Share News

MUNCIPALITY: కండువా మార్చేద్దాం..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:40 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెవిచూసి కోలుకోలేనంతగా వైసీపీ ఇబ్బందుల్లో పడింది. ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కొంతమంది నేరుగా అధిష్టానాన్నే తప్పు పడుతుండగా ఆయా నియోజకవర్గాల బాధ్యులను తిట్టిపోస్తున్నారు.

MUNCIPALITY: కండువా మార్చేద్దాం..!

కుర్చీ మడతపెట్టేద్దాం...

వైసీపీని వీడేందుకు మున్సిపల్‌ కౌన్సిలర్లు సిద్ధం

కొందరిని వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు

హిందూపురం, జూన 8: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెవిచూసి కోలుకోలేనంతగా వైసీపీ ఇబ్బందుల్లో పడింది. ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కొంతమంది నేరుగా అధిష్టానాన్నే తప్పు పడుతుండగా ఆయా నియోజకవర్గాల బాధ్యులను తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే ఏకంగా కండువా మార్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం మున్సిపాలిటీ రాజకీయ ముఖచిత్రం త్వరలో మారబోతుందా అంటే, అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణలోఓ దీనిపైనే ఎక్కడచూసినా చర్చించుకుంటున్నారు. పట్టణంలో 38 వార్డులుండగా 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 29 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. ఆరుగురు టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, స్వతంత్రులు ఒక్కొక్కరు గెలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు వైసీపీవారు కావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో వారి సంఖ్య 30కి చేరింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ బలం తొమ్మిదికి చేరింది. దీనికితోడు బీజేపీ కౌన్సిలర్‌ ఒకరున్నారు. వీరితో కలుపుకుంటే పది మంది అవుతారు. చైర్మన కావాలంటే 20మంది అవసరం.


వైసీపీని వీడే యోచన

సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం టీడీపీ క్లీనస్వీ్‌ప చేయడంతో మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు కొంతమంది ఎలాగైనా కండువా మార్చేద్దామని తన సన్నిహితులవద్ద చెప్పుకుంటున్నారు. ఈనేపథ్యంలో కొంతమంది కౌన్సిలర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలోనే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కలిసి వైసీపీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీలో చేరుదామని లేదంటే వార్డుల్లో తిరగలేమని ఆలోచనలో పడ్డారు. ఇందులో ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధి తరలిరావడానికి కారణమైన మాజీ ప్రజాప్రతినిధి ఇప్పటికే టీడీపీలో చేరడంతో మార్గం సుగమం అవుతుందని చర్చించుకుంటున్నారు. వీరితోపాటు మరో 15 మంది కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


వారు వద్దే వద్దు..

ఐదేళ్ల వైసీపీ పాలనలో కొంతమంది కౌన్సిలర్లు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రతి కౌన్సిల్‌ సమావేశంలోనూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తీవ్రంగా విమర్శించారు. కొంతమందైతే ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అలాంటి కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి తీసుకోకూడదని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. మరికొంతమందైతే కౌన్సిలర్లు వస్తే టీడీపీ చైర్మన కావచ్చని భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆరేడుమంది సభ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి చేర్చుకోనీయకూడదని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వారిని టీడీపీలోకి తీసుకుంటే మేము అవసరమైతే పార్టీకి దూరంగా ఉంటామని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్లు వైసీపీ సభ్యులను చేర్చుకుంటే ఆఖరి ఏడాది తెలుగుదేశం పార్టీకి చెందినవారు చైర్మన కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే మునిసిపల్‌ చైర్మనను మార్చాలంటే ఎన్నుకున్న నాలుగేళ్లు మార్చడం సాధ్యం కాదు. దీంతో ప్రస్తుతం ఉన్న చైర్మన వచ్చేయేడాది మార్చినాటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఆఖరి యేడాది టీడీపీ వారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


మారనున్న ముఖచిత్రం

ఒకవేళ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే హిందూపురం మునిసిపాలిటీ ముఖచిత్రం మారనుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా మెజార్టీ కౌన్సిలర్లు ఉండి కూడా మరోపార్టీలో చేరి ఆ పార్టీ తరుపున చైర్మన అయితే అది హిందూపురం మునిసిపాలిటీ విచిత్రమవుతుంది. అంతేకాక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కావడంతో ఇదో రికార్డుగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రహస్య మంతనాలు షురూ..!

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు, నాయకులు కండువాలు మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 08 , 2024 | 11:41 PM