Share News

POST : మేడమ్‌.. సర్‌..!

ABN , Publish Date - May 24 , 2024 | 12:35 AM

ఎక్కడైనా ఒక పోస్టులో ఒకే అధికారి ఉంటారు. కానీ జడ్పీలో మాత్రం ఒక పోస్టులో ఇద్దరు అధికారులు పనిచేస్తున్నారు. ఇద్దరూ విధులకు వస్తారు. ఎవరిస్థాయిలో వారు ఆదేశాలు.. సూచనలు ఇస్తారు. కానీ ఎవరివి పాటించాలో తెలియక కిందిస్థాయివారు జుట్టు పీక్కుంటున్నారు. ఏ సమస్యపై ఎవరిని కలవాలో, ఎవరికి ఏ వినతి పత్రం ఇవ్వాలో తెలియక ...

POST : మేడమ్‌.. సర్‌..!
Office of ZP

ఒకే పోస్టు.. ఇద్దరు అధికారులు..

ఎవరి మాట వినాలో తెలియని దుస్థితి

జడ్పీలో మూడు నెలలుగా వింతనాటకం

అనంతపురం విద్య, మే 23: ఎక్కడైనా ఒక పోస్టులో ఒకే అధికారి ఉంటారు. కానీ జడ్పీలో మాత్రం ఒక పోస్టులో ఇద్దరు అధికారులు పనిచేస్తున్నారు. ఇద్దరూ విధులకు వస్తారు. ఎవరిస్థాయిలో వారు ఆదేశాలు.. సూచనలు ఇస్తారు. కానీ ఎవరివి పాటించాలో తెలియక కిందిస్థాయివారు జుట్టు పీక్కుంటున్నారు. ఏ సమస్యపై ఎవరిని కలవాలో, ఎవరికి ఏ వినతి పత్రం ఇవ్వాలో తెలియక జడ్పీసీటీలు, ఎంపీపీలు బుర్ర గోక్కుంటున్నారు. కొన్ని నెలలుగా జడ్పీలో ఈ తంతు సాగుతోంది. జడ్పీ ఉన్నతాధికారులకు, కలెక్టరేట్‌ ఉన్నతాధికారులకు తెలిసినా.. చోద్యం చూస్తున్నారు. దీంతో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కాంట్రాక్టర్లు, సమస్యలపై జడ్పీ వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఎటూతేల్చని అధికారులు...

జడ్పీలో ప్రస్తుతం ఇద్దరు అధికారులు డిప్యూటీ సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు రమణారెడ్డి.. మరొకరు లలితా బాయి. ఈ పరిస్థితికి ఒక రకంగా ఫిబ్రవరి 29న జరిగిన సంఘటన కారణం. ఆ రోజు జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాలకవర్గ సభ్యులు అందరూ జడ్పీ అధికారుల తప్పిదాలను ఏకరవు పెట్టారు. డిప్యూటీ సీఈఓ లలితా బాయి తమతో అగౌరవంగా మాట్లాడుతున్నారని, సమస్యలపై మాట్లాడేందుకు వెళితే ఏమాత్రం పట్టించుకోవడం లేదని జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓ నిదియాదేవి సమక్షంలోనే సభ్యులందరూ కింద కూర్చుని నిరసన తెలిపారు. లలితా బాయిని సరెండర్‌ చేయాలని, అంత వరకూ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు వచ్చేది లేదని సమావేశాలను బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు. దీంతో మీటింగ్‌ వాయిదా పడింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన జడ్పీ అధికారులు, జిల్లా స్థాయి ఉన్నధికారులు.. మరింత జఠిలం చేశారు. గతంలో ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఇచ్చిన ఉత్తర్వులు సమస్య తీవ్రతను మరింత పెంచాయి.


ఇదీ పరిస్థితి..

పాలకవర్గం వాకౌట్‌ చేయడంతో.. సమస్యను పరిష్కరిస్తున్నామనే నెపంతో లలితా బాయిని గుంతకల్లు డీఎల్‌డీఓగా నియమించారు. డ్వామాలో జిల్లా విజిలెన్స ఆఫీసర్‌గా పనిచేస్తున్న రమణారెడ్డిని డిప్యూటీ సీఈఓగా నియమించారు. ఇద్దరినీ డెప్యుటేషన పద్ధతిలో నియమించారు. అప్పటి కలెక్టర్‌ గౌతమి ఈ మేరకు మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఈఓగా రమణారెడ్డి అదే నెల 18న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి అసలు సమస్య మొదలైంది. గుంతకల్లు డీఎల్‌డీఓగా వెళ్లాల్సిన లలితా బాయి సైతం జడ్పీ కార్యాలయానికి వస్తున్నారు. కొంతకాలంగా ఆమె నిత్యం జడ్పీకి వచ్చి.. డిప్యూటీ సీఈఓ చాంబర్‌లో ఉంటున్నారు. రమణారెడ్డికి ఇప్పటి వరకూ ఎఫ్‌ఏసీ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఆయనకు జీతాలు, బిల్లులు చెల్లింపు అధికారం (డీడీఓ పవర్‌) దక్కలేదు. ఆ


అధికారం లలితాబాయి వద్దే ఉంది. ఈ కారణంగానే ఆమె జడ్పీకి వస్తున్నారని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. డిప్యూటీ సీఈఓ చాంబర్‌లో రమణారెడ్డి, లలితా బాయి.. ఇద్దరూ డిప్యూటీ సీఈఓలుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో జడ్పీలోని ఏఓలు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఖరికి ఎంపీడీఓలు కూడా ఆ ఇద్దరు అధికారుల్లో ఎవరు తమ డిప్యూటీ సీఈఓనో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరి మాట వినాలో.. ఎవరి మాట వినకూడదో అర్థంగాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకరి మాట విని.. మరొకరి మాట వినకుంటే తమకు ఎక్కడ సమస్య వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా ఇదే సమస్య కొనసాగుతోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 24 , 2024 | 12:35 AM