DOCTORS : ఆలస్యం.. అలవాటు!
ABN , Publish Date - May 28 , 2024 | 11:41 PM
‘సారీ.. పేషెంట్ రావడం ఆలస్యమైంది. ఒక ఐదు నిమిషాల ముందు వచ్చి ఉన్నా ప్రాణాలను కాపాడేవాళ్లం..’ ఈ డైలాగ్ చాలా సినిమాల్లో ఉంటుంది. చాలామందికి అనుభవంలోకీ వచ్చి ఉంటుంది. రోగికి సకాలంలో వైద్యం అందడం ఎంత కీలకమో.. ఈ మాటలు చెబుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, హార్ట్ ఎటాక్, బ్రెయిన సో్ట్రక్ వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆస్పత్రికి సకాలంలో వెళ్లగలగాలి. ప్రమాదం తలెత్తిన తరువాత మొదటి గంటపాటు సమయాన్ని ‘గోల్డెన అవర్’ అని వైద్యులు అంటుంటారు. అంటే.. ఆ సమయంలో వైద్యం అందిస్తే రోగి ప్రాణాలు నిలబడతాయి. లేదా.. ప్రమాద తీవ్రత బాగా తగ్గుతుంది. ఇదీ.. సమయానికి ఉన్న విలువ. ప్రాణాలు నిలబెట్టే వైద్యులకు...
మార్నింగ్ వాక్‌కు వచ్చి ముఖ హాజరు వేస్తారు
ఆలస్యంగా వచ్చి.. సర్వర్ సమస్య అంటారు..
ఓపీలో ఉంటే ఉంటారు.. లేదంటే లేదు..
జూనియర్లు.. హౌస్ సర్జన్లే రోగులకు దిక్కు
పెద్దాసుపత్రిలో సీనియర్ వైద్యుల ఇష్టారాజ్యం
‘సారీ.. పేషెంట్ రావడం ఆలస్యమైంది. ఒక ఐదు నిమిషాల ముందు వచ్చి ఉన్నా ప్రాణాలను కాపాడేవాళ్లం..’ ఈ డైలాగ్ చాలా సినిమాల్లో ఉంటుంది. చాలామందికి అనుభవంలోకీ వచ్చి ఉంటుంది. రోగికి సకాలంలో వైద్యం అందడం ఎంత కీలకమో.. ఈ మాటలు చెబుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, హార్ట్ ఎటాక్, బ్రెయిన సో్ట్రక్ వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆస్పత్రికి సకాలంలో వెళ్లగలగాలి. ప్రమాదం తలెత్తిన తరువాత మొదటి గంటపాటు సమయాన్ని ‘గోల్డెన అవర్’ అని వైద్యులు అంటుంటారు. అంటే.. ఆ సమయంలో వైద్యం అందిస్తే రోగి ప్రాణాలు నిలబడతాయి. లేదా.. ప్రమాద తీవ్రత బాగా తగ్గుతుంది. ఇదీ.. సమయానికి ఉన్న విలువ. ప్రాణాలు నిలబెట్టే వైద్యులకు దీని ప్రాధాన్యం ఏమిటో బాగా తెలుసు. కానీ.. జిల్లా ఆస్పత్రిలో వారే సమయ పాలన పాటించడం లేదు. కొందరు మార్నింగ్ వాక్‌కు వచ్చి ముఖ హాజరు వేస్తారట. ఆ
తరువాత ఇష్టమొచ్చిన సమయంలో విధులకు హాజరౌతారట. మరికొందరు ఆలస్యంగా వచ్చి.. ‘సర్వర్ సమస్య..’ అని బుకాయిస్తారట..! ఇలాంటి వైద్యుల తీరు కారణంగా దూరాభారం నుంచి వచ్చే పేద రోగులకు సరైన వైద్యం అందించడం లేదు.- అనంతపురం టౌన
ఏం ప్రయోజనం..?
జనవరి నెలలో ఆర్థో విభాగం సీనియర్ వైద్యులు ఇద్దరు 24 రోజులకుగాను 23 రోజులు ఒకరు, 18 రోజులు మరొకరు ఆలస్యంగా విధులకు వచ్చారు. జనరల్ మెడిసిన విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్ 26 రోజులకుగాను 24 రోజులు ఆలస్యంగా వచ్చారు. మరో సీనియర్ డాక్టర్ 25 రోజులకుగానూ 22 రోజులు ఆలస్యంగా వచ్చారు. ఫోరెన్సిక్ విభాగంలో సీనియర్ వైద్యుడు మొత్తం 24 రోజులూ ఆలస్యంగానే వచ్చారు. పీడియాట్రిక్ విభాగంలో ఓ డాక్టరు 28 రోజులకుగాను 24 రోజులు ఆలస్యం వచ్చారు. ఫార్మకాలజీలో ఓ డాక్టరు 24 రోజులకుగాను 21 రోజులు, సైకాలజీ విభాగంలో ఓ డాక్టరు 28 రోజులకుగాను 24 రోజులు, రేడియాలజీలో ఓ డాక్టరు 25 రోజులకుగాను 18 రోజులు, న్యూరో సర్జరీలో ఓ డాక్టరు 24 రోజులకుగాను 22 రోజులు ఆలస్యంగా వచ్చారు. అనస్థీషియా విభాగంలో నలుగురు డాక్టర్లు 24 రోజులు చొప్పన ఆలస్యంగా వచ్చారు. ఎవరో చెప్పిన వివరాలు కావివి.. స్వయంగా వైద్యులు ముఖ హాజరు వేసిన సమయం ఆధారంగా ‘జాప్యం’ వివరాలు. విధులకు సకాలంలో హాజరు కావాలన్న ఉద్దేశంతోనే ముఖ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆయినా వైద్యుల తీరు మారకపోతే.. ఈ పద్ధతి వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..? కర్రపెత్తనంతో క్రమశిక్షణ సాధించేందుకు వైద్యులు చిన్న పిల్లలు కాదు కదా..!
