Share News

jagan హద్దులు చెరిపేస్తున్నారు..!

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:21 PM

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ గత వైసీపీ పాలకులు చేపట్టిన సమగ్ర భూసర్వే రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ విధానంతో చివరికి రెవెన్యూ, సర్వే అధికారులకు సైతం లేని తలనొప్పి వచ్చిపడింది.

jagan హద్దులు చెరిపేస్తున్నారు..!
సర్వే రాళ్లపై బొమ్మ, పేర్లను తొలగిస్తున్న కార్మికులు

భూముల రీసర్వే పేరుతో హద్దురాళ్లు

అప్పట్లో పాతేందుకు ఒక్కో రాయికి రూ.150 ఖర్చు

నాటి వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం

యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు

కూటమి పాలనలో తొలగింపు ప్రక్రియ

ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ గత వైసీపీ పాలకులు చేపట్టిన సమగ్ర భూసర్వే రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ విధానంతో చివరికి రెవెన్యూ, సర్వే అధికారులకు సైతం లేని తలనొప్పి వచ్చిపడింది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం కాగా.. జగన బొమ్మతో ప్రచారానికి వాడుకున్నదే తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదన్నది బహిరంగ రహస్యమే. భూవిస్తీర్ణాల్లో తేడాలు, ఎల్‌పీఎం నంబర్లతో సమస్యలు తలెత్తి, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసర్వేలో అవకతవకలకు పాల్పడ్డారని రైతులు గగ్గోలు పెట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సమస్యను గుర్తించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం సమగ్ర భూసర్వేపై ప్రత్యేక దృష్టి సారించింది. రాళ్లపై జగన బొమ్మ, పేర్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది.

జగన బొమ్మతో రాళ్లు

రీసర్వేతో రైతులకు మేలు చేకూరిందేమీలేదు. సర్వే రాళ్లపై జగన బొమ్మ, పేరును గత వైసీపీ ప్రభుత్వం ముద్రించింది. దీనిని చాలామంది రైతులు వ్యతిరేకించారు. అయినా అప్పట్లో పాలకులు పట్టించుకోలేదు. రైతుల పొలాల్లో రాళ్లపై జగన బొమ్మ ఉండి తీరాల్సిందేనన్న ధోరణితో వ్యవహరించారు.

ఒక్కో రాయికి రూ.150 ఖర్చు

రీసర్వే చేసిన పొలాల్లో పాతిన రాళ్లపై కూడా గత ప్రభుత్వం భారీగా వెచ్చించింది. ఒక్కో రాయికి రూ.150 ఖర్చు చేసింది. రాళ్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 461 గ్రామాలకుగాను 161 ఊర్లలో భూముల రీసర్వే పూర్తి చేశారు. మొత్తంగా 1,34,910 రాళ్లను పొలాల్లో పాతారు. ఇటీవల కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సర్వేరాళ్లపై బొమ్మ, పేర్ల తుడిపివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 35వేల వరకు రాళ్లపై బొమ్మ, పేర్లు తుడిపి వేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా ఈ తంతు పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్వే ద్వారా హద్దులు నిర్ణయించి, పొలాల్లో పాతేందుకు కొనుగోలు చేసిన రాళ్లు రైతుల పొలాల వద్ద, సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణాల్లో వృథాగా దర్శనమిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం రాగానే..

భూరీసర్వే కారణంగా రైతులు పడుతున్న అవస్థలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలోకి రాగానే పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై ఉన్న జగన బొమ్మ, పేర్లను తొలగిస్తామని హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పేర్ల తొలగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.

చురుగ్గా పేర్ల చెరిపివేత:

విజయశాంతి, ఏడీ, సర్వే భూరికార్డుల శాఖ, శ్రీసత్యసాయి జిల్లా

జిల్లాలో సర్వే హద్దురాళ్లపై పేర్లు తొలగించే ప్రక్రియను వేగంగా చేయిస్తున్నాం. ఎప్పటికప్పుడు సిబ్బంది ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నాం. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలాంటి గడువూ లేదు.

Updated Date - Dec 02 , 2024 | 11:21 PM