DMHO: మేడమ్.. అక్కడ కాదు... ఇక్కడ చూడండి..!
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:41 PM
ఒకరికి మనం చెప్పేటపుడు, మనం కాస్తోకూస్తో ఆదర్శంగా ఉంటూ వాటిని పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనం చెప్పేవాటిని ఎదుటివారు పాటిస్తారు. అలాకాకుండా మనం ఇష్టమెచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులకు నీతిసూత్రాలు చెబితే అందరూ చులకనచేస్తూ నవ్వుతారు.
పట్టించుకోని అధికారులు
అనంతపురం టౌన, జూలై 19: ఒకరికి మనం చెప్పేటపుడు, మనం కాస్తోకూస్తో ఆదర్శంగా ఉంటూ వాటిని పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనం చెప్పేవాటిని ఎదుటివారు పాటిస్తారు. అలాకాకుండా మనం ఇష్టమెచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులకు నీతిసూత్రాలు చెబితే అందరూ చులకనచేస్తూ నవ్వుతారు. ప్రస్తుతం జిల్లా వైద్యశాఖ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. సీజనల్ వ్యాధుల కాలం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో అతిసార, డెంగీ, వైరల్ ఫీవర్ల బారినపడి జనం ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ సైతం ఈ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దాదాపుగా సీజనల్ వ్యాధులను దూరం చేయవచ్చని, వైద్యశాఖ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. శుక్రవారం డ్రైడేగా పరిగణిస్తూ శుభ్రత కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నగరంలోని నీరుగంటి వీధిలో పరిసరాల పరిశుభ్రత పరిశీలనకు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి వెళ్లి స్వయంగా పరిశీలిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అలాంటప్పుడు వైద్యశాఖ ఎంతో ఆదర్శంగా ఉండాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ కార్యాలయం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డీఎంహెచఓ కార్యాలయంలోని రెండో అంతస్తులో ఓ మూలన చెత్తను కుప్పగా వేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇదే అంతస్తులో జిల్లా మలేరియా నివారణ అధికారి ఉన్నారు. ఈయనే సీజనల్ వ్యాధులను పర్యవేక్షించడం, నివారణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోవైపు అవగాహన కల్పించే మాస్ మీడియా విభాగం, వైరల్ పీవర్స్ నిర్ధారణ చేసే ల్యాబ్ గది ఉన్నాయి. కానీ ఇక్కడే చెత్తకుప్ప ఉండడం చూస్తే వీరు సీజనల్ వ్యాధుల నివారణకు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఆచెత్తచూసినోళ్లందరూ ఇదేమి వైద్యశాఖ బాబోయ్ అంటూ మాట్లాడుకోవడం కనిపించింది.