మెల్యేతోపాటు పార్టీ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ఇక్కడ ఏకంగా 8 దుకాణాలు మద్యం వ్యాపారులు, తటస్థులకు దక్కాయి.
టీడీపీ శ్రేణులకే మెజార్టీ దుకాణాలు
తాడిపత్రి నియోజకవర్గంలో 20 దుకాణాలకుగాను 10కిపైగా జేసీ అనుచరులకే దక్కాయి. రెండు విజయవాడ వ్యక్తులకు దక్కగా.. మిగిలినవి వ్యాపారులు, తటస్థులకు దక్కాయి. రాయదుర్గం నియోజకవర్గంలో 14 దుకాణాలు ఉండగా... 2 వైసీపీ, 2 తటస్థులకు దక్కాయి. 10 దుకాణాలు టీడీపీ శ్రేణులకు దక్కాయి. గుంతకల్లు నియోజకవర్గంలో 23 దుకాణాలు ఉండగా... వైసీపీ, జనసేన, నంది గ్రూప్‌లకు ఒక్కొక్కటి దక్కాయి. మిగిలిన దుకాణాలు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ నాయకులకు దక్కాయి. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో మొత్తం 8 దుకాణాలు ఉండగా... రెండు నంది గ్రూప్‌నకు దక్కాయి. ఒకటి తటస్థులకు, మిగిలిన దుకాణాలు టీడీపీ శ్రేణులకు దక్కాయి. ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం 13 దుకాణాలు ఉండగా.. 2 దుకాణాలు వైసీపీ నాయకులకు, ఒకటి తటస్థులకు దక్కాయి. 10 దుకాణాలు టీడీపీ శ్రేణులకు దక్కాయి. శింగనమల నియోజకవర్గంలో 18 దుకాణాలు ఉండగా.. 14 దుకాణాలు టీడీపీ శ్రేణులకు, 3 వైసీపీ శ్రేణులకు, ఒకటి తటస్థుడికి దక్కాయి. జిల్లాలో 136 మద్యం దుకాణాల్లో మెజార్టీ దుకాణాలు టీడీపీ శ్రేణులకు దక్కాయి. వైసీపీ వర్గీయులు ఏడు దుకాణాలను దక్కించుకున్నారు.