Share News

HOSPITAL : డబ్బు రోగం!

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:21 AM

అనంత పురం రూరల్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ టీచర్‌ కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సాయినగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి మూడు రోజుల కిందట తీసుకొచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయిని పరీక్షించిన డాక్టర్‌ ఇది డెంగీ ఫీవర్‌లా ఉంది. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయి. ఇక్కడే అడ్మిషన చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ టీచర్‌ ఆందోళనతో డాక్టర్‌ చెప్పినట్లు చేశాడు. ప్రతి రోజూ సగటున రూ.12వేలు వరకు ఫీజు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రూ. 36వేలు వరకు బిల్లు ...

HOSPITAL : డబ్బు రోగం!
Fever victims being treated in the hospital

డెంగీ పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా

ప్లేట్‌లెట్స్‌ తగ్గాయంటూ భయపెట్టి దోపిడీ

సాధారణ టెస్ట్‌లతోనే నిర్ధారణ.. చికిత్స

పట్టించుకోని జిల్లా వైద్యశాఖ అధికారులు

- అనంత పురం రూరల్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ టీచర్‌ కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సాయినగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి మూడు రోజుల కిందట తీసుకొచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయిని పరీక్షించిన డాక్టర్‌ ఇది డెంగీ ఫీవర్‌లా ఉంది. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయి. ఇక్కడే అడ్మిషన చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ టీచర్‌ ఆందోళనతో డాక్టర్‌ చెప్పినట్లు చేశాడు. ప్రతి రోజూ సగటున రూ.12వేలు వరకు ఫీజు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రూ. 36వేలు వరకు బిల్లు అయ్యింది. కానీ జబ్బు తగ్గలేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకెంత బిల్లు వేస్తారోనని ఆ టీచర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- కళ్యాణదుర్గానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తీవ్రజ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గుత్తి రోడ్డుకు ఉన్న ఓప్రెవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ అతడిని పరీక్షించిన డాక్టర్‌ ‘చాలా నీరసంగా ఉన్నారు. ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గిపోయాయి. అడ్మిషన చేయాలి’ అని సూచించారు. బంధువులు భయపడి అడ్మిట్‌ చేశారు. ఆతర్వాత రకరకాల పరీక్షలు చేయించి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు రూ.58వేలు బిల్లు వేశారు.


- ఉరవకొండ మండలానికి చెందిన ఓ మహిళ జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో బాధపడుతుండగా చికిత్స కోసం జిల్లాకేంద్రంలోని నడిమివంక వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్లేట్‌ లెట్స్‌ తగ్గిపోయాయి. వెంటనే ఎక్కించుకోవాలి లేకపోతే ప్రమాదమన్నారు. దీంతో దాదాపు రూ. 12వేలు వెచ్చించి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించారు. ఇక్కడ ఆస్పత్రిలో నాలుగు రోజులు ఉన్నందుకు, డాక్టర్లు, ఇతరత్ర ఖర్చుల కింద రూ.32వేలు బిల్లు వేసినట్లు బాధితుడు తెలిపాడు.

- పై సంఘటనలు మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దందాకు వందల సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన జిల్లా వైద్య శాఖ అధికారులు మిన్నకుండిపోవడంతోనే ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయి.

