POLITICAL : కదులుతున్న కుర్చీలు
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:58 PM
టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పీఠాలు కదులుతున్నాయి. ఎంపీపీ, మున్సిపల్ చైర్మన పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు.. అసమ్మతిని ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగకపోవడం, నిధులు, బిల్లుల విషయంలో వివక్ష చూపడంతో వైసీపీకి చెందిన కొందరు రగిలిపోతున్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో కొందరు
ఎంపీపీలపై వైసీపీ ఓటమి ప్రభావం
టీడీపీ, బీజేపీ వైపు ఎంపీటీసీల చూపు
బుజ్జగింపులకు దిగినన పామిడి ఎంపీపీ
కంబదూరు, బ్రహ్మసముద్రంలో ఒప్పందం గొడవ
ఉషశ్రీ చరణ్ వలస.. పట్టించుకోని తలారి రంగయ్య
టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పీఠాలు కదులుతున్నాయి. ఎంపీపీ, మున్సిపల్ చైర్మన పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు.. అసమ్మతిని ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగకపోవడం, నిధులు, బిల్లుల విషయంలో వివక్ష చూపడంతో వైసీపీకి చెందిన కొందరు రగిలిపోతున్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో కొందరు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించేందుకు నాలుగేళ్ల నిబంధన ఉన్నా.. ఇక తమ పదవి దినదిన గండమేనని పలువురు ఎంపీపీలు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడిలో ఇదే పరిస్థితి నెలకొంది.
పామిడి/కళ్యాణదుర్గం, జూలై 3: పామిడి ఎంపీపీ భోగాతి మురళీ మోహన రెడ్డికి అసమ్మతి సెగ తగులుతోంది. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి చెందిన పలువురు ఎంపీటీసీలు పావులు కదుపుతున్నారు. వైస్ ఎంపీపీ కాయల మహేశ ఇటీవలే టీడీపీలో చేరారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పామిడి నగర పంచాయతీగా ఏర్పడడంతో గ్రామీణ ప్రాంతాలలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎదురూరు, గజరాంపల్లి, దేవరపల్లి, ఖాదర్‌పేట, రామగిరి, పాళ్యం తండా, ఎద్దులపల్లి, వంకరాజుకాలువ స్థానాలు ఉన్నాయి. ఎదురూరు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి భోగాతి మురళీ మోహనరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ వర్గీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఎంపీటీసీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. దీంతో వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు.
- టీడీపీ అధినాయకత్వం వద్దన్నా.. ఆ పార్టీకి చెందిన కొందరు తెగింపు ప్రదర్శించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో వంకరాజుకాలువ ఎంపీటీసీ ఎల్.సువర్ణ ఒకరు. ఆమె వైసీపీ అభ్యర్థి ఎం.జయమ్మపై 424 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎద్దులపల్లి స్థానంలో వైసీపీ అభ్యర్థి చుక్కలూరు రామకృష్ణారెడ్డిపై బీజేపీ సీనియర్ నాయకుడు గండికోట సుధాకర్‌శర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. అనూహ్యంగా 220 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గజరాంపల్లిలో టీడీపీ అభ్యర్థి సిరిచాటి రామలక్ష్మిపై వైసీపీ అభ్యర్థి రంగమ్మ 871 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ సర్పంచుగా కూడా రంగమ్మ గెలవడంతో.. ఎంపీటీసీ పదవిని వదులుకున్నారు. ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గవ్వల ఆదిలక్ష్మిపై టీడీపీ అభ్యర్థి సిరిచాటి రామలక్ష్మి 202 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
- వైసీపీ అభ్యర్థులు ఖాదర్‌పేటలో కాయల మహేష్, పాళ్యంతండాలో నీలాబాయి, రామగిరిలో ఎం.రాజశేఖర్, దేవరపల్లిలో నక్కా సౌభాగ్య గెలిచారు. ఇలా.. మొత్తం ఎనిమిదింటిలో ఐదు వైసీపీ, రెండు టీడీపీ, ఒక స్వతంత్ర ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో వైస్ ఎంపీపీ కాయల మహేష్ టీడీపీలోకి చేరడంతో వైసీపీ బలం నాలుగుకు తగ్గింది. టీడీపీ బలం మూడుకు చేరింది. దీనికితోడు స్వతంత్ర ఎంపీటీసీ అయిన బీజేపీ నాయకుడి మద్దతూ టీడీపీకే ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ఇప్పటికే నలుగురేసి ఎంపీటీసీలతో తూకం సమంగా ఉంది. ఎక్స్ అఫీషియో హోదా లో ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఓట్లు ఉంటాయి. వైసీపీ నుంచి ఇంకొక ఎంపీటీసీ త్వరలో టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీపీ పదవిలో వైసీపీ నాయకుడు ఉన్నా.. ఏటికి ఎదురీత తప్పదని స్పష్టమౌతోంది.
