Share News

నైట్‌ డ్యూటీ..!Night duty..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:47 AM

ఇన్నాళ్లూ కార్యాలయం గురించి పెద్దగా పట్టించుకోని ఆ తహసీల్దారు.. బదిలీ నేపథ్యంలో రాత్రికి రాత్రే పనులను పూర్తి చేసేశారు. ఎలాగూ బదిలీ అవుతానని భావించి.. కొన్నాళ్లుగా కార్యాలయానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లను పెద్ద ఎత్తున బదిలీ చేసింది.

నైట్‌ డ్యూటీ..!Night duty..!
కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం

బదిలీ తహసీల్దారు సిన్సియారిటీ

హడావుడిగా పాసుపుస్తకాల జారీ

ఓ వీఆర్వో ద్వారా రూ.3 లక్షల డీల్‌

ఉన్నతాధికారుల మందలింపు..?

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 1: ఇన్నాళ్లూ కార్యాలయం గురించి పెద్దగా పట్టించుకోని ఆ తహసీల్దారు.. బదిలీ నేపథ్యంలో రాత్రికి రాత్రే పనులను పూర్తి చేసేశారు. ఎలాగూ బదిలీ అవుతానని భావించి.. కొన్నాళ్లుగా కార్యాలయానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లను పెద్ద ఎత్తున బదిలీ చేసింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఓ మండల తహసీల్దారు కూడా బదిలీ అయ్యారు. పోతూ పోతూ.. రూ.3 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని, బుధవారం రాత్రికి రాత్రే కొందరికి పట్టాదారు పాసుపుస్తకాలు చేసి ఇచ్చారని సమాచారం. ఈ డీల్‌ నేపథ్యంలో రాత్రి కార్యాలయంలోనే ఉండాలని కంప్యూటర్‌ ఆపరేటర్‌కు ముందుగానే సమాచారం ఇచ్చారని తెలిసింది. మండల కేంద్రానికి చెందిన ఓ వీఆర్వో ద్వారా ఈ డీల్‌ కుదిరినట్లు తెలిసింది. కేవలం ముగ్గురు మాత్రమే కంప్యూటర్‌ ఆపరేటర్‌ గదిలోకి వెళ్లి, కార్యాలయం బయట తలుపులు వేసి మరీ పనిని ముగించేశారు. అప్పటికే ఎంపిక చేసుకున్న పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేసినట్లు తెలిసింది.

అనుకున్నదే తడవుగా..

ఒక పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయాలంటే వీఆర్‌వో, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారు సంతకాలతో కూడిన ఓ ఫైల్‌ ఉండాలి. ఇంత తతంగం పూర్తి అయ్యాక, విచారించిన అనంతరమే పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేస్తారు. ఈ నిబంధనలు ఏవీ పాటించకుండా, ఒకే ఒక్క వీఆర్‌వోను పక్కన పెట్టుకుని, డిజిటల్‌ కీ ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేశారని సమారాచం. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ఉన్నతాధికారి వెంటనే తహసీల్దారుకు ఫోన చేసి మందలించినట్లు తెలిసింది. దీంతో తహసీల్దారు డిజిటల్‌ కీ తీసుకుని కంగారుపడుతూ తన వాహనంలో వేగంగా వెళ్లిపోయారు.

ఇంతకీ ఏం చేశారు..?

బదిలీ అయిన తహసీల్దారు రాత్రి కార్యాలయానికి రావడం అనుమానాలకు తావిస్తోంది. పట్టా భూములకు పాసు పుస్తకాలు చేశారా? లేక డి-పట్టా భూములను మ్యుటేషన చేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. డి-పట్టా భూముల మ్యుటేషనకు ప్రభుత్వ అనుమతులు లేవని ఇన్నాళ్లుగా నెట్టుకొచ్చిన ఆ తహసీల్దారు.. ఇప్పుడు వాటికే పాసు పుస్తకాలు మంజూరు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.

గతంలోనూ వివాదాలు

పాసుపుస్తకాల విషయంలో తహసీల్దారు అడ్డగోలుగా వ్యవహరించారని కార్యాలయ సిబ్బంది అంటున్నారు. గతంలోనూ ఈ వ్యవహారం రచ్చకెక్కింది. పట్టాదారు పాసుపుస్తకాల అడ్డగోలు వ్యవహారాలపై తహసీల్దారు, ఆర్‌ఐ పలుమార్లు కార్యాలయంలోనే వాగ్వాదానికి దిగారని, దూషించుకున్నారని ఆ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. అక్రమాల కారణంగా వెబ్‌ల్యాండ్‌ అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందని సమాచారం. తహసీల్దారు కార్యాలయం వేదికగా లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. అర్హులకు పట్టాదారు పాసుపుస్తకాలు చేయాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టే అధికారులు, ఇలా అడ్డగోలు వ్యహారాలకు రాత్రిళ్లూ పనిచేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు కార్యాలయంలో రాత్రికి రాత్రి జరిగిన తంతుపై కలెక్టర్‌ స్పందించి.. విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:47 AM