- అనంతపురం టౌన


ప్రైవేట్‌లో సాధారణ పరీక్షలతో డెంగీ నిర్ధారణ

ప్రైవేట్‌ ఆస్పత్రులలో ప్రభుత్వ వైద్యశాఖల నిబంధనలకు విరుద్ధంగా డెంగీ గా నిర్ధారించి వైద్యం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డెంగీ నిర్ధారణకు ల్యాబ్‌లలో ఎలీసా పరీక్షలు నిర్వహించాలి. అందులో పాజిటివ్‌ వస్తేనే డెంగీ ఫీవర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష చేసే అవకాశం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ఆస్పత్రుల్లో మాత్రమే ఉంది. కానీ ప్రెవేటు ఆస్పత్రులు పెట్టుకున్న ల్యాబ్‌లలో ఎనఎస్‌-1 (డెంగీ నానస్ట్రక్చరల్‌ప్రొటీన 1)పేరుతో సాధారణ పరీక్షలు చేయించి డెంగీగా నిర్ధారించి రోగులను భయపెట్టి ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తూ దోపిడీ చేస్తున్నారు. ఒకవేళ రోగిలో డెంగీ లక్షణాలు కనిపిస్తే ఆరోగి వివరాలు డీఎంహెచఓ ఆఫీస్‌కు తప్పనిసరిగా పంపాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం వల్ల ప్రభుత్వ వైద్యశాఖ అప్రమత్తమై ఆరోగికి ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎలీసా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆరోగి నివసించే ప్రాంతాలలో డెంగీ జ్వరాలు ప్రబలుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రైవేటు ఆస్పత్రులు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. అయినా ఈసీజనలో ఏ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లినా చికిత్స పొందుతున్న వారిలో పదులు సంఖ్యలో డెంగీ జ్వర పీడితులే ఉండటం గమనార్హం.

ఇప్పటికి 37 డెంగీ... మూడే మలేరియా కేసులట !

జిల్లాలో ఈఏడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 37 డెంగీ జ్వరాలు, మూడు మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని జిల్లా వైద్యశాఖ చెబుతోంది. ఇందులో జనవరి నెలలో 08, ఫిబ్రవరిలో 05, మార్చిలో 13, ఏప్రిల్‌లో 04, మేలో 03, జూన నెలలో 04 డెంగీ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. మలేరియా జ్వరాలు జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు కేసులే నమోదయ్యాయట. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో డెంగీ, మలేరియా కేసులు పేరుతో చికిత్స పొందుతుండటం వైద్యశాఖ వర్గాలకు కనబడలేదేమో..!.


డెంగీ పేరుతో దందా

సీజనల్‌ వ్యాధుల కాలం వస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకు పండగే. అమాయక ప్రజల భయాన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. జ్వరం, నొప్పులతో ఆస్పత్రికి వస్తే చాలు... రోగులు, వారి బంధువులకు తెలియని వైద్య పరిభాషలో రకరకాల పేర్లు చెప్పి భయపెడతారు. తర్వాత వివిధ రకాల పరీక్షలు చేయించి, పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, అడ్మిట్‌ కావాల్సిందేనని చెబుతారు. అడ్మిట్‌ అయిన తర్వాత పరీక్షలలో ఇది డెంగీ జ్వరంగా ఉందని అందుకే ప్లేట్‌లెట్స్‌ తగ్గాయంటారు. ఈ ప్లేట్‌లెట్స్‌ సంఖ్య ఇంత ఉండాలి. కానీ ఇంతే ఉన్నాయని చెప్పి వ్యాపారానికి తెరలేపుతున్నారు. అప్పటికే భయంలో ఉన్న రోగి బంధువులు డబ్బులు పోతే పోని రోగం బాగైతే చాలు అని అప్పులు చేసైనా ఆస్పత్రుల్లో బిల్లు కట్టేస్తున్నారు. ఆ భయమే ప్రైవేట్‌ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఎలీసా పరీక్షలతోనే డెంగీ నిర్ధారించాలి

డెంగీని సాధారణ పరీక్షలతో నిర్ధారించలేం. అనుమానపు లక్షణాలు ఉంటే వారి సమాచారం జిల్లా వైద్యశాఖకు ఇస్తే మేము వెళ్లి రక్తనమూనాలు సేకరిస్తాం. వాటిని ప్రభుత్వ వైద్యకళాశాల ల్యాబ్‌కు పంపి ఎలీసా పరీక్ష చేయిస్తాం. అక్కడ పాజిటివ్‌ వస్తేనే ఆ కేసు డెంగీగా గుర్తించబడుతుంది. అలాకాకుండా సాధారణ టెస్టులు చేసి డెంగీ అంటూ రోగులను భయపెట్టటడం చట్టవిరుద్ధం. మాకు సమాచారం ఇవ్వని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కలెక్టరు, డీఎంహెచఓల దృష్టికి తీసుకెళతాం. జిల్లాలో డెంగీ పేరుతో జరిపే దందాలను అరికడతాం.

- డాక్టర్‌ ఓబులు, డీఎంఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 03 , 2024 | 12:21 AM