మా ఇష్టం..
జిల్లా సర్వజన వైద్యశాలలో సమయ పాలన అటకెక్కింది. హాజరు పద్ధతి ఏదైనా.. తమ పద్ధతి మారదని కొందరు వైద్యులు నిరూపిస్తున్నారు. తమకు ఇష్టమైన సమయంలో విధులకు వస్తున్నారు. కాసేపు ఉండి వెళ్లిపోతున్నారు. తమను అడిగేది ఎవరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీనియర్ వైద్యుల తీరే ఇలా ఉంటే.. ఇక ఆస్పత్రి పరిస్థితి ఎలా మెరుగుపడుతుందని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం 21 విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో సీనియర్లు, అసోసియేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. వీరిలో చాలామంది సమయ పాలన పాటించడం లేదు. కొందరైతే వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మార్నింగ్ వాక్‌కు వచ్చి ముఖహాజరు వేసి వెళుతున్నారు. వైద్యుల ముఖహాజరు వ్యవహారం వైద్యకళాశాల ప్రిన్సిపాల్ చూసుకోవాల్సి ఉంటుంది. అనేక ఫిర్యాదులు రావడంతో జనవరిలో డాక్టర్ల ముఖహాజరు విషయాన్ని ప్రిన్సిపాల్ సీరియ్‌సగా తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు రోజుల ఆలస్యానికీ ఒక సీఎల్ నమోదు చేశారని తెలిసింది. దీనిపై సీనియర్ డాక్టర్లు ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగడంతో కొందరు జోక్యం చేసుకొని సర్దిచెప్పినట్లు చర్చించుకుంటున్నారు.
వైద్యం ఏదీ..?
జిల్లా ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్లు ఉన్నారని, మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా నలుమూలల నుంచి పేద రోగులు వస్తుంటారు. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వస్తే పెద్ద డాక్టర్లు ఓపీ కేంద్రాలలో ఉండడం లేదు. ఒక వేళ వచ్చినా.. చుట్టుపు చూపుగా కొంత సేపు కూర్చుని వెళ్లిపోతున్నారు. జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లే పేద రోగులకు పెద్ద దిక్కుగా మారిపోయారు. పెద్దసారు లేరా.. అని ఎవరైనా అడిగితే.. వార్డులలో రౌండుకు వెళ్లారని జూనియర్స్ సమాధానమిస్తున్నారు. నిబంధనల మేరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలలో సీనియర్ డాక్టర్లు ఉండి, రోగులకు వైద్య సేవలు అందించాలి. కానీ జిల్లా ఆస్పత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఎవరికి వారే..
సీనియర్ డాక్టర్లకు జీతభత్యాలు ఇచ్చే అధికారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉంటుంది. అందుకే వారి హాజరును పర్యవేక్షించే అధికారం ప్రిన్సిపాల్‌కే ఇచ్చారు. సీనియర్లు ఆలస్యంగా విధులకు వస్తున్నారని ఆనలైన స్పష్టంగా కనిపిస్తున్నా, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రిన్సిపాల్ జంకుతున్నారని సమాచారం. విషయం తెలిసినా సూపరింటెండెంట్ సైతం ఏమీ అనడం లేదు. ఆలస్యంగా వస్తున్నారని, ఓపీ వైద్యం చేయడం లేదని, కాఫీ బార్‌లో కాలక్షేపం చేస్తున్నారని తెలిసినా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్యుల పనితీరును ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్.. ఇద్దరూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ వీరి మధ్యనే సమన్వయం లేదని ప్రచారం ఉంది. ఇదే అదనుగా సీనియర్లు ఆస్పత్రి విధులకు డుమ్మా కొట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నిజమే.. ఆలస్యంగా వస్తున్నారు..
డాక్టర్లు సమయపాలన పాటించాలనే ముఖహాజరును ప్రవేశపెట్టాం. చాలామంది డాక్టర్లు ఆలస్యంగా హాజరు వేస్తున్నారు. వారి వివరాలను డీఎంఈకి పంపాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు మూడురోజులు ఆలస్యంగా హాజరు వేస్తే ఒక సీఎల్ కట్ చేస్తున్నాం. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసి, వారి నుంచి వివరణ తీసుకుంటున్నాం. అన్నీ డీఎంఈకి పంపిస్తాం.
- డాక్టర్ మాణిక్యాల రావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్
ఆరాతీస్తున్నాం..
సీనియర్ డాక్టర్లు ఓపీలలో ఉండాల్సిందే. విధుల్లో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను రోజువారీగా తీసుకుంటున్నాం. డ్యూటీలో లేనోళ్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. సర్వర్ సమస్య కారణంగా కొందరు ఆలస్యంగా హాజరు వేసినట్లు చెబుతున్నారు. రికార్డులలో సమయానికి సంతకాలు పెడుతున్నారు.
- డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్
మరిన్ని అనంతపురం వార్తల కోసం...