అసంతుష్టులతో మంతనాలు
అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ ఎంపీటీసీలతో ఎంపీపీ భోగాతి మురళీమోహనరెడ్డికి అనుకూలమైన నాయకులు మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలకు పనుల మంజూరు, చేసిన పనులకు బిల్లులు ఇచ్చే విషయంలో ఎంపీపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై ఆ ఇద్దరు ఆవేదనను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ద్వేషించిన ఎంపీటీసీలపైనే ప్రస్తుతం ఎంపీపీ భవితవ్యం ఆధారపడి ఉండటం ఉత్కంఠ రేపుతోంది. ఆ ఇద్దరిని సంతృప్తి పరిచేందుకు తాయిళాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అంతా ఆమే చేశారు..!
వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ నియంతృత్వ పోకడలకు పోయారు. పార్టీలో ఆమె ఏది చెబితే అది వినాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆమె ఇక్కడ లేరు. పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇన్నాళ్లూ అణచివేతకు గురైనవారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కంబదూరు, బ్రహ్మసముద్రం ఎంపీపీ పదవుల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ రెండు పీఠాలకు అప్పట్లో భారీగా పోటీ ఉన్నింది. దీంతో రెండున్నరేళ్లు చొప్పున రెండు వర్గాలవారు పంచుకునేలా అప్పటి మంత్రి ఒప్పించారు. మొదట పదవి తీసుకున్నవారు ఇప్పుడు దిగేందుకు ససేమిరా అంటున్నారు. ఒప్పంద కుదిర్చిన ఉష శ్రీచరణ్ స్థానంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జ్‌గా తలారి రంగయ్యకు బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ రెండున్నరేళ్ల గోల ఆయన దృష్టికి వెళ్లింది. ఎన్నికలలో ఓటమితో ఆయన నైరాశ్యంలో ఉన్నారు. ‘అప్పట్లో ఏం ఒప్పందాలు జరిగాయో నాకేం తెలుసు..?’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
దిగుతారా..? దించేస్తారా..?
- కంబదూరు ఎంపీపీగా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన తిమ్మరాజమ్మ ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన తలారి రంగయ్య మౌనంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో కురుబ సామాజికవర్గానికి రావాల్సిన ఎంపీపీ పదవిని తన స్వార్థం కోసం ఉష శ్రీచరణ్ వాల్మీకులకు ఇచ్చారని వైరి వర్గంవారు మండిపడుతున్నారు. కురుబ సామాజికవర్గం నుంచి రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ప్రస్తుతం ఎంపీపీ రేసులో ఉన్నారు. ఆమెకు 13 మంది ఎంపీటీసీలు మద్దతుగా ఉన్నారు.
- బ్రహ్మసముద్రం ఎంపీపీ చంద్రశేఖర్‌రెడ్డి పదవి నుంచి దిగే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారట. ఎంపీపీ పదవి కోసం నాటి మంత్రికి రూ.35 లక్షలు ఇచ్చానని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. దీంతో ఒప్పందం ప్రకారం మిగిలిన రెండున్నరేళ్లపాటు ఎంపీపీ పదవిని ఆశిస్తున్న నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ కురుబ రేణుకమ్మ లోలోపలే మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని 10 మంది ఎంపీటీసీలు తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆమె అంటున్నారు.
ఉండాలా..? పోవాలా..?
కంబదూరు, బ్రహ్మసముద్రం ఎంపీపీ పదవులను సెకెండ్ హాఫ్‌లో ఆశిస్తున్నది కురుబ సామాజికవర్గం నాయకులే. అప్పట్లో మంత్రి ఉష శ్రీచరణ్ చివరి రెండున్నరేళ్లు పదవులు ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఒప్పుకున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు నిలదీస్తున్నారు. కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పట్టించుకోకపోతే పార్టీ మారేందుకూ సిద్ధమని తేల్చి చెబుతున్నారు. బ్రహ్మసముద్రం మండలంలో పది మంది ఎంపీటీసీలతో పాటు నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ మండలంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నారు. కంబదూరు మండలానికి చెందిన ఎంపీటీసీలు కూడబలుక్కుని వైసీపీకి స్వస్తి పలికి, బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
బొమ్మనహాళ్‌లోనూ ముసలం
ఎంపీపీ పద్మ రాజీనామాకు డిమాండ్
బొమ్మనహాళ్, జూలై 3: ఎంపీపీ పద్మ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఉప్పరహాళ్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి స్వగ్రామం ఎల్‌బీ నగర్‌లో బుధవారం అసమ్మతి వర్గీయులు సమావేశం నిర్వహించారు. బొమ్మనహాళ్ ఎంపీటీసీ శివశరణమ్మ భర్త యువరాజు, ఉద్దేహాళ్ ఎంపీటీసీ భర్త కోటేశ్వరరెడ్డి, కొళగానహళ్లి ఎంపీటీసీ తిమ్మప్ప, నేమకల్లు ఎంపీటీసీ చిక్కణ్ణ, బండూరు ఎంపీటీసీ అమరేష్ తదితరులు హాజరై.. టీడీపీ నాయకుడు ముల్లంగి నారాయణస్వామితో చర్చించారు. ఎంపీపీ పద్మ తన పదవికి రాజీనామా చేసి బలనిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును కలిసి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని అన్నారు. తన భార్య పదవిని అడ్డు పెట్టుకుని ఎంపీపీ పద్మ భర్త చంద్రశేఖర్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకు ఎంపీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేదంటే ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. త్వరలో జరిగే మండల సర్వసభ్య సమావేశాన్ని కూడా బహిష్కరిస్తామని అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....