Share News

BUS YATHRA : బస్సుయాత్రను జయప్రదం చేయండి

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:01 AM

జిల్లాకు సాగునీటి సాధన కోసం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈనెల 20 వరకు చేపట్టనున్న బస్సు యాత్రను జయప్రదం చేయా లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ పిలుపునిచ్చారు.

BUS YATHRA : బస్సుయాత్రను జయప్రదం చేయండి
CPM leaders unveiling bus yatra poster

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు సాగునీటి సాధన కోసం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈనెల 20 వరకు చేపట్టనున్న బస్సు యాత్రను జయప్రదం చేయా లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యలయంలో సోమవారం బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ పాలకుల విధానాల వల్ల జిల్లా శతాబ్దాలుగా వెనుకబడి ఉందన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధికి సరైన చర్యలు చేపట్టకుండా జిల్లాకు అన్ని ప్రభుత్వాలు అన్యాయం చేశాయని విమర్శించారు. ఎగువ తుంగభద్ర, దిగువ శ్రీశైలం డ్యాములు నిండి పొంగి పొర్లుతున్నా మన జిల్లాకు రావాల్సిన నీరు రాకపోవడం దారుణమన్నారు. ఈ పరిస్థితిపై ప్రజాభిప్రాయాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు బస్సుయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయం బతకాలంటే కనీసం 30శాతం భూమికి సాగునీటి వనరులు కల్పించాలని జాతీయ ఇరిగేషన కమిషన 1972లో సూచించిందన్నారు. జిల్లాలో నికరంగా 14.85లక్షల ఎకరాల సాగుభూమి ఉందని, ఇందులో స్థిరీకరించబడిన ఆయకట్టు 45,224 ఎకరాలు, అంటే మొత్తం సాగుభూమిలో 3.04శాతం భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉందన్నారు. 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైన హెచ్చెల్సీ ఆధునికీకరణ అంతులేని నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2012 నుంచి హంద్రీనీవా నీరు జిల్లాకు వస్తున్నా ఇప్పటివరకూ పంట కాలువలు లేవన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు బస్సుయాత్ర, 21న కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రైతాంగం పెద్దసంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సావిత్రి, బాలరంగయ్య, నాగేంద్రకుమార్‌, నల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 12:01 AM